శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో భాగంగా అందివచ్చిన ప్రతీ మీడియంను వినియోగించుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం యోచిస్తోంది. ఇందుకోసం ఆ సంస్థ కార్యనిర్వహణాధికారి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ ప్రసారాలు శనివారం నుంచి యూట్యూబ్‌లో ప్రసారం కానున్నాయని ఎస్వీబీసీ సీఈవో మధుసూదన్ రావు గురువారం ప్రకటించారు. యూట్యూబ్ ఇప్పటికే ఆ సంస్థతో టీటీడీ యాజమాన్యం చర్చలు జరిపింది. అంతకు ముందే ఈవో ఎస్వీబీసీ అధికారులతో చర్చించారు.
నెటీజన్లను ఎస్వీబీసీ వైపు తిప్పుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలను ఆయన ఎస్వీబీసీ అధికారులకు సూచించారు. ఇంటర్నెట్ ఆధారంగా ఉన్న ప్రతి మీడియంను వినియోగించుకోవాలని ఆదేశించారు. ఫెస్ బుక్, యూట్యూబ్, ఇలా అన్నింటిని ఎస్వీబీసీకి అనుసంధానం చేయాలని ఆదేశించారు. చివరకు నెట్ సౌకర్యం ఉన్న మొబైళ్ళలో కూడా ఎస్వీబీసీ ప్రసారం జరిగేలా చూడాలని ఆదేశించారు. దీంతో అధికారులు రంగంలోకి దిగారు.
యూట్యూబ్ తో చర్చలు జరిపారు. చానల్ ప్రసారం ద్వారా వచ్చే వ్యాపార ప్రకటనల్లో సగభాగాన్ని టీటీడీకి అందించేందుకు యూట్యూబ్ యాజమాన్యం అంగీకరించింది. వీటికి సంబంధించిన అగ్రిమెంట్లు కూడా ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. మొబైల్ యాప్స్‌లో కూడా చానల్ ప్రసారాలు డౌన్‌లోడ్ చేసుకునేందుకు సాఫ్ట్ వేర్ ను రూపొందిస్తున్నారు.