భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పశ్చిమ ఉక్రెయిన్ ప్రాంతాలైన ల్వీవ్, చెర్న్ విట్సిలో క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసింది. పోలెండ్ వెళ్లాలనుకునే భారత విద్యార్థులకు సహకరించేందుకు రష్యన్ భాష మాట్లాడే అధికారులను అక్కడ నియమించింది.
ప్రస్తుతం రష్యా తన సరిహద్దుకు సమీపంలో తూర్పు ఉక్రెయిన్ భాగంలోనే దాడులు చేస్తోంది. దాంతో పశ్చిమ ఉక్రెయిన్‌లో కొద్దిమేర సాధారణ వాతావరణం కనిపిస్తోంది. భారత్‌కు చెందిన మరో విద్యార్థుల బృందం ఉక్రెయిన్-రుమేనియా సరిహద్దుల వద్దకు వెళ్లినట్టు తెలుస్తోంది.
భారత కేంద్ర ప్రభుత్వం ఉక్రెయిన్ నుంచి భారత విద్యార్థులను తరలించేందుకు ప్రత్యేక విమానాలు పంపిస్తున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌తో సరిహద్దులు పంచుకుంటున్న దేశాల ద్వారా భారత విద్యార్థులను స్వదేశానికి తరలించాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. బుడాపెస్ట్‌కు రెండు చార్టర్డ్ విమానాలు ఇవాళ బయల్దేరనుండగా, బుడాపెస్ట్‌కు ఓ విమానం రేపు బయల్దేరనుంది.
తాజాగా, 40 మంది భారత విద్యార్థుల బృందం 8 కిలోమీటర్లు నడిచి పోలెండ్ సరిహద్దు వద్దకు చేరుకున్నారు. వారందరూ ల్వీవ్ నగరంలోని ఓ మెడికల్ యూనివర్సిటీలో వైద్య విద్య అభ్యసిస్తున్నారు. ఉక్రెయిన్ గగనతలం మూసివేయడంతో వారు స్వదేశం చేరేందుకు ఆరాటపడుతున్నారు.