Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పండ్ల గింజలను తినకుండా ఊసేయడం మన అజ్ఞానానికి పరాకాష్ట. అవి అమృతమట

కొన్ని గింజలను తినలేని, తినరానివాటిగా చూస్తుంటాం. పంటి కిందికి వచ్చిందా... గబుక్కున ఊసేస్తుంటాం. ఉదాహరణకు బొప్పాయి మధ్యన కనిపించే నల్లని గింజ ఒక్కటి పొరబాటున వచ్చినా దాన్ని ఠక్కున బయటకు తీసిపడేస్తాం. పుచ్చకాయ తినేటప్పుడు దాని గింజల్నీ అంతే. కానీ... త

పండ్ల గింజలను తినకుండా ఊసేయడం మన అజ్ఞానానికి పరాకాష్ట. అవి అమృతమట
హైదరాబాద్ , గురువారం, 25 మే 2017 (06:09 IST)
కొన్ని గింజలను తినలేని, తినరానివాటిగా చూస్తుంటాం. పంటి కిందికి వచ్చిందా... గబుక్కున ఊసేస్తుంటాం. ఉదాహరణకు బొప్పాయి మధ్యన కనిపించే నల్లని గింజ ఒక్కటి పొరబాటున వచ్చినా దాన్ని ఠక్కున బయటకు తీసిపడేస్తాం. పుచ్చకాయ తినేటప్పుడు దాని గింజల్నీ అంతే. కానీ... తినరానివంటూ మనం పరిగణించే చాలా రకాల గింజలకు చాలా విలువ ఉంది. ఆరోగ్యపరంగా వాటికి ఉండే ప్రాధాన్యం తేలిగ్గా తీసిపారేయలేనిదే. వాటిలో చాలా రకాల విటమిన్లు, ప్రోటీన్లు, పీచు, ఖనిజలవణాల వంటి పోషకాలు ఉంటాయి. మనం తేలిగ్గా పరిగణించి, తుపుక్కున ఊసేసే కొన్ని గింజల ప్రాధాన్యాన్ని తెలుసుకుందాం.
 
చాలామందికి లోటస్‌ గింజలు అన్న మాటే కొత్తగా అనిపిస్తుంది. కానీ తామరపూల నుంచి ఈ గింజలు లభ్యమవుతాయి. వీటిని కొంతమంది కూరగా వండుకుంటారు. చాలామంది వీటిని ఎండబెట్టి ఔషధల తయారీలో ఉపయోగిస్తారు. తామర గింజల నుంచి ఎన్నో పోషకాలు లభ్యమవుతాయి. ఈ గింజల్లో ‘ఎల్‌–ఐసోయాస్పరై్టల్‌ మిథైల్‌ట్రాన్స్‌ఫెరేజ్‌’ అనే ఎంజైమ్‌ ఉంది. ఇది మనలోని దెబ్బతిన్న కణజాలాన్ని చాలా వేగంగా రిపేర్‌ చేస్తుంది. అందుకే వీటిని తినేవారు చాలా కాలం యౌవనంగా కనిపిస్తారు. లోటస్‌ గింజల్లోని ఈ గుణం కారణంగా చాలా కాస్మటిక్‌ కంపెనీలు తమ యాంటీ–ఏజింగ్‌ మందుల్లో వీటిని వాడుతున్నాయి. 
 
పుచ్చపండు తినే సమయంలో ఆ ఎర్రటి గుజ్జులో ఇమిడి ఉండే ఈ గింజల్ని వెంటనే ఊసేస్తాం. కానీ ఈ గింజల్లో ప్రోటీన్‌ పుష్కలంగా ఉంటుంది. ఒక కప్పు (దాదాపు 100 గ్రాముల) ఎండబెట్టి గింజలను సేకరించి విశ్లేషిస్తే... అందులో 30.6 గ్రాముల ప్రోటీన్‌ ఉంటుందనీ, మనకు రోజుకు అవసరమయ్యే ప్రోటీన్‌లో అది 61% అని తెలుస్తుంది. ఆ గింజల్లో ఉండే మరో పోషకం ఆర్గనైన్‌. ఇది రక్తపోటును నియంత్రించడమే కాదు... గుండెజబ్బులు రాకుండా నివారిస్తుంది. ఐరన్, ఫాస్ఫరస్, సోడియమ్, కాపర్, మ్యాంగనీస్, జింక్‌ వంటి అనేక ఖనిజాలు పుచ్చగింజల్లో పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన జీవక్రియలకు అత్యంత  అవసరమైన ఖనిజాలే. 
 
సాధారణంగా చాలా మంది పనస తొనలు తిన్న తర్వాత ఆ గింజలను పారేస్తుంటారు. అయితే పనస గింజల్లో చాలా పోషకాలు ఉంటాయి. 100 గ్రాముల పనస గింజల్లో 184 క్యాలరీల శక్తి, 7 గ్రాముల ప్రోటీన్లు, 38 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 1.5 గ్రాముల పీచు, కొవ్వుపదార్థాలు ఉంటాయి. వాటిలో పీచు ఎక్కువ కాబట్టి స్థూలకాయం రాకుండా నివారిస్తాయి. జీర్ణప్రక్రియ సాఫీగా అయ్యేలా చూస్తాయి. కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండెజబ్బులను అరికడతాయి. రక్తంలో చక్కెరపాళ్లను అరికట్టే తత్వం ఉన్నందున డయాబెటిస్‌ను నివారిస్తుంది. జీర్ణాశయాన్ని పరిశుభ్రంగా ఉంచుతుంది. తద్వారా పొట్ట ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
 
గుమ్మడి గింజల్లో పనాగమిక్‌ ఆసిడ్‌ ఎక్కువ.  ఆక్సిజన్‌ లేదా పెరాక్సైడ్స్‌ పెరగడం వల్ల కలిగే దుష్ప్రభావాలను పనాగమిక్‌ ఆసిడ్‌ నిరోధిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని సక్రమంగా కాపాడటానికి దోహదం చేస్తుంది. ఇక ఒత్తిడిని నివారించడానికి గుమ్మడి గింజలు ఎంతగానో దోహదపడతాయి. ఒత్తిడి వల్ల కలిగే అలసట ఫీలింగ్‌ను గుమ్మడి గింజలు పోగొడతాయి. గుమ్మడి గింజలు ఎక్కువగా తీసుకుంటే ఎప్పుడూ ఏదో తినాలనే కాంక్ష తగ్గుతుంది. అందుకే స్థూలకాయం పెరగకుండా చూసుకోవాలని జాగ్రత్తపడేవారు ఈ గుమ్మడి గింజలను తీసుకోవచ్చు. 
 
బొప్పాయిని కోశాక దాని లోపలి గోడలకు అంటుకుని కనిపించే గింజలను కత్తితోనో, స్పూన్‌తోనో వదిలించుకుంటాం. పొరబాటున ఒకటో అరో గింజలు పంటికిందికి పోయిన పర్లేదు. లేదా మీరు కొరికి తిన్నా ఓకే.
ఎందుకంటే... బొప్పాయి గింజల్లో ఓలిక్, పాల్మిటిక్‌ యాసిడ్స్‌ అనే ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి. శక్తిమంతమైన ఆ ఫ్యాటీయాసిడ్స్‌ క్యాన్సర్‌ను దూరంగా తరిమేస్తాయి. చైనా సంప్రదాయ మందుల్లో ఈ గింజల్ని కాలేయాన్ని శుద్ధి చేసే ఔషధంగా ఉపయోగిస్తారు.
 
పంటి కింద గింజ పడితే అంతగా ఎందుకు గింజుకుంటారు మింగితే కడుపులో ఏమైనా చెట్టవుతుందా అవుతుంది... ఆరోగ్య ఫలాలిచ్చే చెట్టవుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యమంటారు. జ్ఞానం విత్తులాంటిదని కూడా అంటారు. కాబట్టి విత్తులను ఉమిసేయకుండా తప్పక నమిలి తినండి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వేసవి కాలం... భోజనం చేసిన వెంటనే ఐస్ వాటర్ తాగితే?