Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సంతానం కోసం ప్రయత్నిస్తున్నారా? వేడి నీటితో మాత్రం స్నానం చేయకూడదట..

సంతానం కోసం ప్రయత్నిస్తున్నారా? వేడి నీటితో మాత్రం స్నానం చేయకూడదట..
, శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (13:09 IST)
ప్రస్తుత కాలంలో సంతాన లేమితో బాధపడేవారు చాలా మంది ఉన్నారు. ఆసుపత్రుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోతున్నారు. సంతాన లేమికి స్త్రీలలోనే కాదు, పురుషులలో కూడా సమస్యలు ఉంటాయి. పురుషుల వీర్య కణాలు ఆరోగ్యంగా లేకపోయినా లేదా సంఖ్య తక్కువగా ఉన్నా గర్భధారణ కష్టమవుతుంది. ఒత్తిడి, నిద్రలేమి, సరైన ఆహారం తీసుకోకపోవడం, చెడు అలవాట్లు పురుషుల్లో ఈ సమస్యకు కారణమవుతున్నాయి. వీటిని అధిగమించాలంటే కొన్ని సూత్రాలు పాటించాలని చెబుతున్నారు నిపుణులు. 
 
పొగ అలవాటుకు దూరంగా ఉండటం చాలా మంచిది. ఎందుకంటే పొగాకు వీర్యకణాల సంఖ్య, వాటి కదలికలు తగ్గిపోయేలా చేస్తుంది. పొగాకు వీర్యకణాల డీఎన్‌ఏను సైతం దెబ్బతీస్తున్నట్టు, ఇది సంతాన సమస్యలకు, భాగస్వామికి గర్భస్రావం కావటానికీ దోహదం చేస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. మంచి విషయం ఏమిటంటే పొగ అలవాటు మానేస్తే దెబ్బతిన్న డీఎన్‌ఏ తిరిగి మామూలు స్థాయికి వస్తుందట.
 
చక్కెర, కొవ్వు, నిల్వ పదార్థాలతో కూడిన జంక్‌ఫుడ్‌ కన్నా ఆయా కాలాల్లో దొరికే తాజా పండ్లు, కూరగాయలు తినటం మేలు. వీటిల్లో యాంటీఆక్సిడెంట్లు, ముఖ్యంగా విటమిన్‌ సి, విటమిన్‌ ఇ సమృద్ధిగా ఉంటాయి. ఇవి సంతానం త్వరగా కలగటానికి తోడ్పడతాయి. వీర్యం నాణ్యత వివిధ రకాల హార్మోన్లతో ముడిపడి ఉంటుంది. 
 
కొవ్వు కణజాలం ఈ హార్మోన్ల మిశ్రమాన్ని దెబ్బతీయవచ్చు. కాబట్టి కండరాలను బలోపేతం చేసే వ్యాయామాల పైన కూడా కాస్తంత దృష్టి పెట్టడం మంచిది. మితిమీరి మద్యం సేవించినా కూడా వీర్యం నాణ్యత దెబ్బతింటుంది. శారీరక సామర్థ్యాన్ని పెంచుకోవటానికి చాలామంది అక్రమంగానో, వైద్యుల పర్యవేక్షణలోనో టెస్టోస్టీరాన్‌ హార్మోన్‌ తీసుకుంటున్నారు. 
 
ఇలా చేస్తే ఒంట్లో సహజంగా టెస్టోస్టీరాన్‌ ఉత్పత్తి కావటం తగ్గిపోతుంది. ఫలితంగా వీర్యం ఉత్పత్తి కూడా పడిపోతుంది. వృషణాలకు మరీ ఎక్కువ వేడి తగిలితే వీర్యం నాణ్యత తగ్గే ప్రమాదముంది. అందువలన స్నానం చేసేటప్పుడు ఎక్కువ వేడి నీరు తగలకుండా జాగ్రత్త పడాలి, ఇదేమీ శాశ్వతంగా ఉండిపోయే సమస్య కాదు. కానీ సంతానం కోసం ప్రయత్నించేటప్పుడు చాలా వేడిగా ఉండే నీటితో స్నానం చేయకపోవటమే మంచిది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తుమ్ము ఎందుకు వస్తుందో తెలుసా..?