ముల్లంగి అనగానే ఎక్కువమంది ఇష్టపడరు. కానీ ముల్లంగిలో అనేక రకములైన ఔషద గుణాలు దాగి ఉన్నాయి. పలురకాల విటమిన్స్ కూడా ముల్లంగిలో ఉన్నాయి.మనకు ఆరోగ్యం సరిగా లేకపోతే ఇష్టం లేకపోయినా మందులు వేసుకుంటాము. అలాగే ముల్లంగిని కూడా మన ఆరోగ్యం కోసం మన ఆహారంలో చేర్చుకోవలసిందే మరీ. మరి ముల్లంగిలోని పోషక విలువలేంటో తెలుసుకుందాం.
1. మహిళల్ని వేధించే మూత్రాశయ ఇబ్బందులు మొదలుకుని క్యాన్సర్లని కట్టడి చేయడం వరకూ వివిధ సమస్యల్ని నియంత్రించగల శక్తి ముల్లంగి దుంపలకు ఉంది.
2. రోజుకి ఒక కప్పు ముల్లంగిని సలాడ్ రూపంలో తీసుకోగలిగితే 'సి' విటమిన్ పుష్కలంగా అందుతుంది. తెల్ల రక్తకణాలూ వృద్ధి చెంది, వ్యాధినిరోధక శక్తీ పెరుగుతుంది.
3. ముల్లంగిని ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల జలుబూ, దగ్గూ లాంటి సమస్యలూ దరిచేరకుండా ఉంటాయి. దీనికుండే ఒక రకం ఘాటు గొంతు సమస్యల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. అంతేకాకుండా అధిక కఫాన్ని నియంత్రిస్తుంది.
4. ముల్లంగి రక్తంలోని వ్యర్థాలను తొలగించి... రక్తానికి తగినంత ఆక్సిజన్‌ని అందించి కాలేయంపై భారం పడకుండా చేస్తుంది.
5. ముల్లంగిని తరచూ తినే వారిలో కామెర్ల వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. శరీరంపై ఏర్పడే తెల్లని మచ్చలను నియంత్రించడంలోనూ ఇవి చక్కగా పనిచేస్తాయి.
6. ముల్లంగిలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఆహారంలో తగినంత పొటాషియం ఉంటే రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది. అందుకే అధిక రక్తపోటుతో బాధపడేవారు ముల్లంగిని తరచూ తీసుకోవాలి.
7. మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజువారీ ఆహారంలో ముల్లంగిని చేర్చుకుంటే రక్తంలో ఒక్కసారిగా గ్లూకోజ్ స్థాయిలు పెరిగిపోవడం, తగ్గిపోవడం వంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉంటాయి.