Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేడు మహాశివరాత్రి... శివతత్త్వం అంటే..

Advertiesment
lord shiva

ఠాగూర్

, శుక్రవారం, 8 మార్చి 2024 (09:26 IST)
దేశం యావత్తూ శివనామస్మరణతో మార్మోగిపోతుంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దేశంలోని అన్ని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివుడిని దర్శించుకునేందుకు భక్తులు శివాలయాలకు పోటెత్తారు. అయితే, శివతత్త్వం అంటే ఏంటో ఓసారి పరిశీలిద్ధాం... దైవానికి ఒక ఆకారం లేదు. ఒక పరిమితి లేదు. దైవం అనంతవ్యాప్తం. అయినప్పటికీ దైవాన్ని గుర్తించడానికి ఏదో ఒక గుర్తు అవసరం. అందుకోసమే శిలా మూర్తులను, విగ్రహాలను తయారు చేశారు. అయితే విగ్రహాలు దైవం కాదు. అవి మనకు దైవం వైపు దారి చూపుతాయి. శివుణ్ణి లింగ రూపంలో కొలుస్తారు. 
 
స్థూల ప్రపంచంలో చిక్కుకొని... సూక్ష్మమైన దివ్యత్వాన్ని గ్రహించలేని వారికోసం పెద్ద పెద్ద విగ్రహాల రూపకల్పన జరిగింది. యోగులు స్థూల ప్రపంచం నుంచి సూక్ష్మమైన దానివైపు ప్రయాణిస్తూ ఉంటారు. వారు తమ మనస్సును సూక్ష్మమైన వాటి మీద లగ్నం చెయ్యాలి. కాబట్టి పెద్ద పెద్ద విగ్రహాలు వారికి అవసరం లేదు. ద్వాదశ జ్యోతిర్లింగాలను చూస్తే... అవన్నీ చాలా చిన్నవిగానే కనిపిస్తాయి. దేవాలయాల్లో స్థాపించే దేవతా మూర్తి... మనుషుల ఆకారం కన్నా చిన్నదిగానే ఉండాలని ఆగమశాస్త్రం చెబుతుంది.
 
ప్రాచీన దేవాలయాల్లోని కొన్నిటిలో, చాలా కొద్ది దేవాలయాల్లో మాత్రమే అటువంటి పెద్ద విగ్రహాలు మనకు కనిపిస్తాయి. వీటిలో చాలావరకూ రాజులు స్థాపించినవే. రాచరికం అంటే పెద్ద అహంకారం. ఎక్కువ అహంకారం ఉన్నవారు దాన్ని పోగొట్టుకొని... చిన్నగా కావాలనుకుంటారు. కాబట్టి తమకన్నా పెద్దదైన విగ్రహాన్ని చూసినప్పుడే వాళ్ళు తమను తాము చిన్నగా భావించుకోగలరు.
 
వాస్తవానికి శివలింగానికి ముఖాలు ఉండవు. కానీ వాటికి కూడా ముఖాల్ని పెట్టేస్తున్నాం. శివుణ్ణి ఒక రూపంగా ఆరాధించడాన్ని శాస్త్రాలు నిషేధించాయి. కేవలం నటరాజ స్వరూపం మాత్రమే... అది కూడా కొన్ని ప్రదేశాల్లో మాత్రమే ఆరాధనీయం. శివలింగాన్ని బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అనే మూడు విభాగాలుగా స్థాపిస్తారు. ఒక భాగం మాత్రమే కళ్ళకు కనిపిస్తుంది. శివతత్త్వం అంటే కంటికి కనిపించేది మాత్రమే కాదనీ, మనకు కనిపించేదానికన్నా (తెలిసినదానికన్నా) రెండు రెట్లు ఎక్కువ ఉన్నదనీ దీని అర్థం. కాబట్టి కన్నులు మూసుకొని... నీలో ఉన్న శివతత్త్వాన్ని దర్శించమని సూచన. ధ్యానంలోకి వెళ్ళండి. శివుణ్ణి తెలుసుకోండి. స్థూలం నుంచి సూక్ష్మానికి ప్రయాణించండి. ఈ ప్రయాణంలో సాలగ్రామం కన్నా మంత్రాలు ఉత్తమం. మంత్రాలకన్నా మౌనం అత్యుత్తమం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

08-03-2024 శుక్రవారం దినఫలాలు - ఆర్థిక విషయాల్లో ముందుచూపు అవసరం