Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Bhagavad Gita: భగవద్గీత నిత్య సంజీవిని : డా ఎల్ వి గంగాధర శాస్త్రి

Advertiesment
Dr. L. V. Gangadhara Sastry at Sacramento City, USA

దేవీ

, సోమవారం, 1 సెప్టెంబరు 2025 (14:12 IST)
Dr. L. V. Gangadhara Sastry at Sacramento City, USA
సనాతన ధర్మం ఒక వర్గానికి మాత్రమే పరిమితమయ్యింది కాదనీ, ధర్మమంటే సార్వజనీనమైనదని, అందుకే భగవద్గీత ఐదువేల సంవత్సరాల తర్వాత కూడా ప్రపంచ మానవాళికి స్ఫూర్తి నిచ్చే కర్తవ్యబోధా గ్రంథం గా ప్రాచుర్యం పొందిందని, నిత్య జీవితం లో 'భగవద్గీత అనుష్ఠానం' వల్ల సంపద, విజయం, ఐశ్వర్యం, స్థిరమైన నీతి, శాంతి చేకూరుతాయని, గీత ధర్మబద్ధమైన జీవితాన్ని గడిపేoదుకు దోహదపడే కర్మసిద్ధాంత గ్రంథమ'ని గీతా గాన ప్రవచన ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా ఎల్ వి గంగాధర శాస్త్రి అన్నారు. 
 
సువిధ ఇంటర్నేషనల్ ఫౌండేషన్', తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ శాక్రమెంటో ల సంయుక్త నిర్వహణలో అమెరికా లోని శాక్రమెంటో నగరం లో ఇటీవలే ఆయన గీతా గాన ప్రవచనం చేశారు. మనం మన బిడ్డలకు అందించవలసిన నిజమైన వారసత్వ సంపద భగవద్గీతా జ్ఞానమేనని ఆయన అన్నారు.  కర్మ భక్తి జ్ఞాన మార్గాల ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి నిమిత్తం గా చేసుకుని   జగత్తు లోని ప్రతి మానవుణ్ణి ఉద్దేశించి మహోదాత్తమైన పద్దతి లో గీతోప్రదేశం చేసి జగద్గురువయ్యాడని చెప్పారు. 
 
గీత కు సర్వశాస్త్రమయి అని పేరుoదని, ఇది మత గ్రంధం కాదని సిద్ధాంత గ్రంథమని అన్నారు. ఇది కేవలం హిందువులను మాత్రమే నడిపించే బోధ కాదని, యావత్ మానవ జాతి ని సక్రమ మార్గం లో నడిపించగలిగే బోధ అని గంగాధర శాస్త్రి అన్నారు. బైబిల్, ఖురాన్ లు మానవుల చేత రచించబడిన గ్రంథాలైతే భగవద్గీత తాను సాక్షాత్తూ పరమాత్మ గా  ప్రకటించుకున్న  శ్రీకృష్ణుని చేత బోధింపబడిందని అన్నారు. భవ రోగాలకు సంజీవని లాంటి దివ్యౌషధం భగవద్గీత అని అన్నారు. మనిషి మనీషి కావాలంటే, పరమాత్మునికి ప్రీతి పాత్రులం కావాలంటే  12 వ అధ్యాయమైన భక్తి యోగం లోని 13 నుంచి 19 శ్లోకాలను ఆచరిస్తే చాలని, గీత పరమావధి - పారాయణం కాదని, ఆచరణ అని గంగాధర శాస్త్రి అన్నారు. ఇంతకంటే ఉన్నతమైన వ్యక్తిత్వ వికాస గ్రంధం ఈ భూమి మీద లేదని అన్నారు. 
 
గీతాచారణ మానసిక వత్తిడి లేని, స్వార్ధరహిత ఉత్తమసమాజాన్ని నిర్మించగలదని అన్నారు. భక్తి లో సందేహమొస్తే నారదుని భక్తి సూత్రాలు చదవాలని, యోగం లో సందేహమొస్తే పతంజలి యోగశాస్త్రం చదవాలని, జ్ఞానం విషయం లో సందేహాలు తలెత్తితే వ్యాసుని బ్రహ్మసూత్రాలు చదవాలని, జీవితం లో ఎక్కడ సందేహం వచ్చినా భగవద్గీత చదవాలని గంగాధర శాస్త్రి అన్నారు. గీతను బాల్యదశనుంచే నేర్పించాలని అన్నారు.'విశ్వరూప సందర్శన యోగం' నుంచి కొన్ని శ్లోకాలను కళ్ళకు కట్టినట్టుగా తాత్పర్య సహితం గా గానం చేసినప్పుడు ప్రేక్షకులు ఆనంద బాష్పాలతో కరతాళ ధ్వనులు సలిపారు. 
 
'తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ శాక్రమెంటో' జాయింట్ సెక్రటరీ శ్రీమతి భగవతి భాను దీప్తి యనమండ్ర పరిచయ వాక్యాలతో కార్యక్రమం ప్రారంభమయ్యింది. ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసిన శ్రీ రంగ తాటిపర్తి, 'సువిధ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ' వ్యవస్థాపకులు శ్రీ భాస్కర్ వెంపటి, TAGS అధ్యక్షులు శ్రీ ప్రేమ్, ఆత్మబంధువుల్లా ఆతిధ్యం అందించిన శ్రీ శ్రీకాంత్ నారాయణ, శ్రీమతి దీప్తి, శ్రీ శరణ్, భగవద్గీతా ఫౌండేషన్ అమెరికా శాఖ వ్యవస్థాపక సభ్యులు శ్రీ ప్రభాకర రావు లకు గంగాధర శాస్త్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు. గీతా ప్రచార పర్యటన 2025 ను సమర్ధవంతం గా సమన్వయ పరచిన చిII ఎల్ విశ్వతేజ కు అభినందన పూర్వక ఆశీస్సులందజేశారు. ఈ పర్యటనలో అకస్మాత్తుగా తలెత్తిన తన అనారోగ్యానికి చికిత్స చేసిన  డాII రాజ్ కుమార్ (కామినేని హాస్పిటల్స్, హైదరాబాద్), డాII దివాకర్ లింగం, డాII సందీప్ అడుసుమల్లి లకు గంగాధర శాస్త్రి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

01-09-2025 సోమవారం ఫలితాలు - పిల్లల విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది...