ఆకలి.. ఆకలి.. ఆకలి.. 53 దేశాల్లో ఆకలి కేకలు...

గురువారం, 4 ఏప్రియల్ 2019 (09:55 IST)
ప్రపంచం టెక్నాలజీ పరంగా ఎంతగానే అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఆకలి మాత్రం తీర్చలేకపోతున్నారు. ఫలితంగా జానెడు పొట్ట నింపుకునేందుకు మనిషి పడరాని పాట్లు పడుతున్నాడు. అంతరిక్షంలోకి దూసుకుపోతున్న ఈ రోజుల్లో కూడా ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 53 దేశాల్లోని 11.3 కోట్ల మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. కనీసం ఒక పూట కూడా కడుపు నింపుకోలేని దుస్థితిలో ఉన్నారు. ఈ విషయాన్ని సాక్షాత్ ఐక్యరాజ్య సమితి అధికారికంగా వెల్లడించింది. 
 
గత 2018లో సంభవించిన అంతర్యుద్ధాలు, వాతావరణ వైపరీత్యాల వల్ల 11.3 కోట్ల మంది అంటే 113 మిలియన్ల మంది తీవ్రమైన ఆకలితో అలమటించిపోయారని ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఈ దుస్థితి ఎక్కువగా ఆఫ్రికా దేశాల్లోనే కనిపించిందని తెలిపింది. ఆహార సంక్షోభానికి సంబంధించి 2019 నివేదికను ఐరాస ఈనెల 2వ తేదీన విడుదల చేసింది. 
 
ప్రపంచ వ్యాప్తంగా 53 దేశాల్లో ఆకలి తీవ్రత ఉందని ఈ నివేదిక వెల్లడించింది. ఆకలి తీవ్రతను ఎదుర్కొన్న వారిలో ఎనిమిది దేశాలకు చెందిన ప్రజలు ఉన్నారని.. ఈ ఎనిమిది దేశాల్లో యెమెన్, కాంగో, సిరియా, ఆఫ్ఘనిస్థాన్ దేశాలున్నాయని నివేదిక వెల్లడించింది. ఒక్క ఆఫ్రికా ప్రాంతంలోనే 7.2 కోట్ల మంది ఆకలి కేకలతో అలమటించారని.. సంఘర్షణలు, అభద్రత, ఆర్థికపరమైన సమస్యలు, కరవు, వరదలు వంటి పలు కారణాలే ఈ ఆకలికి ప్రధాన కారణమని ఐక్యరాజ్యసమితి తన నివేదికలో పేర్కొంది. 
 
సిరియాలో అంతర్యుద్ధం, మయన్మార్‌లో అశాంతి వల్ల రోహింగ్యాలు బంగ్లాదేశ్‌కు వలస వెళ్లడం వంటి పరిస్థితులు ఆకలి తీవ్రతకు అద్దం పడుతున్నాయని వెల్లడించింది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటైన భారత్‌లో కూడా ఆకలి కేకలు వినిపిస్తున్నాయని తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం అక్కడ.. వ్యభిచారం చేస్తే రాళ్ళతో కొట్టి చంపుతారు.. చోరీ చేస్తే కాళ్లు నరికేస్తారు...