Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మోనోపాజ్ సమయంలో ఏం చేస్తారు..? ఇలా చేయండి... ఎలా..?

Advertiesment
menopause
మహిళల జీవితంతో రుతుక్రమం ఆగే సమయాన్నే ఇంగ్లీషులో మోనోపాజ్ అంటారు. ఈ సమయంలో శరీరంలో జరిగే మార్పుల కారణంగా మహిళలు రకరకాల మానసిక ఒత్తిడికి లోనవుతుంటారు. శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పడుతుంటారు. అయితే కొన్ని పద్దతులను పాటించడం ద్వారా వీటన్నింటిని అధిగమించవచ్చు. అవి ఏంటి? 
 
సాధారణంగా మహిళలకు 40-45 ఏళ్లు దాటాక నెలసరి నిలిచిపోతుంటుంది. వరసగా 12 నెలల పాటు నెలసరి రాకుండా ఉంటే దాన్ని మెనోపాజ్‌ దశగా గుర్తిస్తారు. ఇలా నెలసరి నిలిచిపోవటానికి ప్రధాన కారణం సంతానం కలగటానికి, రుతుక్రమానికి దోహదం చేసే ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టిరాన్‌ హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోవటం.  ఫలితంగా వేడి ఆవిర్లు, గుండెదడ, ఏకాగ్రత లోపించటం వంటి లక్షణాలు కనబడతాయి. కొన్ని జాగ్రత్తలతో ఈ లక్షణాల నుంచి ఉపశమనం పొందొచ్చు.
 
నెలసరి నిలిచినవారిలో హఠాత్తుగా వేడి ఆవిర్లు ఛాతీ నుంచి ఆరంభమై తల వరకు పాకుతుంటాయి. దీంతో రాత్రిపూట చెమట్లు కూడా పడుతుంటాయి. చెమట వచ్చిన తర్వాత కొందరిలో చలి కూడా రావొచ్చు. కాటన్‌ వంటి సహజమైన దారాలతో కూడిన వస్త్రాలను, తేలికగా తొలగించటానికి అనువైన దుస్తులను ధరించాలి. కాఫీ, మద్యం, మసాలాల వంటివి తీసుకున్నప్పుడు వేడి ఆవిర్లు వస్తున్నట్టు గుర్తిస్తే అలాంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. 
 
 రాత్రిపూట చెమట్లు పట్టటం వల్ల తరచుగా నిద్రలో మెలకువ కూడా వస్తుంటుంది. రోజూ ఒకే సమయానికి పడుకోవటం అలవాటు చేసుకోవాలి. నిద్రపోవటానికి ముందు కాఫీ, మద్యం వంటివి తీసుకోకూడదు. పడకగదిలో టీవీ, కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌ వంటి వినోద సాధనాలేవీ లేకుండా చూసుకోవాలి. ఉదయం, మధ్యాహ్నం వేళల్లోనే వ్యాయామం చేయాలి. నిద్ర పట్టకపోతే మంచం మీది నుంచి లేవాలి. 
 
వేడి ఆవిర్లతో పాటు గుండె వేగంగా కొట్టుకోవటం కూడా మెనోపాజ్‌ దశలో కనబడుతుంది. 
పరిష్కారం: గుండె వేగంగా కొట్టుకునేవారు డాక్టర్‌ను సంప్రదించి ఇతరత్రా గుండె సమస్యలేమైనా ఉన్నాయేమో పరీక్షించుకోవటం మేలు. నెలసరి నిలిచి పోవటం వల్ల జననాంగం పొడిబారుతుంటుంది. ఇది సంభోగ సమయంలో ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. మూత్రాశయ ఇన్‌ఫెక్షన్ల ముప్పూ పెరగొచ్చు. 
పరిష్కారం: డాక్టర్‌ సలహా మేరకు ఈస్ట్రోజెన్‌ క్రీమ్‌, మాత్రల వంటివి వాడుకోవటం ఉపయోగపడుతుంది. జననాంగ కణజాలాలను మందంగా, బలంగా చేసే ఈస్ట్రోజెన్‌ రహిత మాత్రలు కూడా మేలు చేస్తాయి.
 
చర్మం సాగే గుణం తగ్గిపోవటం, పొడిబారటం, దురద వంటి సమస్యలూ మెనోపాజ్‌లో కనిపిస్తాయి. ఒంట్లో నీటిశాతం తగ్గకుండా తగినంత నీరు తాగాలి. మరీ వెంట వెంటనే స్నానం చేయటం మంచిది కాదు. హార్మోన్ల సమతుల్యత దెబ్బతినటం వల్ల పార్శ్వనొప్పి, ఇతర తలనొప్పులు తీవ్రం కావొచ్చు. తలనొప్పి ఎప్పుడెప్పుడు వస్తుందో అనేది ఒక చోట రాసుకోవాలి. గతంలో నెలసరి వచ్చే సమయానికి సంబంధమేదైనా ఉందేమో దీని ద్వారా తెలుసుకోవచ్చు.  

Share this Story:

Follow Webdunia telugu