భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఏప్రిల్ నెల ప్రారంభంలోనే పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఫలితంగా తెలుగు రాష్ట్రాలతో పాటు.. పలు రాష్ట్రాలు నిప్పుల కుంపటిని తలపిస్తోంది. పలు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ ఎండ వేడిని తట్టుకోలేక చాలా మంది నీరసించి పోతున్నారు. వడదెబ్బ, నీరసం వంటి ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు.
ఇలాంటి వారు ఆరోగ్యం జాగ్రత్తలను పాటించాల్సివుంటింది. ఇక శరీరానికి నీటిని తరచుగా అందించాలి. కొబ్బరి నీళ్ళు, పండ్ల రసాలు, నిమ్మరసం తీసుకోవాలి. వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి యోగాలోని కొన్ని ప్రాణామాయాలు ఆచరించాలి. ఇలా చేయడం వల్ల వేడి నుంచి ఉపశమనం పొందొచ్చు.
అలాగే, దాహం లేకపోనా నీరు తాగుతూనే ఉండాలి. తక్కువ ఆహారం ఎక్కువ సార్లు ఆరగించడం మంచిది. వేడి పెరిగినప్పుడు బయటకు వెళ్లకపోవడమే మంచిది. వదులుగా ఉండే బట్టలు వేసుకోవాలి. ముఖ్యంగా ఖద్దరు వస్త్రాలు ధరించే మరీ మంచిది. అలాగే లైట్ కలర్ ఉండే బట్టలు వేసుకోవాలి. పగటిపూట ఆటలకు దూరంగా ఉండాలి. ఎండలో పనిచేస్తుంటే... మధ్యమధ్యలో విశ్రాంతి తీసుకోవాలి. మద్యం జోలికి పోవద్దు. ఎక్కువ కెఫైన్ తీసుకోవద్దు. వ్యాయామాలు కూడా అధికంగా చేయకూడదు.
అదేసమయంలో వేసవి కాలంలో అత్యధికంగా ద్రాక్ష పండ్లను తీసుకుంటే లాభదాయకమౌతుంది. దీంతో శరీరంలో నీటి శాతం అధికంగా ఉంటుంది. అత్యధిక వేడి కారణంగా తలనొప్పి వస్తే గోరువెచ్చని నీటిలో అల్లం, నిమ్మకాయ రసంతోబాటు కాసింత ఉప్పును కలిపి త్రాగితే ఉపశమనం కలుగుతుంది.
మోకాళ్ళు, మోచేతుల్లో నొప్పులు ఉంటే ఒక గ్లాసు వేడి నీటిలో నిమ్మరసం పిండి పగటిపూట రోజుకు ఎనిమిదినుంచి పది గ్లాసుల నీటిని త్రాగండి. దీంతో నొప్పులు మటుమాయం. మోకాళ్ళుపై వేపనూనెతో మృదువుగా మాలిష్ చేస్తే ఉపశమనం కలుగుతుంది. సొరకాయ గుజ్జును అరికాళ్ళకు రాస్తే అరికాళ్ళల్లో మంటలుంటే తగ్గిపోతాయి.
శరీరంలోని ఏ భాగంలోనైనాకూడా మంట పుడితే పుచ్చకాయలోని తెల్లటి భాగాన్ని కర్పూరం మరియు చందనంతో కలిపి లేపనం చేస్తే మంట తగ్గి ఉపశమనం కలుగుతుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు.
ఎండలో అధిక సమయం ఉంటే వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. చర్మం జిడ్డుగా, రంగు పాలిపోయినటలుగా, ఎర్రగా మారిపోతే... వడదెబ్బ తగలబోతోందని అర్థం. చెమటలు బాగా పడతాయి. తలనొప్పి వస్తుంది. వికారంగా ఉంటుంది. కళ్లు మసగ్గా అవుతాయి. నీరసం వస్తుంది. కిందపడిపోవడం వంటివి ఈ వడదెబ్బ లక్షణం.