Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రొటీన్లు లేని ఆహారంతో కడుపు మాడ్చారు.. మహానగరాల్లో కొత్త ఆరోగ్య సంక్షోభం

స్వీట్ తినాలంటే భయం. మాంసం ముట్టుకోవాలంటే భయం. పాలు, గుడ్లు, వెన్న, నెయ్యి ఏది తీసుకోవాలన్నా భయం. ఎందుకంటే ఎక్కడ లావైపోతామో, ఎక్కడ కొలెస్ట్రాల్ పెరిగి చస్తామో అనే భయం. ఆ భయమే ఎవరికి వారిని సెల్ఫ్ స్టయిల్ డాక్టర్లుగా, ఆహార నిపుణులుగా మార్చేస్తుంది. ఎవ

ప్రొటీన్లు లేని ఆహారంతో కడుపు మాడ్చారు.. మహానగరాల్లో కొత్త ఆరోగ్య సంక్షోభం
హైదరాబాద్ , మంగళవారం, 1 ఆగస్టు 2017 (06:22 IST)
స్వీట్ తినాలంటే భయం. మాంసం ముట్టుకోవాలంటే భయం. పాలు, గుడ్లు, వెన్న, నెయ్యి ఏది తీసుకోవాలన్నా భయం. ఎందుకంటే ఎక్కడ లావైపోతామో, ఎక్కడ కొలెస్ట్రాల్ పెరిగి చస్తామో అనే భయం. ఆ భయమే ఎవరికి వారిని సెల్ఫ్ స్టయిల్ డాక్టర్లుగా, ఆహార నిపుణులుగా మార్చేస్తుంది. ఎవరు ఏది నమ్మితే అదే వైద్యం. శరీరానికి సమపాళ్లలో అవసరమైన ప్రతిదీ తీసుకోవాలని వైద్య శాస్త్రం ఒకవైపు మొత్తుకుంటూనే ఉంటుంది. కానీ వినం. అమ్మే ఇది తింటే, ఇది తాగితే ఇలా జరుగుతుంది. ఒకసారి ఒళ్లు లావెక్కితే తర్వాత తగ్గడం కష్టం. ఎక్కడ షుగర్ వ్యాధి వచ్చి తగులుకుంటుందో, జీవితాంతం మందులు తింటూ బతకాలో..అనే భయం.
 
పనికిరాని, అనవసరమైన, మతిమాలిన ఈ భయాలే ఇప్పుడు దేశంలోని మహానగరాల కొంప ముంచుతోంది మానవ శరీరానికి తప్పనిసరిగా కావలసిన ప్రొటీన్లు, పోషకాహారం లేక మన నగరాల్లో 70 నుంచి 80 శాతం మంది జనం గిడసబారిపోతున్నారని తాజా సర్వే చెప్పింది. శారీరక, మానసిక ఎదుగుదలకు అతిముఖ్యమైన ప్రొటీన్ల లేమితో నగరవాసులు బాధపడుతున్నారని సర్వేలో తేలింది. మాంసాహారం, బిర్యానీకి మారుపేరైన హైదరాబాద్ నగరంలోనే 70 శాతం మంది వాటిద్వారా వచ్చే ప్రొటీన్లు లోపించి కొత్త కొత్త వ్యాధులను చేతులారా ఆహ్వానిస్తున్నారని సర్వే దారుణమైన నిజాన్ని వెల్లడించింది. నగరవాసుల్లో చాలామందికి కనీసం ప్రొటీన్లు అంటే ఏమిటి, వాటి ఉపయోగం ఏమిటి అనే విషయం కూడా తెలీకుండా మాంసకృత్తులు అంటేనా ఆమడ దూరం పాటిస్తున్నారట. 
 
నగరీకరణ పెరుగుతున్న క్రమంలో మారుతున్న జీవనశైలిపై దేశంలోని మెట్రో నగరాల్లో ఇండియన్‌ మార్కెట్‌ రీసెర్చ్‌ బ్యూరో అధ్యయనం చేసింది. ముఖ్యంగా మహానగరాల్లోని అధిక శాతం మంది ప్రజలు ప్రొటీన్లు లేని ఆహారం తీసుకుంటున్నట్టు ఈ అధ్యయనంలో వెల్లడైంది. అన్నింటి కంటే ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నో ప్రొటీన్ల వినియోగంలో అట్టడుగున ఉంది. ఈ నగరంలో 90 శాతం మంది ప్రొటీన్లు లేని ఆహారం తీసుకొంటున్నారని, దానిపై అవగాహనలో కూడా వెనుకంజలో ఉన్నారని తేలింది. ఇక చెన్నైలో 84 శాతం మంది, అహ్మదాబాద్‌లో 83 శాతం, హైదరాబాద్‌లో 70 శాతం మంది ప్రొటీన్ల లోపంతో బాధపడుతున్నట్లు తెలిపింది. ఊబకాయం భయం, పోషక విలువలపై అవగాహన లేకపోవడం దీనికి ప్రధాన కారణం.
 
నగరంలో పోషక విలువల లోపానికి కారణాలు చాలానే ఉన్నాయి.  పాలు, గుడ్లు, వెన్న, నెయ్యి, మాంసం వంటి పదార్థాలను తరచూ తీసుకోవడం వల్ల కొవ్వు నిల్వలు పెరిగి ఊబకాయులుగా మారతామన్న భయం. ఏఏ ఆహార పదార్థాల్లో అధిక ప్రొటీన్లుంటాయో అవగాహన లేకపోవడం  బిజీ లైఫ్‌లో సమయం చిక్కకపోవడంతో సంతులిత ఆహారం ఉండేలా చూసుకోకపోవడం. అధిక ప్రొటీన్లు ఉండే ఆహార పదార్థాలను తరచూ మార్కెట్‌కు వెళ్లి కొనుగోలు చేసే తీరిక, ఓపిక లేకపోవడం. అధికంగా ప్రొటీన్లు ఉన్న ఆహార పదార్థాలతో డయాబెటిస్, బీపీ, గుండె జబ్బులు ఇతర జీవనశైలి వ్యాధుల బారిన పడతామన్న భయం.
 
వాస్తవం ఏమిటంటే మనిషి దేహంలో ప్రతి కణం యొక్క నిర్మాణానికి ప్రొటీన్లు అత్యావశ్యకం అని వైద్య శాస్త్రం చెబుతోంది. శరీరంలో దెబ్బతిన్న కణజాలానికి మరమ్మతులు చేసే గుణం ప్రొటీన్లకుంది. శరీరంలో అవసరమైన ఎంజైమ్‌లు, హార్మోన్ల ఉత్పత్తి సాధ్యపడుతుంది. ఎముకలు, కండరాల నిర్మాణానికి అత్యవసరం. రక్త హీనతను పారదోలే గుణం ప్రొటీన్లలో ఉంది.
 
అందుకే మనం రోజువారీగా తీసుకునే ఆహారంలో ప్రోటీన్స్,విటమిన్స్,కార్భోహైడ్రేట్స్‌ సమపాళ్లలో ఉండేలా చూసుకోవాలని, జంక్‌ఫుడ్,ఆల్కహాల్‌ వంటి పదార్థాలకు సాధ్యమైనంత దూరంగా ఉండడం మంచిదనీ, అన్ని వయస్సుల వారి ఎదుగుదల,పోషణకు ప్రోటీన్స్‌ అవసరమేనని తాజా సర్వే తేల్చి చెబుతోంది. ఊబకాయంతో బాధపడుతున్న వారు కూడా డైటీషియన్,వైద్యుల సూచనల మేరకు ఫుడ్‌చార్ట్‌ ఉండేలా చూసుకోవాలి. ప్రొటీన్లను పూర్తిగా మానివేస్తే అది మరొక రకమైన ప్రాణాంతకానికి దారి తీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 
ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలు.. పాలు, పెరుగు, గుడ్లు, వెన్న, పాలకూర, తోటకూర, బచ్చలికూర, టమాటా, సోయాబీన్స్, ఆకుపచ్చ బఠానీలు, తాజా చేపలు, చికెన్, బాదం, జీడిపప్పు, జామ, యాపిల్, మష్రూమ్స్, కీర దోసకాయ, డ్రైఫ్రూట్స్‌. వీటిని ఆహారంగా తీసుకుంటే తప్ప నగరాల్లోని ప్రజల ఆరోగ్యం కుదుటపడదని చెబుతున్నారు.
 
ఇకనైనా సొంత వైద్యాలు, సొంత తెలివులు, సొంతభయాలు మానుకుని తీవ్ర వ్యాధులున్నవారు మినహా ప్రతి ఒక్కరూ సీజన్‌లో దొరకే ప్రతి ఆహార పదార్థాన్ని తింటేనే మంచిది. పాటించాలా వద్దా అన్నది మీ ఇష్టం,. కాదు కాదు.. మనిష్టం..
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిద్రపోయే ముందు ఏం చేస్తున్నారు?