ఎన్నికలలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల కమిషన్ కూడా ఓటర్లకు.. ఓటు వేయడం ఎంత ముఖ్యమో అవగాహన కల్పిస్తోంది. వేసవి సెలవులు రావడంతో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి పర్యటనలకు ప్లాన్ చేస్తుంటారు. అయితే ఈ వేసవిలో ఎన్నికలు ఉండటంతో ప్రజలు ఓటు వేయడం కంటే పర్యటనకే ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చే అవకాశం ఉంది. అయితే ఓటు వేయడం ఎంత ముఖ్యమో అవగాహన కల్పించేందుకు కర్ణాటకలో ప్రైవేట్ స్కూళ్లు ఓ నిర్ణయానికి వచ్చాయి. ఓటు హక్కును ప్రతిఒక్కరూ వినియోగించుకునే ఉద్దేశంతో ఒక వినూత్న నిర్ణయం తీసుకున్నాయి.
ఎన్నికల్లో తల్లిదండ్రులు ఓటు వేస్తే, పిల్లలకు అదనపు మార్కులు వేస్తామంటూ ఆఫర్ చేస్తున్నాయి. ఈ రకంగా విద్యార్థుల తల్లిదండ్రులను ఓటు వేసేలా ప్రొత్సాహిస్తున్నారు. పాఠశాలలోని ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రులను ఓటు వేసేలా చూడాలి. ఒక్కో పేరంట్ ఓటుకు ఒక్కో అదనపు మార్కు వేస్తారు.
ఇప్పటికే దీనికి సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులకు SMSలు పంపిస్తున్నారు. ఓటు వేసాక తల్లిదండ్రులు తప్పనిసరిగా పాఠశాలకు వచ్చి వేలిపై సిరాను చూపించాల్సిందిగా సూచిస్తున్నారు. ఒకవేళ ఆరోజు కుదరకుంటే మరుసటిరోజు వచ్చి అయినా వేలిపై సిరా గుర్తును చూపించాలని కోరుతున్నారు. అప్పుడే విద్యార్థులకు అదనపు మార్కులు వేస్తామని కండీషన్ పెట్టారు.