ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌ను తాలిబన్లు ఆగస్ట్ 15న మెరుపు వేగంతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జర్నలిస్టులు, సహాయక సిబ్బంది, ఇతర ప్రముఖులతో కలిపి మొత్తం 188 మందిని కాబూల్ నుంచి అబుదాబి మీదుగా మెక్సికో సిటీకి తరలించేందుకు ఫేస్‌బుక్, లింక్డ్ఇన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ వంటి వారి ఆర్థిక సహకారంతో ఆగస్ట్ 30న ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు.
అయితే ఆ విమానం అబుదాబి చేరే సరికి ఊహించని విధంగా 155 మంది ఆఫ్ఘనిస్థాన్‌లు అందులో అధికంగా ఉన్నారు. కామ్ ఎయిర్ సంస్థకు చెందిన ఉద్యోగులు, వారి కుటుంబాలు, మరి కొందరు అందులో ప్రయాణించారు. ఈ విమానం అబుదాబి చేరిన తర్వాత ఈ విషయాన్ని అక్కడి అమెరికా, యూఏఈ అధికారులు గుర్తించారు. జాబితాలోని లేని 155 మంది ఆఫ్ఘన్ ప్రయాణికులను అబుదాబిలో వదిలేశారు. జాబితాలో ఉన్న 188 మందిని ఈజిప్ట్ ఎయిర్‌కు చెందిన విమానంలో కైరో మీదుగా మెక్సికోకు తరలించారు.
కాగా, ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఇలా అక్రమంగా అబుదాబికి పలు విమానాల్లో తరలివచ్చిన ఆఫ్ఘన్ల సంఖ్య 3,600 వరకు ఉంటుందని అమెరికా, యూఏఈ అధికారులు అంచనా వేస్తున్నారు. సరైన పత్రాలు లేకుండా వచ్చిన వీరి ఇమ్మిగ్రేషన్, భద్రతా విధానాలపై ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఆఫ్ఘనిస్థాన్ నుంచి తమను సురక్షితంగా తరలించిన ప్రముఖ ప్రైవేట్ సంస్థలకు అబుదాబి చేరిన ఆఫ్ఘన్లు ధన్యవాదాలు చెబుతున్నారు.