Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముక్కోటి ఏకాదశి: ఉత్తర ద్వార దర్శనం విశిష్టత ఏమిటి?

Advertiesment
ముక్కోటి ఏకాదశి: ఉత్తర ద్వార దర్శనం విశిష్టత ఏమిటి?
, శనివారం, 23 డిశెంబరు 2023 (09:56 IST)
ముక్కోటి ఏకాదశి. ధనుర్మాసంలో వచ్చే పరమ పవిత్రమైన రోజు ఈ ఏకాదశి. ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, పుత్రదా ఏకాదశి అని కూడా అంటారు. ఆరోజు ముఖ్యంగా వైష్ణవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతుంటాయి. ఉత్తరద్వార మార్గంలో స్వామిని దర్శించుకోవాలని ఆ రోజు భక్తులు ఎంతో ఆరాటపడతారు. ఏడాదిలో ఇరవైనాలుగు ఏకాదశులు వస్తాయి. ప్రతి ఏకాదశీ పవిత్రమైనదే. అందులో మరీ విశేషంగా పరిగణించే ఏకాదశులు నాలుగు. ఆ విశేష ఏకాదశులలో ఒకటిగా పరిగణించేదే ఈ వైకుంఠ ఏకాదశి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అంటారు.
 
కృతయుగంలో "ముర" అనే రాక్షసుడు దేవతులను, సాధువులను క్రూరంగా హింసించేవాడు. ముర అక్రమాలను భరించలేక దేవతలు నారాయణ స్వామి వద్ద మొరపెట్టుకున్నారు. భగవంతుడు మురాసురుడి మీదికి దండెత్తి, అతడిని వధించాడు. ముర వెళ్లి సాగర గర్భంలోకి వెళ్లి దాక్కుంటే, అతన్ని బైటికి రప్పించేందుకు ఉపాయం పన్ని గోవిందుడు గుహలోకి వెళ్లి నిద్రపోతున్నట్లు నటిస్తూ పడుకున్నాడు. అదే అదననుకున్న మురాసురుడు గుహలోకి వచ్చి, విష్ణువును వధించేందుకు కత్తి ఎత్తగానే, ఆ సమయంలో శ్రీమహావిష్ణువు నుంచి ఒక శక్తి ఉద్భవించి మురాసురుణ్ణి సంహరించింది. 
 
ఈ విధంగా దేవతలను సంరక్షించిన ఆ శక్తికే ‘‘ఏకాదశి’’ అని నామకరణం చేశారు. వైష్ణవ ఆళ్వారులలో ప్రసిద్ధి చెందిన శ్రీనమ్మాళ్వారు కూడా ముక్కోటి ఏకాదశినాడే పరమపదించడం ఒక విశేషంగా చెప్పుకుంటారు. వైష్ణవ ఆళ్వారుల్లో శ్రీనమ్మాళ్వారులు ఈ రోజున పరమపదించడం వల్ల శ్రీ వైష్ణవులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాదశీ వ్రతమాచరిస్తారు. ప్రసిద్ధ వైష్ణవ దేవాలయాలతో సహా శ్రీ తిరుమల వేంకటేశ్వరుని ఆలయంలోను ప్రాత:కాలం నుంచీ ప్రత్యేక ఉత్తర ద్వార దర్శనం కలుగుతుంది. దీనికి వైకుంఠ ద్వారమని ప్రతీతి. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం. దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములందరూ వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు దాని గుండా స్వర్గంలోని ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నాయి.
 
ముక్కోటి ఏకాదశినాడు తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో భక్తులు ఉత్తర ద్వార భగవత దర్శనార్థం వేచి ఉంటారు. ఈ రోజున వైకుంఠం వాకిళ్లు తెరుచుకునే పర్వదినం. ముక్కోటి ఏకాదశినాడు సాక్షాత్తూ ఆ శ్రీమహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. అందువల్లనే ముక్కోటి ఏకాదశి అని దీనికి పేరు. మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన ఈ ఏకాదశి పవిత్రత సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. 
 
దేవతలు, రాక్షసులు జరిపిన క్షీరసాగర మథనంలో ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. కాలకూటవిషాన్ని పరమేశ్వరుడు తన గరళాన బంధించింది ఆ రోజే. మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీతను ఉపదేశించింది కూడా ముక్కోటి ఏకాదశినాడే అనేది ఒక విశ్వాసం. తిరుమల శ్రీవారి పుష్కరిణిలో ఏడాదికి నాలుగు మార్లు మాత్రమే చక్రస్నానం జరుగుతుంది. ఏడాదిలో ఈ చక్రస్నానాలు జరిగే నాలుగుసార్లూ ముల్లోకాల్లో ఉన్న పుణ్యతీర్థాలు స్వామి పుష్కరిణిలో సూక్ష్మరూపంలో ప్రవేశిస్తాయని విశ్వాసం. అనంతపద్మనాభ వ్రతం రోజున, బ్రహ్మోత్సవాలలో చివరి రోజున, వైకుంఠ ఏకాదశి మరునాటికి ద్వాదశి తిథి ఉన్నరోజు, రథసప్తమి రోజు, స్వామివారికి చక్రస్నానాలు జరుగుతాయి. అందుకే ఈరోజున ప్రత్యేకించి వైష్ణవ ఆలయాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

23-12-2023 శనివారం రాశిఫలాలు - శ్రీ వెంకటేశ్వరస్వామిని ఆరాధించిన సర్వదా శుభం...