కరక్కాయను పగులగొట్టి చిన్న ముక్కను బుగ్గన ఉంచుకుని చప్పరిస్తూ ఆ రసాన్ని కొద్దికొద్దిగా మింగుతూ ఉంటే సాధారణంగా వచ్చే దగ్గు తగ్గిపోతుంది. చేదుగా, వగరుగా ఉండే కరక్కాయ రసం మంచి ఫలితాన్నే ఇస్తుంది.
గోరువెచ్చని నీటిలో కొద్దిగా యాలకుల పొడి, లవంగాల పొడి కలుపుకుని నెమ్మదిగా చప్పరిస్తూ తాగితే మంచి గుణం కనిపిస్తుంది.
ఒక అర చెంచా అల్లం రసంలో ఒక చెంచా తేనె కలుపుకుని ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సేవిస్తూ ఉంటే దగ్గుతో పాటు దానివల్ల కలిగే ఆయాసం కూడా తగ్గిపోతుంది.
గోరువెచ్చని పాలల్లో కొద్దిగా యాలకుల పొడి, మిరియాల పొడి కలుపుకుని రాత్రి పడుకునే ముందు తీసుకుంటే దగ్గు తగ్గి సుఖనిద్ర పడుతుంది. అలాగే మిరియాల కషాయం కూడా దగ్గుని తగ్గించడంలో సహాయపడుతుంది.
ఒక స్పూన్ తులసి ఆకుల రసానికి సమపాళ్లలో తేనె కలిపి వాడితే కఫం వల్ల వచ్చే దగ్గు తగ్గి ఉపశమనం కలుగుతుంది. లేదా తులసి ఆకులను నమిలినా మంచి ఫలితం ఉంటుంది.
శొంఠిని నీళ్లలో కలిపి కషాయంగా కాచి అందులో పటికబెల్లం కలుపుకుని ప్రతిరోజు ఉదయం సాయంత్రం సేవిస్తూ ఉంటే దగ్గు త్వరగా తగ్గుతుంది. అలాగే శొంఠితో కాచే కాఫీ, టీ కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది.