నేపాల్‌లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా నారాయణి సహా ఇతర ప్రధాన నదులు పొంగి పొర్లుతున్నాయి. దేశ వ్యాప్తంగా వారాంతంలో భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడటంతో మరణించిన వారి సంఖ్య 54కి చేరింది. ఇంకా 41 మంది గల్లంతైనట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
ఒక్క మయాగ్డి ప్రాంతంలోనే 27 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. కొండచరియలు విరిగిపడటంతో పలు ప్రాంతాల్లో ఇళ్లు నేలమట్టమయ్యాయి. దీంతో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.
స్థానిక పాఠశాల భవనాలు, కమ్యూనిటీ కేంద్రాల్లో ప్రస్తుతం జనం తలదాచుకున్నారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని గుర్తిస్తున్నామని సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టినట్లు అధికారులు చెప్పారు. అయితే భారీ వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతినడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని అక్కడి స్థానిక మీడియా తెలిపింది.