ఊబకాయం ఇప్పుడు చాలా మందిని వేధిస్తున్న సమస్య. బరువు తగ్గించుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది మందులు కూడా వాడుతారు. మరికొంత మంది తిండి మానేస్తుంటారు. ఇలా చేయడం వలన ఆరోగ్యానికి చాలా హాని కలుగుతుంది. సరైన ఆహారాన్ని తీసుకుని కొన్ని జాగ్రత్తలు పాటిస్తే బరువు తగ్గడంతోపాటు ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు.
సెనగలలో ప్రొటీన్‌లు, పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. వీటిని తీసుకుంటే తొందరగా ఆకలి వేయదు. దాంతో సులభంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ఉడికించిన సెనగలు, నిమ్మరసం, కూరగాయ ముక్కలను ఆహారంలో భాగం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. మినపప్పులో కూడా ప్రొటీన్‌లు పుష్కలంగా ఉంటాయి.
వీటితో చేసిన ఆహారాన్ని సాయంత్రం పూట తీసుకుంటే మంచిది. బఠాణీ, బాదం, జీడిపప్పు, వాల్ నట్స్‌లో గ్లూటెన్ ఉండదు. వీటిలో ముఖ్యమైన ప్రొటీన్‌లతో పాటు ఆరోగ్యకరమైన క్రొవ్వులు ఉంటాయి. వీటిని వేయించి మొక్కజొన్నలతో కలిపి తింటే రూచిని ఆస్వాదించడమే కాక, ఆరోగ్యంగా కూడా ఉంటారు.
ఇక మొలకెత్తిన విత్తనాల విషయానికి వస్తే, వీటిలో కేలరీలు తక్కువగా ఉండి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. స్థూలకాయం ఉన్న వారు ఎలాంటి ఆందోళన లేకుండా వీటిని తినవచ్చు. వీటిలో ప్రొటీన్‌లతోపాటు జీర్ణక్రియకు అవసరమయ్యే పీచు ఉంటుంది. కూరగాయ ముక్కల్ని వీటితో కలిపి తీసుకుంటే శరీరానికి ఎనర్జీ అందడమే కాకుండా బరువు తగ్గడంలో ఉపకరిస్తుంది.