అన్ని గుడులలో మాదిరిగా శివాలయాల్లో ప్రదక్షిణలు చేయకూడదు...
విజయవాడ : దేవాలయానికి మానవ దేహానికి అవినాభావ సంబంధం ఉంది. దేవాలయానికి వెళ్తే మనస్సుకు ప్రశాంతత కలగడమే కాదు, ఆ పరిసరాల్లో ఉండే పాజిటివ్ శక్తి మనలోకి ప్రవేశిస్తుంది. దీంతో కొత్త ఉత్సాహం వస్తుంది. ఏ దేవాలయానికి వెళ్లినా దైవాన్ని దర
విజయవాడ : దేవాలయానికి మానవ దేహానికి అవినాభావ సంబంధం ఉంది. దేవాలయానికి వెళ్తే మనస్సుకు ప్రశాంతత కలగడమే కాదు, ఆ పరిసరాల్లో ఉండే పాజిటివ్ శక్తి మనలోకి ప్రవేశిస్తుంది. దీంతో కొత్త ఉత్సాహం వస్తుంది. ఏ దేవాలయానికి వెళ్లినా దైవాన్ని దర్శించుకునే ముందు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. కొందరు తమ వీలునుబట్టి ఎక్కువ ప్రదక్షిణలు చేస్తే కొందరు 3 ప్రదక్షిణలే చాలని చెప్పి అనంతరం దైవదర్శనం కోసం వెళ్తారు. ఈ క్రమంలో వేరే ఏ దేవుడి గుడికైనా వెళ్లినప్పుడు భక్తులు అలా తమ వీలును బట్టి ప్రదక్షిణలు చేయవచ్చు, కానీ శివుడి గుడికి వెళ్లినప్పడు ఒక క్రమ పద్ధతిలోనే ప్రదక్షిణలు చేయాలట.
గర్భ గుడిలో ఉన్న శివుడికి ఎదురుగా నంది ఉంటుంది కదా. పక్కనే లింగాన్ని అభిషేకించిన జలం వెళ్తూ ఉంటుంది. దాని కిందే చండీశ్వరుడు కొలువై ఉంటాడు. శివాలయంలోకి వెళ్లగానే నేరుగా శివుని గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదట. ముందుగా నందీశ్వరుని వద్ద ప్రదక్షిణ ప్రారంభించి చండీశ్వరుని వద్దకు వెళ్లి ఆయన్ను దర్శించుకుని మళ్లీ వెనక్కి రావాలి.
ఒకసారి చండీశ్వరుని దర్శించుకుని వెనక్కి వచ్చి నందీశ్వరుని వద్ద ఆగి అటు నుంచి గర్భగుడి మీదుగా లింగాన్ని అభిషేకించే జలం వద్దకు రావాలి. అక్కడి నుంచి వెనక్కి తిరిగి నందీశ్వరుని వద్దకు వచ్చి ప్రదక్షిణ పూర్తి చేయాలి. ఇలా 3 సార్లు చేస్తే చాలు దాంతో ఎంతో ఫలితం కలుగుతుందట.
సాధారణంగా భక్తులు దేవాలయాల్లో 3 సార్లు ప్రదక్షిణలు చేస్తారు. ఇందులో ఒకటి గుడిలో దేవుడికి, రెండోది పూజారికి, మూడోది గుడి కట్టిన విశ్వకర్మకు. కానీ పైన చెప్పిన విధంగా శివాలయంలో ప్రదక్షిణ చేస్తే అది 10 వేల ప్రదక్షిణలతో సమానమట. దీని గురించి లింగ పురాణంలో చెప్పారు. అయితే పైన చెప్పినట్టుగా కాక శివుని గర్భగుడి చుట్టూ గుండ్రంగా ప్రదక్షిణ చేయకూడదట. ఎందుకంటే లింగాన్ని అభిషేకించిన జలం వెళ్లే దారి వద్ద ప్రమధ గణాలు కొలువై ఉంటాయట. వాటిని దాటి ప్రదక్షిణ చేయకూడదట. అలా చేస్తే తప్పు చేసినట్టు అవుతుందట. కొద్దిగా ప్రయత్నిస్తే పైన చెప్పినట్టుగా ప్రదక్షిణ చేయడం సులభమేనని పండితులు చెబుతున్నారు.