Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లాక్‌డౌన్ తొలగిస్తే పాటించాల్సిన - తీసుకోవాల్సిన జాగ్రత్తలు! (video)

Advertiesment
లాక్‌డౌన్ తొలగిస్తే పాటించాల్సిన - తీసుకోవాల్సిన జాగ్రత్తలు! (video)
, గురువారం, 7 మే 2020 (13:09 IST)
కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేస్తోంది. ప్రస్తుతం మూడో దశ కొనసాగుతోంది. ఇది ఈ నెల 17వ తేదీతో ముగుస్తుంది. ఆతర్వాత ఒక వేళ లాక్‌డౌన్ ఎత్తివేస్తే ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలపై తీవ్ర చర్చ సాగుతోంది. లాక్‌డౌన్ తర్వాత స్వీయ నియంత్రణ తప్పకుండా పాటించాల్సిందే. వ్యక్తిగత దూరం, ముఖానికి మాస్కులు ధరించడం, చేతులను శుభ్రపర్చుకోవడం వంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. 
 
లాక్‌డౌన్‌ అనంతర చర్యలపై ఐఏపీఎస్‌ఎం రూపొందించిన అధ్యయనం పత్రం తాజాగా ప్రముఖ వైద్యపత్రిక ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ కమ్యూనిటీ హెల్త్‌లో ప్రచురితమైంది. లాక్‌డౌన్‌ను ఎత్తివేయడానికి ముందు వైరస్‌ తీవ్రత ప్రాంతాలను గుర్తించాలి. ప్రతి 10 లక్షల జనాభాలో ప్రతి 7 రోజులు, 14 రోజులకు కేసుల సంఖ్య ఎలా నమోదవుతోంది? వైద్యసేవలకు సంబంధించి ప్రతి వెయ్యి మంది జనాభాకు కొవిడ్‌ 19 బాధితులకు ఎన్ని పడకలు సమకూర్చారు? ఐసీయూ పడకలెన్ని? ఒకవేళ ఏ జిల్లాలోనైనా ఐసీయూ పడకలను ఏర్పాటు చేసే పరిస్థితి లేకపోతే.. పక్క జిల్లాలో అదనపు ఐసీయూ పడకలను సమకూర్చారో లేదో పరిశీలించాలి. 
 
రద్దీ ప్రదేశాల్లో రెండు మీటర్ల వ్యక్తిగత దూరాన్ని పాటించాలి. ముఖానికి మాస్కు ధరించకుండా వెలుపలికి రాకూడదు. 60 ఏళ్లు దాటినవారు, అధిక రక్తపోటు, మధుమేహం, తదితర దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న 50 ఏళ్లు దాటినవారు.. ఇంటిపట్టునే ఉండడం మేలు. 
 
వీలైతే వీరికి ఇంటి వద్ద నుంచే పనిచేసే వెసులుబాటు కల్పించాలి. వీరిని వీలైతే వారానికి రెండుసార్లు, లేదంటే కనీసం వారంలో ఒకరోజైనా వైద్యసిబ్బంది పరీక్షించాలి. మాల్స్‌, సినిమా హాళ్లు, షాపింగ్‌ సెంటర్లు, విద్యాసంస్థలు, మతపరమైన ప్రదేశాలు, ప్రార్థన స్థలాలు, పార్కులు, ఫంక్షన్‌ హాళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, క్రీడలు, ఎగ్జిబిషన్లు, సంగీత విభావరులు, తదితర రద్దీ ఎక్కువగా ఉండే వాటిని మరో 60 రోజుల పాటు మూసివేయాలి. 
 
ప్రజలకు నిత్యావసరాల కొరత లేకుండా.. ఉత్పత్తి సంస్థ నుంచి వినియోగదారుడికి చేరే వరకూ అన్ని స్థాయుల్లోనూ పక్కా ప్రణాళికను రూపొందించాలి. జిల్లా కలెక్టర్‌ స్థాయి అధికారి ఎప్పటికప్పుడు సమీక్షించాలి. రోగులు, వైద్యసిబ్బంది ఆసుపత్రులకు రావడానికి ఇబ్బంది పడకుండా ముఖ్యమైన మార్గాలను ఎంపిక చేసి బస్సులు, రైళ్లు, వంటి ప్రజారవాణాను పునరుద్ధరించాలి. ఇందులోనూ వ్యక్తిగత దూరం, మాస్కులు ధరించడం తప్పనిసరి. 
 
ఆదివారాలు, ఇతర సెలవు రోజుల్లో ప్రజల రాకపోకలను నియంత్రించాలి. శుభకార్యాలు, అంత్యక్రియల్లో పాల్గొనడానికి గరిష్టంగా 20 మందికి మించి అనుమతించొద్దు. నెలరోజుల పాటు ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులను సగం మంది ఉద్యోగుల హాజరుతో నడిపించాలి. ఐదురోజుల పనిదినాలుండాలి. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకూ అంతర్జాతీయ, అంతర్రాష్ట్రాల మధ్య పెద్ద సంఖ్యలో ప్రజలు రాకపోకలు కొనసాగించకుండా నియంత్రించాలి. పని ప్రదేశాల్లో శానిటైజర్లను సమకూర్చాలి. 
 
బస్సు/రైళ్లలో ఒక సీటులో ఒక ప్రయాణికుడు మాత్రమే కూర్చోవడానికి అనుమతించాలి. ఆటోల్లో డ్రైవరు కాకుండా మరొకరు, టాక్సీల్లో డ్రైవర్‌ కాకుండా మరో ఇద్దరు ప్రయాణించాలి. అందరూ మాస్కులు ధరించాలి. శానిటైజర్‌ను అందుబాటులో ఉంచుకోవాలి. తక్కువ ముప్పు ఉన్నచోట.. 30 రోజుల కార్యాచరణను పరిశీలించాలి. ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు మినహా ఇతర సంస్థల్లో ఒక్కో షిఫ్టులో 70 శాతం ఉద్యోగుల హాజరుతో నడిపించాలి. 
 
ముప్పు కొంచెం ఎక్కువగా.. 40 రోజుల కార్యాచరణను అమలుచేయాలి. పరిస్థితులు మెరుగుపడితే మార్చుకోవాలి. కార్యాలయాల్లో 50 శాతం ఉద్యోగులు ఒక షిఫ్టులో హాజరవ్వాలి. ఉత్పత్తి 70 శాతానికి మించి జరగొద్దు. ముప్పు తీవ్రత అధికంగా.. 50 రోజుల పాటు పరిశీలించాలి. మొత్తం ఉద్యోగుల్లో 30 శాతం మాత్రమే ఒక షిఫ్టులో పనిచేయాలి. ఉత్పత్తి గరిష్టంగా 50 శాతానికి మించి జరగొద్దు. తీవ్రత మరీ ఎక్కువుంటే.. ఉద్యోగులు 20 శాతానికి కంటే ఎక్కువగా ఒక షిఫ్టులో హాజరవ్వద్దు. ఉత్పత్తి కూడా 30-50 శాతానికి దాటొద్దు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జన్యు ఆధారిత టీకాతో కరోనాకు చెక్ - తొలుత జంతువులపై ప్రయోగం