ప్రస్తుతం టీవీలు, కంప్యూటర్లు, డెస్క్ జాబ్‌ల మూలంగా చాలామంది రోజులో పడుకునే సమయం కన్నా.. కూచునే సమయమ ఎక్కువగా ఉంటోందని చాలా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. చాలా మంది రోజు మొత్తమ్మీద 9 గంటల కన్నా ఎక్కువ సమయమే కుర్చీలకు అతుక్కుని, కూచుని గడుపుతున్నారు.
ఇంతసేపు కూచోవటం, కూచుని గడపటాన్ని మన శరీరాలు ఏమాత్రం తట్టుకోలేకపోతున్నాయి. దీనివల్ల మనకు తెలియకుండానే లోలోపల.. ఆపాద మస్తకం ఆరోగ్యం చెడిపోతోందని వైద్యరంగం ఇప్పుడు స్పష్టంగా హెచ్చరిస్తోంది. గంటల తరబడి కూచోవటం వల్ల రకరకాల వ్యాధులే కాదు.. అకాల మృత్యువు కూడా ముంచుకొస్తోందని
అధ్యయనాలు ఘోషిస్తున్నాయి..
కాబట్టి అసలు ఎక్కువసేపు కూచోవటం వల్ల మన శరీరంలో ఎక్కడెక్కడ ఏం జరుగుతోంది? దీనివల్ల తలెత్తుతున్న నష్టం ఏమిటి? దీన్ని అధిగమించేందుకు మనం ఏంచెయ్యొచ్చన్నది తెలుసుకోవటం చాలా అవసరం. మరి అవేంటో ఒక సారి తెలుసుకుందాం..
గుండె తట్టుకోలేకపోతోంది:
శారీరకంగా చురుకుగా ఉండేవారితో పోలిస్తే.. రోజులో చాలాసేపు కదలకుండా కూచునే వారికి గుండె జబ్బుల ముప్పు రెండింతలు అధికంగా ఉంటోదని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎక్కువసేపు కూచుంటే మన శరీరంలోని కండరాలు కొవ్వును ఎక్కువగా కరిగించలేవు. రక్తప్రసరణ కూడా మందగిస్తుంది. దీంతో గుండెలోని రక్తనాళాల్లో కొవ్వు పూడుకోవటం మొదలుపెడుతుంది. ఇదే గుండె జబ్బుకు, గుండె పోటుకు దారి తీస్తుంది. ఎక్కువసేపు కూచోవటం వల్ల హైబీపీ, కొలెస్ట్రాల్ స్థాయులూ పెరుగుతాయి. ఇవీ గుండె జబ్బును పెంచేవే:
భయపెడుతున్న పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్లు:
అదేపనిగా కూచుంటుంటే మన మీదకు క్యాన్సర్లూ దాడి చేస్తాయి. ముఖ్యంగా వీరికి పెద్దపేగు, రొమ్ము, ఎండోమెట్రియం క్యాన్సర్ల ముప్పు పెరుగుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఎక్కువసేపు కూచున్నప్పుడు ఒంట్లో ఇన్సులిన్ స్థాయులు పెరగటం, అది కణాల వృద్ధిని ప్రోత్సహిస్తుండటం.. ఇవన్నీ కలిసి క్యాన్సర్‌కు దారి తీస్తుండొచ్చని నిపుణులు భావిస్తున్నారు.
మన ఒంట్లో సహజంగానే క్యాన్సర్ తరహా మార్పులను అడ్డుకునే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అయితే ఎక్కువసేపు కూచోవటం వల్ల ఈ యాంటీఆక్సిడెంట్ల ఉత్పత్తి బాగా తగ్గిపోతోంది. దీంతో క్యాన్సర్ తరహా మార్పులు విజృంభిస్తున్నాయని, వాటిని అడ్డుకునే వ్యవస్థ ఏదీ ఉండటం లేదని నిపుణులు వివరిస్తున్నారు..
కడుపు కండరాలు బలహీనం:
మనం నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు, నిటారుగా కూచున్నప్పుడు కడుపు కండరాలు- మన శరీర భంగిమ నిటారుగా ఉండటానికి తోడ్పడుతుంటాయి. కానీ మనం కుర్చీలో ముందుకు వంగి కూచున్నప్పుడు వీటికి పనిలేకుండా పోతుంది. వెనక నుంచి వీపు కండరాలు చాలా బిగుతుగా మనల్ని పట్టి ఉంచుతాయి. కడుపు కండరాలు సడలిపోవటం, వీపు కండరాలు బిగుతు కావటం.. దీనివల్ల వెన్నెముక బాగా ముందుకు వంగిపోతోంది. వెన్ను సమస్యలకు ఇది ఆరంభం..
తుంటి బిగువు:
తుంటి భాగం కాస్త వదులుగా ఉంటే- మన శరీరం బ్యాలెన్స్ కోల్పోకుండా చక్కగా ఉంటుంది. కానీ ఎక్కువసేపు కూచునేవారిలో తుంటి ఎముకకు దన్నుగా ఉండే బలమైన కండరం ఎప్పుడూ బిగుతుగా, కుంచించుకునే ఉంటుంది. దీనివల్ల మనం నడుస్తున్నప్పుడు- అంగల మధ్య దూరం కూడా తగ్గుతుంది. నడిచేటప్పుడు బ్యాలెన్స్ తప్పిపోతుంటారు. బుటక్(హిప్/పిరుదుల) కండరాలకు హాని మనం కూచున్నప్పుడు పిరుదుల కండరాలకు ఎలాంటి పనీ ఉండదు. మనం రోజంతా కూచునే ఉంటే క్రమేపీ వీటికి పని అలవాటు పోతుంది. దీంతో నిలబడినప్పుడు స్థిరత్వం దెబ్బతింటుంది. అంగల మధ్య దూరమూ తగ్గుతుంది..
రక్తప్రసరణ తగ్గుముఖం:
రోజులో ఎక్కువ సమయం కూచునే ఉండిపోతుండటం వల్ల కాళ్లకు రక్తప్రసరణ తగ్గిపోతుంది. ఇది కాళ్లల్లో నీరు చేరటానికి దారితీస్తుంది. మడమల వాపు, సిరలు ఉబ్బరించటం, సిరల్లో రక్తపు గడ్డలు ఏర్పడటం (డీవీటీ) వంటి సమస్యలూ బయల్దేరతాయి..
ఎముకలు మెత్తబడటం:
మనం నడక, పరుగు వంటి బరువు మోసే పనులు చేస్తున్న కొద్దీ తుంటి ఎముక, కాళ్లల్లోని ఎముకలు బలిష్టంగా తయారై, వాటి సాంద్రత పెరుగుతుంది. కానీ మనం ఎప్పుడూ కూచునే ఉంటుంటే వీటికి కదలికలు లేక.. ఎముక పటుత్వమూ తగ్గుతుంది. ఇటీవలి కాలంలో ఎముక క్షీణత సమస్య పెరగటానికి శారీరక శ్రమ లేకపోవటం ఓ ముఖ్య కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు..
క్యాలరీలు ఖర్చు కావటం తగ్గిపోతుంది
కూచోగానే.. ఒంట్లో క్యాలరీలు ఖర్చు కావటం తగ్గిపోతుంది. క్యాలరీల వినిమయ రేటు నిమిషానికి ఒక్క కేలరీకి పడిపోతుంది. అదే మనం నడుస్తుంటే దీనికి మూడు రెట్లు ఎక్కువ ఖర్చవుతుంది. మెదడు నీరసం కండరాలు కదులుతున్నప్పుడు మెదడుకు రక్త సరఫరా పెరుగుతుంది. మెదడును ఉత్సాహపరిచే, మానసిక స్థితిని మెరుగుపరచే రసాయనాలు విడుదలవుతాయి. దీర్ఘకాలం పాటు శారీరక శ్రమలేకుండా కూచుండిపోతున్న వారిలో ఇలాంటివన్నీ మందగిస్తాయి. దీంతో మెదడు పనితీరు కూడా క్రమేపీ నెమ్మదిస్తుంది..
మెడపై ఒత్తిడి కత్తి
ఆఫీసులో ఎక్కువసేపు డెస్క్ ముందు కూచోవటం, కంప్యూటర్ మోనిటర్ వైపు మెడను ముందుకు సాగదీయటం, టైప్ చేస్తున్నప్పుడు తలను పక్కకు వంచి ఫోన్‌లో మాట్లాడటం వంటివి మెడ దగ్గరి వెన్నుపూసలపై ఒత్తిడిని పెంచుతాయి. ఇలా దీర్ఘకాలం కొనసాగితే మెడ వెన్నుపూసలు శాశ్వతంగా దెబ్బతింటాయి.
భుజం నొప్పి భారం
మెడను ముందుకు సాగదీసినపుడు భుజం, వీపు కండరాలూ ప్రభావితమవుతాయి. ముఖ్యంగా మెడ, భుజాలను కలిపే కండరం బాగా సాగుతుంది. ఇది భుజం, వెన్ను నొప్పికి దారితీస్తుంది. బిగుసుకునే వెన్ను మన వెన్నుపూసలు.. కదులుతుంటే హాయిగా ఉంటాయి. మనం కదలకపోతే అవి బిగుసుకున్నట్లవుతాయి. అలా బిగుసుకున్న తర్వాత- మనం ముందుకు వంగి కాఫీ కప్పు అందుకోవటం, షూ లేసులు కట్టుకోవటం వంటి పనులకు ప్రయత్నించినప్పుడు అవి దెబ్బతినే అవకాశం ఎక్కువ.
మనం అటూఇటూ కదులుతుంటే వెన్నుపూసల మధ్య ఉండే దళసరి స్పాంజిలాంటి డిస్కులకు రక్తం, పోషకాలు బాగా అందుతాయి. ఎక్కువసేపు కూచుంటే వీటికి పోషకాలు సరిగా అందకపోవటమే కాదు.. అవి అడ్డదిడ్డంగా నొక్కుకుపోతాయి కూడా. దీంతో వాటికి స్పాంజిలా సాగే గుణం తగ్గిపోతుంది. క్రమేపీ డిస్కుల క్షీణతా మొదలవుతుంది. అలాగే వెన్నుపూసలను-కండరాలను గట్టిగా పట్టి ఉండే కండర బంధనాలు, స్నాయువులు కూడా గట్టిపడతాయి. ఇవన్నీ వెన్నును కుంగిదీసేవే..
"డిస్కులు దెబ్బతినటం'
ఎక్కువసేపు కదలకుండా కూచునేవారికి వెన్ను కింది భాగం.. అంటే నడుము దగ్గరి (లంబార్) పూసల మధ్య డిస్కులు బయటకు తోసుకుచ్చే ముప్పు ఎక్కువ. ఇవిలా తోసుకొచ్చి.. వెన్నుపామును కూడా నొక్కటం ఆరంభిస్తాయి. దీంతో రకరకాల సమస్యలు మొదలవుతాయి.