అవిసెగింజలు శక్తివంతమైన మొక్క ఆహారాలలో ఒకటని చెప్పవచ్చు. గుండె వ్యాధి, క్యాన్సర్, స్ట్రోక్, మధుమేహం వంటి ప్రమాదాలను తగ్గిస్తాయని వైద్యులు అంటున్నారు. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపరచడంలో, క్యాన్సర్ కారకాలతో పోరాటం చేయడంలోనూ అవిసెగింజల్లోని ప్రత్యేక పోషకాలు కీలకంగా పనిచేస్తాయి. ఇంతటి మేలు చేసే ఈ గింజలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలూ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దామా!
అవిసె గింజల్లో లభించే పోషకాలు జుట్టు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. దీనిలోని బి విటమిన్, కీలక కొవ్వులు చర్మం పొడిబారే తత్వాన్ని తగ్గించి, మృదువుగా తయారు చేస్తాయి. అవిసెలోని ఆరోగ్యకరమైన కొవ్వులు, పీచు పదార్థాలు మలబద్ధకాన్ని నివారించడానికి తోడ్పడుతుంది. తక్కువ మోతాదులో ఉండే కెలోరీలు బరువుని నియంత్రిస్తాయి. వీటిని నేరుగా తీనడానికి ఇష్టం లేనివారు సూప్‌లు, సలాడ్‌లు, స్మూతీల్లో వేసుకుని తీసుకుంటే మంచిది. వీటివల్ల జీర్ణక్రియ రేటు మెరుగుపడుతుంది. వీటిల్లోని పోషకాలకు రొమ్ము, అండాశయ క్యాన్సర్ కారకాలతో పోరాడే శక్తి ఉంది.
మెనోపాజ్ దశకు చేరుకున్న మహిళలకు అవిసెగింజల్లో లభించే లిగ్‌నాన్స్ ఎంతో మేలు చేస్తాయి. లిగ్‌నాన్స్‌కి ఈస్ట్రోజన్ గుణాలు అధికం. హార్మోన్ల సమతూకం సాధనకూ ఓ ఔషధంలా ఉపయోగపడుతుంది. అంతేకాదు ఎముకలు దృఢంగా ఉండేందుకు అవిసెగింజలు తోడ్పడతాయి. రుతుక్రమం సవ్యంగా కొనసాగడంలో సాయపడతాయి.