ఈ సాంకేతిక యుగంలో చాలా మంది రొటీన్ లైఫ్‌స్టైల్‌కి అలవాటుపడిపోయారు. రోజులో చాలా సేపు టీవీ ముందర కూర్చోవడం, సీరియల్స్ చూడటం. కాల్ సెంటర్‌లు వంటి వాటిలో కూర్చుని పని చేసే ఉద్యోగాలు చేయడం. వ్యాయామం చేయకపోవడం, నడవకపోవడం, ఇలాంటి చర్యల వల్ల ఆరోగ్యానికి మంది దెబ్బే తగులుతుంది. ముఖ్యంగా కాళ్లు పాడైపోయే అవకాశం ఉంది.
కాళ్లు వాచిపోవడం, దానితోపాటు నల్ల మచ్చలు రావడం, నరాలు ఉబ్బిపోవడం వంటివి చోటు చేసుకుంటాయి. కాలిపై నల్ల మచ్చలు రాగానే చాలా మంది స్కిన్ స్పెషలిస్ట్‌లను సంప్రదిస్తారు. అయితే అన్ని వేళలా ఇది చర్మ రోగం అనుకుంటే పొరపాటే. ఎక్కువసేపు కూర్చుంటే కాళ్ల వాపు రావడం సాధారణమే. కానీ కొన్నిసార్లు వచ్చే కాళ్లవాపును ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.
కాళ్లవాపుతో పాటు నల్లని మచ్చలు కనిపించడం, ఎర్రగా మారితే ఇంకా ప్రమాదం. ఒక్కోసారి ఆ వాపు తీవ్రమై, అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేరాల్సి రావచ్చు. ఎక్కువ సమయం, గంటల తరబడి కూర్చోవడం వల్ల కాళ్లలో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థలో అవాంతరం తలెత్తుతుంది. మస్కులార్ పంప్ పనితీరు తగ్గిపోతుంది. ఇది కాళ్లకు రెండు రకాలుగా హాని చేస్తుంది. మొదట రక్తంలో ఆక్సిజన్ తగ్గిపోతుంది.
పెద్ద మొత్తంలో మలినాలు పేరుకుపోతాయి. దీనివల్ల అసౌకర్యంగా ఉండటం, దురద, కాళ్లలో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. రెండవది రక్తం గడ్డకట్టడం వల్ల, మలినాలతో కూడిన రక్తం కాళ్లలో పేరుకుపోవడం వల్ల తీవ్రమైన నొప్పి మొదలవుతుంది. రెగ్యులర్‌గా నడవకపోవడం, గంటల తరబడి కూర్చుని పనిచేయడం వల్ల కాళ్లలో బ్లడ్ క్లాట్స్ ఏర్పడుతుంటాయి.
ఈ పరిస్థితిని మెడికల్ టర్మ్స్‌లో డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటారు. ఒకవేళ ఈ కండీషన్‌కు సరియైున సమయంలో చికిత్స తీసుకోకపోతే పల్మనరీ ఎంబాలిజమ్‌కు దారితీసి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. అంటే కాళ్లలో ఏర్పడిన బ్లడ్ క్లాట్స్ అక్కడి నుంచి కదిలి రక్తనాళం గుండా ప్రయాణించి గుండె ద్వారా ఊపిరితిత్తులకు చేరే ప్రమాదం ఉంది. ఒకవేళ సరియైున సమయంలో చికిత్స తీసుకోకపోతే ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. నొప్పి, కాలు వాపు ఉన్నట్లయితే వాస్క్యులర్ సర్జన్‌ను కలవడం ద్వారా ఈ పరిస్థితి రాకుండా కాపాడుకోవచ్చు.
ఉదయాన్నే కాసేపు నడవడం అలవాటు లేకపోవడం, వ్యాయామం చేయకపోవడం వల్ల కాళ్లలో డ్రెనేజ్ వ్యవస్థలో అవాంతరాలు ఏర్పడతాయి. కాళ్లలో ఉండే కవాటాలు పనిచేయడం మానేస్తాయి. దీంతో రక్తం పైకి ప్రవహించలేకపోతుంది. కాలి కింది భాగంలో చెడు రక్తం పేరుకుపోతుంది. ఒకదశ దాటిన తరువాత రక్తనాళాలు(సిరలు) ఉబ్బిపోతాయి. బయటకు ఉబ్బి వానపాముల మాదిరిగా, నీలిరంగులో స్పష్టంగా కనిపిస్తుంటాయి.
ఈ సమస్యను వెరికోస్ వెయిన్స్ అంటారు. ఒకవేళ జీవనవిధానంలో మార్పులు చేసుకోకుండా, సరైన చికిత్స తీసుకోకుండా వదిలేస్తే సిరలు బాగా ఉబ్బిపోయి కాలిలో రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుంది. కొందరిలో కాలు వాపుతో పాటు గుండ్రని నల్లటి మచ్చలు కనిపిస్తాయి. కాలు వాపు ఎప్పుడూ ఉంటుంది. ఉదయం వేళ కాలు వాపు కొద్దిగా తగ్గినట్టే కనిపించినా, సూర్యాస్తమయం తరువాత మళ్లీ మొదలవుతుంది.
సాధారణంగా ఈ సమస్య మధ్య వయసు స్త్రీలలో కనిపిస్తుంది. అధిక బరువు ఉండి, ఎక్కువ సమయం కూర్చుని ఉండే వారిలోనూ కనిపిస్తుంది. ఈ సమస్యను క్రానిక్ వీనస్ ఇన్‌సఫిసియెన్సీ అంటారు. ఒకవేళ నల్లని మచ్చలు కాలు కింది భాగంలో కనిపిస్తే కనుక వాస్క్యులర్ సర్జన్‌ను సంప్రదించాలి. కాలు వాపుకు మరికొన్ని కూడా కారణాలు కావచ్చు.
లింఫడిమా, ఎలిఫెంటియాసిస్, కిడ్నీ, గుండె సంబంధ వ్యాధులు, రక్తపోటు నియంత్రణ కోసం వాడే అమ్లోడిపిన్ వంటి మందులు కారణం కావచ్చు. కాలి రక్తనాళాలలో బ్లడ్ క్లాట్స్ ఉన్నట్లయితే తొలగించాలి. ప్రత్యేకమైన చికిత్సా పద్ధతులు, మందుల ద్వారా సాధారణ స్థితికి తీసుకురావచ్చు.
సాధారణంగా సర్జరీ అవసరం ఉండదు. ఉదయాన వాకింగ్ చేయడం, కొన్ని వ్యాయామాలు చేయడం అలవాటు చేసుకోవాలి. ఒకవేళ వెరికోస్ వెయిన్స్ ఉంటే కనుక లేజర్ సర్జరీ లేక రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ టెక్నిక్ సహాయంతో కంట్రోల్ చేయవచ్చు. వాపును తగ్గించవచ్చు. ఈ పద్ధతుల్లో చర్మంపై గాటుపెట్టడం, కుట్లు వేయడం ఉండదు. మరుసటిరోజు ఆఫీసుకు వెళ్లిపోవచ్చు.