Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రావణ మారీచుల సంభాషణ: సీతంటే ఎవరనుకున్నావు? మారీచుని హితబోధ

రావణ మారీచుల సంభాషణ: సీతంటే ఎవరనుకున్నావు? మారీచుని హితబోధ
, గురువారం, 19 నవంబరు 2015 (18:25 IST)
శూర్పణఖ ప్రేరణతో రావణాసురుడు సీతను తన భార్యగా చేసుకోవాలనుకున్నాడు. మారీచుడిని పిలిచి తన కోరికను చెప్పి అతని సహాయం కోరాడు. అంతకు మునుపు ఒకసారి రాముడి చేతులతో చావుదెబ్బలు తిన్న మారీచుడికి రాముడి పేరు చెప్పగానే తనువంతా వణికిపోయింది. రావణాసురుడిని రాముడి జోలికిపోవద్దని ప్రాధేయపడ్డాడు. రాముడి బలపరాక్రమములను రావణునికి వివరించాడు. ఇక్కడ మారీచుడు రావణునితో చేసిన సంభాషణ చాలా బాగుంటుంది. మారీచుడు రావణునికి, హితబోధ చేశాడు. 
 
''ఓ రాక్షసరాజా! నీ చుట్టూ ఎల్లప్పుడూ నిన్ను పొగిడేవాళ్లు, ప్రియంగా మాట్లాడేవాళ్లు ఉంటారు కానీ నీకు హితము చెప్పే వాళ్లు ఉండరు. ఒకవేళ అలాంటివాళ్లు ఉన్నా నీలాంటి రాజులు వాళ్లు చెప్పే మాటలు వినరు. ఎందుకంటే అవి మీకు చెవులకు ఇంపుగా తోచవు కాబట్టి. 
 
నీవు ఎవరిమీదికైనా యుద్ధానికి పోయేముందు వారి గురించి తెలుసుకోవడానికి గూఢచారులను నియమించావా? అలా నియమించి ఉంటే నీకు రాముని గురించి తెలిసి ఉండేది. నీకు రాముని గురించి ఏమీ తెలియదు అని తెలుస్తూ ఉంది. రాముడు గుణవంతుడు, పరాక్రమవంతుడు. వీరుడు. రాముడు తలచుకుంటే ఈ భూమి మీద రాక్షసుడు అనే వాడు లేకుండా చేయగలడు. రాముడు అంత సమర్థుడు. 
 
ఇప్పుడు నీవు సీత గురించి మాట్లాడుతున్నావు. ఆ సీత నీకు మృత్యువు అయిందేమో అని నా అనుమానం లేకపోతే నీకు సీతను అపహరించవలెనని ఆలోచన పుట్టదు. దానిని నన్ను సాయం అడగవు. సీతాపహరణంలో నేను నీకు సాయం చేస్తే నాకు కూడా మృత్యువు తప్పదు. నీవు లంకారాజ్యానికి రాజుగా ఉన్నందుకు, లంక సర్వనాశనం కాక తప్పదు. నీ వలన లంకావాసులు అష్టకష్టాలు పడక తప్పదు. 
 
ఓ రావణా! నీ వంటివాడు రాజుగా ఉంటే, ఆ రాజే కాదు అతడు పాలించే రాజ్యము కూడా నశించిపోతుంది. ఇంక అసలు విషయం చెబుతాను విను. రాముడు తండ్రిచేత వెళ్లకొట్టబడలేదు. నీకు ఎవరో కల్పించి చెప్పారు. రాజ్యమునుండి వెళ్లగొట్టబడేంత చెడ్డ పనులు చేసేవాడు కాదు రాముడు. రాముడు నీవు అనుకున్నంత లుబ్ధుడు, దుశ్శీలుడు, దుష్టుడు, అధర్మపరుడు కాడు. 
 
అసలు విషయం చెబుతాను విను. దశరథుని భార్య కైక రాముని అడవులకు పంపమని దశరథుని వద్ద వరం కోరితే, తల్లిదండ్రుల మాట ప్రకారం అడవులకు వచ్చాడు రాముడు. కేవలము తండ్రి మాటలను గౌరవించడానికి సమస్త రాజభోగములను, రాజ్యమును విడిచి అరణ్యవాసం చేస్తున్నాడు. అంతేగాని నీవు అనుకున్నట్టు రాజ్యం నుండి వెళ్లగొట్టబడలేదు. 
 
రాముడు సాక్షాత్తు ధర్మస్వరూపుడు. రాముని శరీరమే ధర్మానికి ప్రతీక. రాముడు సాధువు. నిజమైన పరాక్రమవంతుడు. దేవేంద్రునివలె సకలలోకములను పాలించగల సమర్థుడు. రాముని భార్య సీత. రాముడు ఆమెను ఎల్లప్పుడు కంటికి రెప్పలా కాపాడుతుంటాడు. సూర్యుని నుండి తేజస్సును వేరుచేయునట్లు రాముని నుండి సీతను వేరుచేయాలనే దుర్బుద్ధి నీకు ఎలా పుట్టింది? రామబాణము అనే మంటలలోకి నీవు శలభమువలె దూకపోతున్నావు. జాగ్రత్త. నా మాట విను. సుఖంగా రాజ్యం చేసుకో. రాముని జోలికి వెళ్లకు. కోరి కోరి రాముని కోపజ్వాలలో పడి దగ్ధంకాకు. 
 
రాముని రక్షణలో ఉన్నంత కాలము సీతను నీవు హరించలేవు. ఆ సీత కూడా రాముని విడిచి ఉండలేదు. అందుకే కదా సమస్త రాజ భోగములను తృణప్రాయంగా త్యజించి రాముని వెంట అడవులకు వచ్చింది. సీతంటే ఎవరనుకున్నావు? అయోనిజ. మిధిలాధిపతి జనకమహారాజు కూతురు. ఆమె నీవంటి దుర్మార్గాలకు అగ్నిజ్వాల వంటిది. కాబట్టి నా మాట విని సీత జోలికి పోకు. 
 
ఇటువంటి వ్యర్థమైన పనికి ఎందుకు పూనుకుంటావు? సీతను అపహరిస్తే నిన్ను రాముడు ఎదుర్కొంటాడు. రాముని ఎదుటపడ్డ నీకు మరణం తప్పదు. ఎంతోకాలము రాజ్యము పాలిస్తూ, రాజ భోగములు అనుభవించవలసిన వాడివి. అర్థాంతరంగా నీ జీవితాన్ని ఎందుకు అంతం చేసుకుంటావు. నాలుగు కాలాలపాటు బతకాలని వుంటే రాముని జోలికి పోకు. నా జోలికి రాకు. 
 
నా మాట మీద నమ్మకం లేకపోతే... నీ తమ్ముడు విభీషణుడు ఉన్నాడు కదా! అతనితో ఆలోచించు. నీ ఆలోచన మంచిదో కాదో వారిని అడిగి తెలుసుకో. వారు చెప్పినట్టు చెయ్యి. రామునితో వైరం పెట్టుకునేముందు, రాముని బలాన్ని నీ బలాన్ని తులనాత్మకంగా పరిశీలించు. హితాహితములు పరిశీలించి ఒక నిర్ణయం తీసుకో. అంతేగానీ తొందరపాటు నిర్ణయం తీసుకుని కష్టాలుపాలుగాకు. ఇంతెందుకు రాముడితో నా స్వానుభవం గురించి చెబుతాను విను. అప్పుడు నీకు తెలుస్తుంది. రామునితో వైరం మంచిది కాదో'' అని మారీచుడు రామునితో తన అనుభవాన్ని ఈ విధంగా చెప్పాడు. "ఓ దానవేంద్రా! ఆ రోజుల్లో నేను మహాపరాక్రమంతో నాకు ఎదురు ఎవరు లేరనే గర్వంతో భూమి అంతా తిరుగుతుండేవాడిని. చేతిలో పరిఘను ఆయుధంగా ధరించి అడ్డం వచ్చిన మునులను, ఋషులను చంపుతూ, వారి మాంసం తింటూ ఇష్టం వచ్చినట్లు సంచరించే వాడిని. 
 
ఆ సమయంలో విశ్వామిత్రుడు అనే ఋషి ఒక యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞాన్ని మేము భగ్నం చేసేవాళ్లము. మా బాధలు తట్టుకోలేక విశ్వామిత్రుడు రాముని తండ్రి దశరథునికి వద్దకు పోయి "ఓ దశరథ మహారాజా! మారీచుడు అనే రాక్షసుని వలన మాకు చాలా కష్టాలు కలుగుతున్నాయి. వాడివలన మాకు చాలా భయంగా ఉంది. నీవు రాముని పంపి మా యజ్ఞాలను మారీచుని బారినుండి కాపాడు''అని అడిగాడు. దశరథుడు కొంచెం సేపు తటపటాయించి, తర్వాత రాముణ్ణి విశ్వామిత్రుని వెంట పంపాడు. రాముడు విశ్వామిత్రుని యజ్ఞాన్ని రక్షిస్తున్నాడు. 
 
ఇదంతా తెలియని నేను విశ్వామిత్రుని యజ్ఞమును భగ్నం చేయడానికి నా పరిఘను చేత పట్టుకొని అట్టహాసంగా విశ్వామిత్రుని ఆశ్రమానికి వెళ్ళాను. ఆశ్రమంలోకి ప్రవేశిస్తున్న నన్ను చూసి రాముడు తన వింటికి నారి సంధించాడు. నేను రాముని వంక చూసాను. ఇంకా మీసములు కూడా రాని బాలుడు కదా అని రాముని గురించి నేను పట్టించుకోలేదు. నేను గబాగబా విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తున్న వేదిక వద్దకు వెళ్లాను. 
 
రాముడు ఒక బాణమును సంధించి నా మీద ప్రయోగించాడు. ఆ బాణం దెబ్బకు నేను ఎగిరి నూరు యోజనముల దూరంలో ఉన్న సాగరంలో పడ్డాను. ఏం జరిగిందో తెలుసుకొనేటప్పటికి నేను నట్టనడి సముద్రంలో ఉన్నాను. రాముడు నన్ను చంపాలనుకోలేదు. అందుకని సముద్రంలో పడవేశాడు. లేకపోతే నీతో ఇలా మాట్లాడటానికి నేను మిగిలి ఉండేవాడిని కాదు. ఓ రావణా! అప్పుడు రాముడు బాలుడు. ఇంకా అస్త్రవిద్య పూర్తిగా నేర్చుకోలేదు. ఇప్పుడు చూచావుగా రాముని ప్రతాపము. 14వేల మందిని ముహూర్త కాలంలో చంపాడు. కాబట్టి రాముడితో విరోధము పెట్టుకోకు. తరువాత నీ ఇష్టం. 
 
నేను ఇన్ని చెప్పినా వినకుండా సీతను అపహరిస్తే, రాముని కోపాగ్నిలో మాడి మసి అయిపోతావు. నీ లంకా నగరం అంతా నాశనం అయిపోతుంది. నీవు బంధుమిత్రులతో సహా యమసదనానికి ప్రయాణం కడతావు'' అని రావణునికి హితోపదేశం చేశాడు మారీచుడు. తాను చేసిన హితోపదేశములు రావణునికి తలకెక్కలేదని గ్రహించాడు మారీచుడు. ఇంకా తన అనుభవాలు చెప్పడం మొదలెట్టాడు. 
 
"మొదటిసారి రాముని చేతిలో దెబ్బతిన్నాను. రెండోసారి రామ బాణము నుంచి తప్పించుకున్నాను. ఇంక మరలా రాముని జోలికి పోదలచుకోలేదు. అందుకని అప్పటినుండి ముని వృత్తి అవలంబించి ఇక్కడ ఆశ్రమం నిర్మించుకొని సన్యాసిగా జీవించుచున్నావు. జటాజూటములతో, నార చీరలతో ఎవరు కనపడ్డా నాకు రాముడే గుర్తుకువస్తున్నాడు. రాముడు కలలో కనిపించినా భయంతో వణికిపోతున్నాను. అసలు నాకు "ర'' అనే అక్షరంలో ప్రారంభం అయ్యే ఏ వస్తువును చూసినా రాముని చూసినట్టే భయం కలుగుతూంది. నాకు రామబాణము శక్తి తెలుసు కాబట్టి ఇంత చెప్పవలసి వచ్చినది. తర్వాత న ఇష్టం. 
 
నీకు ఇష్టం అయితే రామునితో యుద్ధం చెయ్యి. లేకపోతే మానెయ్యి. కాని నన్ను మాత్రము ఇందులోకి లాగకు. నేను నాలుగు కాలాల పాటు జీవించాలని నీకు ఉంటే, నా ముందు రాముని మాట ఎత్తకు. నీవు చేసే పాపపు పనులకు నన్ను బాధ్యుడ్ని చేయకు. నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో. నేను మాత్రము నీ వెంటరాను. నీకు సాయం చెయ్యను. ఆ రాముడు రాక్షసుల పాలిట మృత్యువు అని నీవు తెలుసుకోలేకపోతున్నావు."
 
మారీచుడు సుదీర్ఘంగా చెప్పిన హితోక్తులు రావణునికి రుచించలేదు. చావబోయేవాడికి అమృతతుల్యమైన ఔషధము రుచించనట్టు మారీచుని మాటలు రావణుని తలకెక్కలేదు. పైగా తనముందు శత్రువు అయిన రాముని మారీచుడు పొగడటం చూసి రావణునికి కోపం వచ్చింది. 
 
"మారీచా! నీవు ఏవేవో వ్యర్థములైన మాటలు మాట్లాడుతున్నావు. వాటివల్ల ఏమీ ప్రయోజనము లేదు. నీవు పొగిడిన రాముడు కేవలం ఒక మానవమాత్రుడు. పైగా మూర్ఖుడు. నీ మాటలు విని ఒక మానవునికి భయపడే పిరికిపంద కాడు ఈ రావణుడు. ఒక స్త్రీ కోరిన కోరికలు తీర్చడానికి, తల్లిదండ్రులను బంధుమిత్రులను విడిచి భార్యతో సహా పారిపోయిన పిరికిపంద ఆ రాముడు. 
 
ఆ రాముడు నా ప్రియాతి ప్రియమైన సోదరుడు ఖరుని చంపాడు. దానికి ప్రతీకారంగా నేను కూడా రాముడు తన ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించే అతని భార్యను అపహరిస్తాను. దానికి నీ సాయం కావాలి. తప్పదు. నేను ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దేవేంద్రుడు దిగివచ్చినా నా నిర్ణయం మార్చుకోను. నేను నిన్ను సాయం చెయ్యమని అడిగాను అంతేకానీ, నా నిర్ణయం తప్పా ఒప్పా అని నేను నిన్ను అడగలేదు. కాబట్టి నీవు అలా మాట్లాడటం తగదు. అయినా, నీ మాటలు నేను పట్టించుకోనవసరం లేదు. 
 
మంత్రులు రాజు అడిగినప్పుడు మాత్రమే తగిన సమాధానము వినయంగా చేతులు కట్టుకుని మరీ చెప్పాలి. అదీ కూడా రాజుకు ఇష్టమైనవి. అంగీకారయోగ్యమైన మాటలు మాత్రమే చెప్పాలి. ఇష్టం వచ్చినట్లు చెప్పకూడదు. 
 
ఓ మారీచా! నీవు చెప్పేది ఎంత హితమైనా, చెప్పే విధానంలో తిరస్కార ధోరణి ఉంటే ఆ హితోక్తులను రాజులు హర్షించరు. నీకు ఆ మాత్రం జ్ఞానం కూడా లేదు. నేను నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు వచ్చాను. అటువంటి నాతో ఇంత పరుషంగా మాట్లాడతావా? నేను నిన్ను సాయం చెయ్యమని అడిగాను. నేను చెయ్యబోయే పని మంచిదా చెడ్డదా? నేను చెయ్యగలనా లేదా? నేను సమర్థుడినా కాదా? అని నేను నిన్ను అడగలేదు. 
 
కాబట్టి నేను చెప్పింది విను. ఈ కార్యంలో నీవు నాకు సాయం చేస్తున్నావు. ఇది నా ఆజ్ఞ. నీవు ఏమి చెయ్యాలో చెబుతాను శ్రద్ధగా విను. నీవు మాయారూపములు ధరించుటలో ప్రజ్ఞాశాలివి. అందుకని నీవు ఒక బంగారు వర్ణము కల లేడి రూపము ధరించు. రాముని ఆశ్రమమునకు వెళ్లు. సీత చూసేట్టు ఆ పరిసరములలో సంచరించు. ఆమె నిన్ను చూచి నీ మీద ఆసక్తి పెంచుకుంటుంది. తర్వాత నీ ఇష్టం. ఎటైనా పరిగెత్తు. 
 
ఓ మారీచా! వెంటనే బయలుదేరు. నేను నీ వెంటనే నా రథం మీద వస్తాను. నీవు రాముని తీసుకుని అడవులలోకి పరిగెత్తు. నేను సీతను అపహరించి లంకకు తీసుకొని వస్తాను. మనం లంకలో కలుసుకుందాము. నేను చెప్పినట్లు చేయకపోతే నిన్ను ఇప్పుడు ఇక్కడే చంపుతాను. లేకపోతే బలవంతంగానైనా నీతో ఈ పనిచేయిస్తాను. రాజును ఎదిరించి ఎవరూ సుఖంగా బతకలేరు అన్న సత్యాన్ని తెలుసుకో. 
 
మారీచా! ఇంకొక విషయం. నీవు రామునిచేతిలో చావవచ్చు. చావకుండా తప్పించుకోవచ్చు. కానీ నేను చెప్పినట్లు చేయకపోతే నా చేతిలో నీ చావు తప్పదు. కాబట్టి బాగా ఆలోచించుకొని ఏది మంచిదో అది చెయ్యి'' అని తన నిర్ణయాన్ని తెలియజేశాడు రావణుడు. - ఇంకా వుంది. 

Share this Story:

Follow Webdunia telugu