Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్పైడర్ మ్యాన్ కావాలని చచ్చిబతికిన అన్నదమ్ములు.. ఎలా?

Advertiesment
స్పైడర్ మ్యాన్ కావాలని చచ్చిబతికిన అన్నదమ్ములు.. ఎలా?
, మంగళవారం, 26 మే 2020 (17:13 IST)
వెండితెరపై స్పైడర్ మ్యాన్ సాహసాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ స్పైడర్ మ్యాన్‌ మాయలో పడిపోయిన కొందరు చిన్నారులు కూడా అదే తరహా సాహసాలు చేసి ప్రమాదంలోపడిన సంఘటనలు అనేకం ఉన్నాయి. తాజాగా ముగ్గురు అన్నదమ్ములు స్పైడర్ మ్యాన్ కావాలని విషపు పురుగులతో విషపూరిత సాలీడుతో కుట్టించుకున్నారు. దీంతో ఆ ముగ్గురు అన్నదమ్ములు మరణం అంచుల వరకు వెళ్లారు. అయితే వైద్యులు పుణ్యమాని వారు తిరిగి కోలుకున్నారు. ఈ ఘటన బొలీవియా దేశంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బొలీవియా దేశానికి చెందిన 8, 10, 12 యేళ్ళ వయస్సున్న ముగ్గురు అన్నదమ్ములు స్పైడర్ మ్యాన్‌లా మారాలని భావించారు.
 
అచ్చం స్పైడర్ మ్యాన్‌లా మారేందుకు వీలుగా ఈ నెల 14వ తేదీన ఓ ప్రమాదకర బ్లాక్ విడో సాలీడును పట్టుకుని దాన్ని ఓ కర్రతో పొడిచారు. అది ప్రతిస్పందనగా కుట్టడం ప్రారంభించింది. అన్నదమ్ములు ముగ్గురూ వరుసగా దాంతో కుట్టించుకున్నారు. 
 
స్పైడర్ మ్యాన్ లక్షణాలు కనిపించలేదు సరికదా, కాసేపటికే కళ్లు తేలేయడం మొదలుపెట్టారు. దాంతో తల్లి ఆందోళనకు గురై వారిని ఆసుపత్రిలో చేర్చింది. అప్పటికే సాలీడు విషం శరీరం మొత్తం పాకడంతో వారి పరిస్థితి విషమించింది. దాంతో వారిని మరో ఆసుపత్రికి తరలించారు.
 
అక్కడ కూడా ప్రయోజనం కనిపించకపోవడంతో లాపాజ్‌లోని చిన్నపిల్లల ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వారు జ్వరం, వణుకు, ఒళ్లంతా చెమటలు పట్టడం, కండరాల నొప్పితో బాధపడుతున్నారు. లాపాజ్ ఆసుపత్రి వైద్యులు ఎంతో శ్రమించి వారిని ఆరోగ్యవంతుల్ని చేశారు. 
 
మరో వారం తర్వాత ఆ ముగ్గురు అన్నదమ్ములు డిశ్చార్జి కానున్నారు. దీనిపై బొలీవియా ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని ఎపిడెమాలజీ చీఫ్ వర్జీలియో పీట్రో మాట్లాడుతూ, సినిమాల్లో చూపించేదంతా నిజం కాదని పిల్లలు తెలుసుకోవాలని, ఈ ఘటన వారికో కనువిప్పు వంటిదని అభిప్రాయపడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం..