కార్తీక మాసంలో నదీ స్నానం చేయడంలో ఆంతర్యం ఏమిటో తెలుసా?
కార్తీక మాసం అనగానే కార్తీక పౌర్ణమి రోజు చేసే పుణ్య స్నానాలు గుర్తుకు వస్తాయి. ఈ పుణ్య స్నానం కార్తీక మాసం అంతా చేస్తే శుభం జరుగుతుందని విశ్వాసం. సూర్యడు ఉదయించకముందే, నక్షత్రాలు ఇంకా కనిపిస్తుండగానే కార్తీక మాసంలో, భూమి నుంచి వెలువడిన జలాలతో స్నానం
కార్తీక మాసం అనగానే కార్తీక పౌర్ణమి రోజు చేసే పుణ్య స్నానాలు గుర్తుకు వస్తాయి. ఈ పుణ్య స్నానం కార్తీక మాసం అంతా చేస్తే శుభం జరుగుతుందని విశ్వాసం. సూర్యడు ఉదయించకముందే, నక్షత్రాలు ఇంకా కనిపిస్తుండగానే కార్తీక మాసంలో, భూమి నుంచి వెలువడిన జలాలతో స్నానం చేయాలన్నది పెద్దల నియమం. సహజంగానే కార్తీక మాసం అంటే చలి పుంజుకునే సమయం. జ్యోతిష్యశాస్త్ర ప్రకారం ఈ మాసంలో సూర్యుడు తులారాశిలో వుంటాడు. సూర్యునికి ఇది నీచ స్థానం.
అంటే సూర్యుని ఉష్ణోగ్రత ఈ మాసం అంతా తక్కువగా వుంటుంది. చలికాలం ప్రారంభమవుతుంది. ఇది మనిషి ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. మన జీర్ణశక్తి తగ్గుతుంది. చురుకుదనం తగ్గుతుంది, బద్ధకం పెరుగుతుంది. శరీరంలో నొప్పులు పెరుగుతాయి. నరాల బలహీనత వున్నవాళ్ళు చలికి ముడుచుకుని పడుకోవటంతో అవి ఇంకా పెరుగుతాయి. వీటన్నిటికీ దూరంగా వుండటంకోసమే, మన ఆరోగ్య రక్షణకోసమే ఈ నియమాలు ఆచరించే పద్ధతిలో పెట్టారు.
తెల్లవారు ఝామున లేవటం వలన ఈ కాలంలో సహజంగా వచ్చే ఋగ్మతల నుంచి మనల్ని కాపాడుకోవచ్చు. నక్షత్రాలుండగానే స్నానం, దైవపూజ, వగైరాల వలన బద్ధకం వదిలి, శారీరకంగా ఉత్సాహంగా వుండటమే కాక, మానసికంగా కూడా చాలా ఉల్లాసంగా వుంటుంది. నదీ స్నానం చెయ్యాలంటే నది దాకా నడవాలి. దానితో శారీరక వ్యాయామం అవుతుంది. ప్రవహించే నదులలో సహజంగా వుండే ఓషధులే కాకుండా నదీ పరీవాహక ప్రదేశాలలో వుండే ఓషధులను కూడా నదులు తమలో కలుపుకుని వస్తాయి. ఆ నీటిలో స్నానం చెయ్యటం ఆరోగ్యప్రదం.
తెల్లవారుఝామున స్నానం చేసి నదిలో దీపాలు వదిలి పెడితే ఆ దృశ్యం ఎంత అద్భుతంగా వుంటుందో వర్ణించనలవికాదు మరి. అలాంటి దృశ్యాలను చూసి, ఆ సమయంలో భగవంతుని ధ్యానిస్తే మనసు ఎంత సంతోషంతో, ఉత్సాహంతో ఉప్పొంగిపోతుంది. అంతేకాదు వర్షాకాలంలో పడిన నీరు భూమిలోకి ఇంకి బలమైన అయస్కాంత మండలం ఏర్పడుతుంది. వర్షాకాలం తరువాత వచ్చే ఈ కార్తీక మాసంలో ప్రవహించే నదుల్లో అయిస్కాంత శక్తి అపారంగా ఉంటుంది.
ఇక జ్యోతిషశాస్త్ర రీత్యా నీటి మీదా, మానవుల మనసు మీదా చంద్రుని ప్రభావం అధికంగా ఉంటుంది. అలాంటి చంద్రుడు ఈ మాసంలో చాలా శక్తిమంతంగా ఉంటాడట. అందుకే ఈ మాసానికి `కౌముది మాసం` అని కూడా పేరు. అలాంటి చంద్ర కిరణాలతో, ఔషధులతో రాత్రంతా తడిసిన నదులలో ఉదయాన్నే స్నానం చేయడం వల్ల ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఈ మాసంలో ఉదయాన్నే నదుల వద్దకు చేరుకుని సంకల్పం చెప్పుకుని, పితృదేవతలను తల్చుకుని, దానధర్మాలు చేసి, దీపాన్ని వెలిగించి, భగవంతుడిని కొలుచుకోవాలని కార్తీక పురాణం చెబుతోంది. ఇక ఆయా పుణ్యనదులన్నీ కలిసేది సముద్రంలోనే కనుక కార్తీక మాసంలో సముద్ర స్నానం కూడా చేయాలని పెద్దలు చెబుతుంటారు.