ప్రాణాంతకమైన పెద్ద పేగు కేన్సర్‌ను మన వంటింట్లో లభించే తోక మిరియాలు ఎంతగానో పని చేస్తాయని తాజాగా నిర్వహించిన ఓ పరిశోధనలో వెల్లడైంది. పిప్పళ్లలో (తోక మిరియాలు) సహజంగా లభించే పిప్లార్టైన్ (పైపర్ లాంగమీన్) అనే రసాయనానికి కేన్సర్ కణాలను సమర్ధంగా నాశనం చేసే శక్తి ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
రూర్కెలలోని ఎన్.ఐ.టీ పరిశోధకులు, బీహార్ సెంట్రల్ వర్శిటీ, అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ నార్త్ కరోలినాకు చెందిన బృందాలు సంయుక్తంగా ఈ అధ్యయనం నిర్వహించాయి. ప్రస్తుతం పెద్ద పేగుకు కేన్సర్‌కు కీమోథెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా వైద్య విద్యానాలపై పరిశోధన చేస్తున్న క్రమంలో శాస్త్రవేత్తలు ఈ కీలక విషయాన్ని కనుగొన్నారు.
పిప్లార్టైన్‌ను పెద్ద పేగు కేన్సర్ కణాలపై ప్రయోగించినపుడు అద్భుతమైన ఫలితాలు వచ్చినట్టు పరిశోధకులు వెల్లడించారు. ఈ ఆవిష్కరణ కేన్సర్ చికిత్సలో ఒక వరం వంటిదని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ అధ్యయానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రముఖ సైన్స్ జర్నల్ బయోఫ్యాక్టర్స్‌లో ప్రచురించారు.