రుద్రాక్షలు- విశిష్టత ఏంటో తెలుసా? ఆ రుద్రాక్ష మన్మథ స్వరూపం..?

రుద్రాక్షలు వివిధ ముఖములు కలిగినవి లభ్యమవుతున్నాయి. ముఖ్యంగా ముప్పది ఎనిమిది రకాల ముఖాలుండే రుద్రాక్షలు ఉన్నట్లు పురాణాల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఒకటి నుంచి 14 ముఖాలు కలిగిన రుద్రాక్షలు మాత్రమే లభిస

మంగళవారం, 2 జనవరి 2018 (17:49 IST)
రుద్రాక్షలు వివిధ ముఖములు కలిగినవి లభ్యమవుతున్నాయి. ముఖ్యంగా ముప్పది ఎనిమిది రకాల ముఖాలుండే రుద్రాక్షలు ఉన్నట్లు పురాణాల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఒకటి నుంచి 14 ముఖాలు కలిగిన రుద్రాక్షలు మాత్రమే లభిస్తున్నాయి.

వీటికి ఒక్కొక్కదానికి ఒక్కొక్క ప్రత్యేక లక్షణం వుంటుంది. అంతేగాకుండా వీటిని ధరించడం ద్వారా మంచి ఫలితాలు, శుభాలు పొందుతారు. 
 
* ఏకముఖీ రుద్రాక్ష: శివ స్వరూపంగా చెప్పబడే ఏకముఖ రుద్రాక్ష లభించడం చాలా కష్టం. ఈ ఏకముఖి రుద్రాక్ష అర్థచంద్రాకారంలో ఉంటుంది. దీనిని ధరించే ముందు "ఓం ఎం హం బెం ఇం ఓం'' అనే మూల మంత్రాన్ని పదకొండుసార్లు పఠించి ధరించాలి. ఈ రుద్రాక్షను ధరించిన వారికి సిరిసంపదలు వృద్ధి చెందడంతో పాటు ఇంద్రియనిగ్రహం కలుగుతుంది. మనోవికాసం, పరతత్వ జ్ఞానము లభిస్తాయి.
 
* ద్విముఖి రుద్రాక్ష: ఈ రుద్రాక్షను పార్వతీ పరమేశ్వరుల రూపంగా అర్థనారీశ్వరుల రూపంగా వర్ణిస్తారు. ఈ రుద్రాక్షను గురుపూర్ణిమ, దత్త జయంతి పర్వదినాల్లో, కార్తీక మాసంలో గురు, శుక్రవారాల్లో ధరించాలి. "ఓం, క్ష్రీం హ్రీం క్షాం వ్రీం ఓం' అనే మూల మంత్రాన్ని పదకొండుసార్లు పఠించి ఈ  రుద్రాక్షను ధరించాలి. దీనిని ధరించడం వల్ల వ్యాపారాభివృద్ధి, సంతానప్రాప్తి, మనశ్శాంతి లభించి సమస్త కోరికలు నెరవేరుతాయి. 
 
త్రిముఖ రుద్రాక్ష : మూడు ముఖములు గల ఈ రుద్రాక్ష త్రికాలగ్నుల స్వరూపంగా చెప్పబడుతుంది. ఈ రుద్రాక్షను సుబ్రహ్మణ్య షష్ఠి, నాగపంచమి, పర్వదినాలలో గురువారం రోజు ధరించాలి. దీనిని ధరించే ముందు త్రిమూర్తులను అష్టోత్తర పూజచేసి, ధరించే సమయంలో ''ఓం క్లీం నమః'' అనే మూల మంత్రాన్ని 108 సార్లు పఠించి దీనిని ధరించాలి. దీనిని ధరించడం వల్ల సంపదలు, విద్యాభివృద్ధి, గుండె జబ్బులు వంటి వ్యాధులు తగ్గిపోతాయి. కుజదోషము గలవారు ఈ రుద్రాక్షను ధరించడం చాలా మంచిది. 
 
చతుర్ముఖ రుద్రాక్ష : నాలుగు ముఖములు గల చతుర్ముఖ రుద్రాక్ష బ్రహ్మదేవుడి స్వరూపంగా చెప్పబడుతుంది. ఈ రుద్రాక్షను గురుపూర్ణిమ, దత్తజయంతి, పర్వదినాల్లో, వారాల్లో బుధవారం నాడు ధరించడం మంచిది. దీనిని ధరించే ముందు "ఓం వాం క్రాం తాం హాం ఈం" అనే మంత్రాన్ని 11 సార్లు పఠించి, పూజించి, కుడిచేతికి ధరించవలెను. మానసిక రోగములు తగ్గి, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. విద్యార్థులు దీనిని ధరిస్తే జ్ఞాపకశక్తి అభివృద్ధి చెందుతుంది. విద్యార్థులు దీనిని ధరిస్తే జ్ఞాపకశక్తి అభివృద్ధి  చెందుతుంది. 
 
పంచముఖ రుద్రాక్ష: ఐదు ముఖములు గల ఈ రుద్రాక్ష కాలాగ్ని స్వరూపం దీనిని దత్తజయంతి, గురుపూర్ణిమ, శివరాత్రి పర్వదినాలలో, సోమవారం నాడు ధరించవలెను. దీనిని ధరించే ముందు "ఓం హ్రీం అం క్ష్మా స్వాహా" అనే మూల మంత్రాన్ని 11 సార్లు పఠించి ధరించాలి. దీనిని ధరించడం వల్ల మానసిక ప్రశాంతత పొందటంతో పాటు గుండె జబ్బులు, రక్తపోటు వంటి వ్యాధులు నయమవుతాయి. 
 
* షణ్ముగ రుద్రాక్ష : ఆరు ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష షణ్ముఖుడైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రతీకగా అభివర్ణించారు. దీనిని వినాయక చవితి, సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినాల్లో గానీ, మంగళ వారాల్లో కానీ ధరించవలెను. దీనిని ధరించే ముందు "ఓం హ్రీం శ్రీం క్షీం సాం ఇం" అనే మూల మంత్రాన్ని 11సార్లు పఠించి ధరించవలెను. ఈ రుద్రాక్షను కుడిచేతికి ధరించాలి. దీనిని ధరించడం వల్ల గుండెదడతో పాటు హిస్టీరియా వంటి వ్యాధులు తగ్గుతాయి. విద్యార్థులు పరీక్షలలో విజయం సాధిస్తారు. 
 
* సప్తముఖ రుద్రాక్ష : ఏడు ముఖాలు కలిగిన ఈ రుద్రాక్ష మన్మథ స్వరూపంగా అభివర్ణించారు. దీనికే "అనంగము'' అని పేరు కూడా కలదు. దీనిని దీపావళి పర్వదిన నాడు కానీ, శుక్ర, శనివారాల్లో గాని ధరించవలెను. దీనిని ధరించే ముందు శ్రీలక్ష్మీ అష్టోత్తరం గానీ, సహస్రనామంతో గానీ పూజ చేసి "ఓం హ్రీం, క్రీం గ్లౌం హ్రీం సాం" అనే మూల మంత్రాన్ని 11సార్లు పఠిస్తూ ధరించాలి. శనిగ్రహ ఇబ్బందులు, ఏలినాటి శని దశను అనుభవిస్తున్నవారు దీనిని ధరిస్తే ఆ బాధల నుంచి నివారణ లభిస్తుంది.
 
* అష్టముఖ రుద్రాక్ష: ఎనిమిది ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష వినాయకుడి స్వరూపంగా చెప్పబడుతోంది. దీనిని వినాయక చవితి పర్వదినం నాడు కానీ, ఆదివారం గానీ ధరించవలెను. ఈ రుద్రాక్ష ధరించే ముందు ''ఓం హ్రీం నమః" అనే మూల మంత్రాన్ని 11 సార్లు పఠించవలెను. దీనిని ధరించడం వల్ల విఘ్నాలు తొలగి, కార్యానుకూలత, మనశ్శాంతి, ఏకాగ్రత కలుగుతాయి.  
 
* నవముఖ రుద్రాక్ష: తొమ్మిది ముఖాలున్న ఈ రుద్రాక్ష భైరవ స్వరూపంగా చెప్పబడుతుంది. నవశక్తులు అంటే విద్యాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, శాంతశక్తి, వామశక్తి, జ్యేష్ఠాశక్తి, రేధిశక్తి, అంగశక్తి, పశ్వంతీ అనువాటికి ప్రతీకలుగా పూజలందుకునే ఈ రుద్రాక్ష అధిదేవత దుర్గాదేవి. దీనిని నవరాత్రుల్లో కానీ, శుక్రవారం గానీ ధరించడం చేయాలి. ధరించేముందు "ఓం క్లీం హ్రూం నమః'' అనే మూల మంత్రాన్ని 11 సార్లు పఠించాలి. దీనిని కుడి భుజానికి ధరించడం వల్ల బలం చేకూరుతుంది. దీనిని ధరించిన వారికి వాక్సుద్ధి వృద్ధి చెంది గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందుతారు. చర్మ వ్యాధులు నిర్మూలింపబడతాయి. 
 
* దశముఖ రుద్రాక్ష : పది ముఖములు గల ఈ రుద్రాక్ష విష్ణు స్వరూపముగా తెలియజేయబడింది. దీనిని ముక్కోటి ఏకాదశి, తొలి ఏకాదశి పర్వదినాల్లో ధరించాలి. దీనిని ధరించేముందు "ఓం హ్రీం నమః'' అనే మూల మంత్రాన్ని 11 సార్లు పఠించాలి. దీనిని ధరించడం ద్వారా భూత, ప్రేత, పిశాచ, రాక్షస వంటి భయాలు గ్రహపీడలు తొలగిపోతాయి. ఆయురారోగ్యాలు చేకూరుతాయి. 
 
* ఏకాదశ ముఖ రుద్రాక్ష: 11 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష రుద్ర స్వరూపంగా పేరు పొందినది. ఈ రుద్రాక్షను శివరాత్రి నాడు కానీ, సోమవారం నాడు కానీ ధరించడం మంచిది. దీనిని ధరించే ముందు "ఓం హ్రీం హూం నమః'' అనే మూల మంత్రాన్ని 11 సార్లు జపించవలెను. దీనిని ధరించడం ద్వారా సంతానాభివృద్ధి, సౌభాగ్యం, ధైర్యము, సంపద, జ్ఞానము మొదలగునవి అభివృద్ధి చెందుతాయి.
 
* ద్వాదశముఖ రుద్రాక్ష: పన్నెండు ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష శ్రీ మహావిష్ణువు స్వరూపమని శివపురాణంలో చెప్పబడివుంది. దీని అధిపతి సూర్యభగవానుడు. దీనిని రథసప్తమి, పర్వదినంనాడు కానీ ఆదివారం నాడు కానీ ధరించడం మంచిది. దీనిని ధరించేముందు అరచేతిలో వుంచి "ఓం ఘృణిశ్రీం" అనే మంత్రాన్ని 108 సార్లు పఠించి, అనంతరం "ఓం క్రీం క్ష్రాం రౌం నమః" అనే మూల మంత్రాన్ని 11 సార్లు జపించి ధరించాలి. దీనిని ధరించిన వారికి మానసిక శాంతి లభిస్తుంది. ఇంద్రియ నిగ్రహం, సౌభాగ్యం కలుగుతుంది. ఇది ఏకముఖి రుద్రాక్షతో సమానమైన శక్తి గలదని చెబుతారు. 
 
*త్రయోదశ ముఖ రుద్రాక్ష: పదమూడు ముఖాలుండే ఈ రుద్రాక్షను ఇంద్రుడి స్వరూపంగా చెప్పబడుతోంది. దీనిని సుబ్రహ్మణ్య షష్ఠి, నాగ పంచమి, పర్వదినములలో గానీ, మంగళవారం నాడు కానీ ధరించవలెను. దీనిని ధరించే ముందు "ఓం హ్రీం నమః" అనే మూల మంత్రాన్ని 11 సార్లు పఠించవలెను. దీనిని ధరించిన వారు చేపట్టే అన్ని కార్యక్రమాలు సఫలమవుతాయి. 
 
* చతుర్దశముఖ రుద్రాక్ష : పదునాలుగు ముఖములు కలిగిన ఈ రుద్రాక్షను శివుని స్వరూపంగా భావిస్తారు. అంతేగాకుండా దీనిని హనుమంతుడికి ప్రతీక అని కూడా చెప్తారు. ఈ రుద్రాక్షను శివరాత్రి, హనుమజ్జయంతి పర్వదినములలో కానీ, సోమ, మంగళవారాల్లో కానీ ధరించవలెను. దీనిని ధరించే ముందు "ఓం నమః - ఓం శివాయ నమః" అనే మూల మంత్రాన్ని 11సార్లు పఠించవలెను. దీనిని ధరిస్తే  సర్వరోగాలు నశిస్తాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి. 
 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం మీ ఇంట్లో లక్ష్మీ కళ రావాలంటే..?