Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోపం ఎందుకు వస్తుంది? వస్తే ఏమవుతుంది?

కోపం ఎందుకు వస్తుంది? వస్తే ఏమవుతుంది?
, శనివారం, 19 అక్టోబరు 2019 (22:33 IST)
మనుషులుగా మనందరికీ చాలాసార్లు చాలా విషయాల మీద కోపం వస్తూంటుంది. దీనికి కారణాలు ఎన్నో. మనం కోరుకున్నది దొరక్కపోవడం. ఇష్టమైనది జరగకపోవడం, ఇష్టం లేనిది జరగటం, మాటకు మాట అందివ్వడం, చెప్పిన మాటలను ధిక్కరించడం.. అంచనాలు తప్పిపోవడం. ఇలా ఒకటేమిటి.. కోపానికి కారణాలు సవాలక్ష. అయితే కోపం రావడానికి గల కారణాలను అన్వేషించకుంటే మనకు కోపం తెప్పించిన పరిస్థితులను గురించి కూడా ఆలోచిస్తే మనం చిరాకు పరాకులను, మాట దూకుడుతనాన్ని కాస్తంతయినా అదుపులో ఉంచుకోవచ్చు.
 
కోపం వస్తే ఏమవుతుంది?
కొందరు కోపం వస్తే తమలో తాము బాధపడిపోయి గింజుకుంటారు. ఇంకా తగ్గకపోతే భోజనం మాని తమను తాము హింసించుకుంటారు. అయితే ఇలాంటి ప్రవర్తన వల్ల మీ కోపం వచ్చిందన్న సంగతి ఇతరులకు అర్థం కాక పోగా, కుటుంబీకులు బంధువులు, మిత్రులు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. 
 
ఒకవేళ అర్థమైనా మీ వైఖరికి అలవాటు పడిపోయి సరేలెమ్మని వదిలేస్తారు. ఇది మీకు మరింత ప్రమాదకరం అవుతుంది. అందుకే కోపం వచ్చినప్పుడు దానికి కారకులైన వారి వద్దకు పోయి, మీ బాధను మీ ఆగ్రహాన్ని బయటపెట్టి అడిగేస్తే సగం బాధ తీరిపోతుంది. వారి సమాధానం మీ అంచనాకు భిన్నంగా ఉంటే... మీ కోప కారణమే తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుంది. 
 
అలాగని కోపం వచ్చినప్పుడు కోపం తెప్పించిన వారితో మాట్లాడకుండా, చూడకుండా ఉంటే కాసేపటికి కోపం పోతుంది. అలాకాక, కోపం తెప్పించిన వారి గురించి ఇతరుల దగ్గర మాట్లాడితే మరికొన్నిసమస్యలు ఎదురవుతాయి. అందుకే కోపంతో ఉన్నప్పుడు దాని గురించి పరాయి వారి దగ్గర మాట్లాడే కన్నా మౌనంగా ఉంటే ఎంతో మంచిది.
 
కోపానికి పరిష్కారం ఏంటి?
కాలు జారితే తీసుకోగలం కానీ నోరు జారితే తీసుకోలేం. ఒక్కోసారి కోపంలో ఏం మాట్లాడుతున్నామో మనకే అర్ధం కాదు. అందుకే కోపం వచ్చినప్పుడు ప్రతి మాటకు ముందు రెండు సార్లు ఆలోచించి మాట్లాడండి. కోపానికి అతిసులువైన విరుగుడు అంకెలను లెక్కపెట్టడమే. కోపం వస్తే ధీర్ఘంగా శ్వాసిస్తూ ఒకటి నుంచి పది అంకెలు లెక్కపెడితే క్రమంగా కోపం తగ్గిపోతుంది.
 
ఆత్మన్యూనత భావం కలవారు ప్రతి విషయానికి కోపం తెచ్చుకుంటారు. ఇందువల్ల ఏ ప్రయోజనం లేదనే విషయం అందరికీ తెలిసిందే. ఇందుకు పరిష్కారం ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడమే. కొన్ని రకాల వ్యాధుల వల్ల కూడా మనుషులకు పిలువకుండానే కోపం వస్తుంది. ముఖ్యంగా ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటి కోపిష్టులపై సానుభూతి చూపి మంచి మాటలతో ఊరడించాలి. ఈసారి ఎప్పుడైనా మీకు కోపం వస్తే.. అద్దంలో మొహం చూసుకోండి. కోపంలో మీ హావభావాలు ఎంత వికృతంగా ఉంటాయంటే.. వాటిని అద్దంలో చూస్తేచాలు... మరోసారి మీకు కోపం రమ్మన్నా రాదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వేరుసెనగ పప్పుతో బెల్లం కలిపి తింటే?