Dr. LV Gangadhar Shastri, founder of the Bhagavad Gita Foundation
బాల్యంలోనే పిల్లలకు తల్లిదండ్రులు సనాతన ధర్మం విశిష్టతను తెలపాలని డాII ఎల్ వి గంగాధర శాస్త్రి పిలుపుఇచ్చారు. రంగారెడ్డి జిల్లా, కొత్తూరు మండలం, పెంజర్ల గ్రామం లో 800 సంవత్సరాల క్రితం వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భం గా గీతా గాన ప్రవచన ప్రచారకర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి గారు గీతా గాన ప్రవచనం చేశారు. సనాతన ధర్మ వైశిష్ట్యాన్ని వివరించారు.
Sanmanam to Dr. L. V. Gangadhar Shastri
సాక్షాత్తు పరమాత్మ ముఖపద్మం నుండి వెలువడిన మహోత్కృష్టమైన దివ్య సందేశం భగవద్గీత అని, ఇది సకల శాస్త్రాల సమాహారమని, గీత ఒక్కటి చదివితే పరమాత్మ తత్త్వం వంటబట్టినట్టేనని గంగాధరశాస్త్రి అన్నారు. గీతను చదివి, అర్ధం చేసుకుని, ఆచరించి , ప్రచారం చేయడం ద్వారా సనాతన ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని, భారత దేశాన్ని , హిందూ మతాన్ని, మన దేవీ దేవతలను ఎవరు అవమానపరచినా ఉపేక్షించరాదని అన్నారు.
హిందూయిజం బలమైనదే అయినా దురదృష్ఠవశాత్తూ హిందువులు తమ వ్యవస్థని కాపాడుకోలేనంత బలహీనం గా ఉన్నారని ఆవేదన వెలిబుచ్చారు. ఇందుకు దారుణమైన ఉదాహరణే ఇటీవల కాశ్మీర్ లో టెర్రరిస్టులు 26 మంది హిందువులను లక్ష్యం గా చేసుకుని కాల్చిచంపిన ప్పటికీ హిందువుల నుంచి స్పందన లేకపోవడం దురదృష్టకరమని గంగాధర శాస్త్రి అన్నారు.
బాల్యదశనుంచే తల్లి తండ్రులు తమ పిల్లలతో సనాతన ధర్మ విశేషాలను పంచుకోవాలని, హిందువులు ఆచరణాత్మక హిందువులు గా మారాలని పిలుపునిచ్చారు. ప్రతి దేవాలయం లోనూ పరమాత్మ మానవాళి అభ్యున్నతి కోసం ఉపదేశించిన భగవద్గీత మారుమ్రోగాలని అన్నారు. పెంజర్ల గ్రామం లోని అనంతపద్మనాభస్వామి దేవాలయాన్ని పునరుద్ధరించడం లో విశేషమైన కృషిచేసిన శ్రీ శ్యామ్, శ్రీమతి అనితారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు మరియు పెంజర్ల గ్రామప్రజలను శ్రీ గంగాధర శాస్త్రి అభినందించారు.