తృణధాన్యాలలో మంచి ఔషధ గుణాలుంటాయి... షౌష్టిక విలువలు అధికం. అయితే కొన్ని సంవత్సరాలుగా తృణధాన్యాల వాడకం తగ్గింది. తృణధాన్యాలు అంటే ధాన్యాలలో ఒక రకం. బొబ్బెర్లు, అనుములు, సజ్జలు, ఉల్వలు, గడ్డినువ్వులు, తైదలు, అవుశలు, కొరబియ్యం తదితరాలు తృణధాన్యాల కోవకు చెందినవి. ఇవి శరీరానికి మంచి పోషక విలువనిస్తాయి..
వీటితో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని వైద్యులు, ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అవిశలు శరీరానికి వేడిని కలిగిస్తాయి. జలుబు, వాతాన్ని తగ్గిస్తాయి. గుండె జబ్బులు, రేచీకటిని హరింపజేస్తాయి. విరేచనాలను అరికడతాయి. అవిశలను పొడి చేసుకొని ఆహారంలో తింటే రుచిగా ఉంటుంది.
అలాగే తైదలను అంబలిగా కాచి సేవిస్తే శరీరానికి చలువను ఇస్తుంది. ఆకలి అదుపులో ఉంటుంది. తైదలలో లోహతత్వం ఉంటుంది. ఇది రక్తం వృద్ధి చెందేందుకు తోడ్పడుతుంది. వెంట్రుకలకు బలాన్ని ఇచ్చి, తెల్ల వెంట్రుకలు రాకుండా కాపాడుతుంది.
బొబ్బర్లు ఉడకబెట్టి తినడం వలన బాలింతలకు శక్తి చేకూరుతుంది. ఇవి అసిడిటీ (ఆమ్లపిత్తం)ను తగ్గించి, ఆకలిని వృద్ధి పరుస్తాయి. వాతాన్ని అరికడుతాయి. మూత్రరోగాలను అరికడుతాయి. దేహపుష్టిని కలిగిస్తాయి. వీటితో పాటు బొబ్బర్లను పిండి వంటల్లో వాడితే మంచి రుచినిస్తాయి.
అనుములను తినడం వలన పలు రోగాలను అరికట్టవచ్చు. బాలింతలలో పాలు వృద్ధిచెందుతాయి. విషం, వాపు, జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇవి చాలా పౌష్టికరమైనవి. సజ్జలను నేతిలో వేయించి పొడి చేసి పిల్లలకు, బలహీనంగా ఉన్న వారికి పాలలో కలిపి తాగిస్తే దేహదారుఢ్యాన్ని, మనోబుద్ధి పెంపొందుతుంది.
బెల్లంలో కలిపి తింటే రక్తహీనత తగ్గుతుంది. ఉలవలలో తెలుపు, నలుపు, ఎరుపు మూడు రంగులు ఉంటాయి. నల్ల ఉలవలు శ్రేష్టమైనవి. ఇవి మూత్రరోగాలను తగ్గిస్తాయి. మూత్రాశయంలో పెరిగే రాళ్లను కరిగించే గుణం వీటిలో ఉంటుంది. వీటిని గుడాలు, అంబలి రూపంలో సేవిస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.