Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాలేజీ రోజుల్లోనే పెద్ద మోసగాడిని : లలిత్ మోడీ

Advertiesment
lalit modi

ఠాగూర్

, గురువారం, 21 ఆగస్టు 2025 (15:52 IST)
తాను కాలేజీ రోజుల నుంచే మోసగాడినని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వ్యవస్థాపక చైర్మన్, వివాదాస్పద వ్యాపారవేత్త లలిత్ మోడీ అన్నారు.  తాను కాలేజీలో చేరేందుకు పెద్ద మోసానికి పాల్పడినట్టు అంగీకరించారు. అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీలో అడ్మిషన్ కోసం 'శాట్' (స్కాలస్టిక్ అసెస్మెంట్ టెస్ట్) పరీక్షను తన బదులు వేరొకరితో రాయించినట్టు అంగీకరించారు. పన్ను ఎగవేత, మనీలాండరింగ్ ఆరోపణలతో 2010లో లలిత్ మోడీ దేశం విడిచి పారిపోయారు. అప్పటి నుంచి ఆయన విదేశాల్లోనే ఉంటున్నారు. ఈ ఆరోపణలపై విచారణ జరిపిన బీసీసీఐ, 2013లో ఆయనపై జీవితకాల నిషేధం విధించిన విషయం తెలిసిందే.
 
తాజాగా, ఆయన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్‌కు ఇచ్చిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'నేను వెండి స్పూన్‌తో కాదు, బంగారు స్పూన్‌తో కాదు.. ఏకంగా వజ్రాల స్పూన్‌తో పుట్టాను. పుట్టుకతోనే నాకు అన్నీ అందుబాటులో ఉండేవి. అయినా మా నాన్న, తాతయ్య నన్ను చాలా కఠినంగా పెంచారు. నేను మొదటి నుంచీ కుటుంబంలో ఒక బ్లాక్ షీప్‌లా ఉండేవాడిని. పుస్తకంలోని ప్రతి నిబంధనను ఉల్లంఘించేవాడిని. ఎందుకంటే నాకు ఇంకా, ఇంకా కావాలనిపించేది' అని లలిత్ మోడీ తెలిపారు.
 
అమెరికాలో పార్టీలు చేసుకోవాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నానని ఆయన చెప్పారు. 'అమెరికా వెళ్లాలంటే కాలేజీలో అడ్మిషన్ తప్పనిసరి. అందుకే నేను నా శాట్ పరీక్షను వేరొకరితో రాయించాను. అతడి ఫొటో, నా పేరుతో పరీక్ష రాయించాం. నాకు 1600 మార్కులకు 1560 వచ్చాయి. ఆ రోజుల్లో అది చెల్లిపోయింది. కానీ ఈ రోజుల్లో అలా సాధ్యం కాదు. అలా డ్యూక్ యూనివర్సిటీలో నాకు సీటు వచ్చింది' అని మోడీ ఆనాటి మోసాన్ని వివరించారు.
 
అమెరికాలో చదువుకునే రోజుల్లో తనను చాలామంది ఎగతాళి చేసేవారని గుర్తుచేసుకున్నారు. 'ఇండియాలో కార్లకు బదులు ఎడ్లబండ్లు వాడతారా? అని అడిగేవారు. అప్పట్లో నాకు బాడీగార్డులు కూడా లేరు. అలాంటి మాటలను పట్టించుకోకుండా ముందుకు సాగడం అప్పుడే నేర్చుకున్నాను' అని మోడీ పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆసీస్ వన్డే సిరీస్.. ప్రపంచకప్ వన్డే పోటీలకు హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీ