ఇక అంగట్లో తల్లి పాలు... శిశు మరణాలు అరికట్టేందుకే!
తల్లి పాల ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా తక్కువే. చంటిపిల్లలకు తల్లి పాలు అమృతంతో సమానం. పుట్టిన వెంటనే ముర్రుపాలు తాగించడం వల్ల పిల్లలకు పలు వ్యాధులు రాకుండా వారిలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని అందరికీ తెలిసిందే. కానీ ఆ బిడ్డకు పాలివ్వాల్సిన తల
తల్లి పాల ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా తక్కువే. చంటిపిల్లలకు తల్లి పాలు అమృతంతో సమానం. పుట్టిన వెంటనే ముర్రుపాలు తాగించడం వల్ల పిల్లలకు పలు వ్యాధులు రాకుండా వారిలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని అందరికీ తెలిసిందే. కానీ ఆ బిడ్డకు పాలివ్వాల్సిన తల్లి అనారోగ్యం కారణంగానో, బలహీనత కారణంగానో ఆ బిడ్డకు పాలివ్వకపోతే ఏమవుతుంది? ఆ పిల్లల్లో మెదడు పనితీరు నుండి శారీరక ఎదుగుదల, చురుకుదనం అన్నీ తగ్గిపోతాయి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఆ బిడ్డ మరణించవచ్చు కూడా. అలాంటి మరణాలను అరికట్టేందుకు దేశంలోనే తొలిసారిగా అజ్మీర్‌లోని ప్రభుత్వ జన్నానా ఆస్పత్రిలో తల్లి పాల స్టోర్ ప్రారంభించబడింది.
అజ్మీర్‌లో శిశు మరణాల సంఖ్య 16 శాతం అని, ఇప్పుడు ఈ కేంద్రం సహాయంతో శిశుమరణాల రేటుని బాగా తగ్గించవచ్చని అధికారులు చెప్తున్నారు. సకాలంలో కేంద్రానికి పాలను చేరవేసేందుకుగాను రవాణా కోసం ప్రత్యేక వాహనాలను ఉపయోగిస్తున్నారు. ప్రారంభోత్సవ సందర్భంగా ఒక్కో యూనిట్‌కు 60 మిలీ చొప్పున మైనస్ ఇరవై డిగ్రీల సెల్సియస్‌లో నిల్వ చేసిన 600 యూనిట్లను ఐసియులో తల్లిపాల అందుబాటులో లేని 7 మంది నవజాత శిశువులకు పంపిణీ చేసారు. ఈ స్టోర్‌ను ప్రయోగాత్మకంగా ప్రారంభించామని, ఇది విజయవంతమైన పక్షంలో రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ ఈ తల్లి పాల స్టోర్ మరియు పంపిణీ కేంద్రాలను ప్రారంభిస్తామని అధికారులు తెలియజేశారు.