నవ్వడం ఒక భోగం.. ననవ్వించడం ఒక యోగం.. నవ్వలేకపోవడం ఒక రోగం అన్నాడో సినీ కవి. నవ్వు నలభై విధాల మేలు అనేది నేటి మాట. మన ముఖంలో నవ్వు కనబడాలి అంటే మన ముఖంలోని 32 కండరాలు కదలాలట. నవ్వడం ఒక వ్యాయామం అని వైద్యులు చెప్తున్నారు.
మొత్తం జీవరాశిలో నవ్వు మానవ జాతికే లభించిన వరదానమనే చెప్పాలి. నవ్వడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఒత్తిడి శారీరక, మానసిక ఆరోగ్యానికి హానికరం. మనం నవ్వినప్పుడు, మన శరీరం న్యూరోపెప్టైడ్స్‌ను విడుదల చేస్తుంది. ఈ చిన్న అణువులు ఒత్తిడి ఉపశమనం, ప్రశాంతతను ప్రేరేపించే దిశగా పనిచేస్తాయి. నేడు వరల్డ్ స్మైల్ డే. ఈ రోజును ప్రతి సంవత్సరం అక్టోబర్ మొదటి శుక్రవారం జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఇది అక్టోబర్ 7న వస్తుంది.
హార్వే బాల్ ఒక అమెరికన్ కళాకారుడు మొదట ప్రపంచ స్మైల్ డే వేడుకను ప్రతిపాదించాడు. 1963లో, అతను ఐకానిక్ స్మైలీ ఫేస్ చిత్రాన్ని కనుగొన్నాడు. అతని కళాకృతిగా ఆ స్మైలీ ఫేస్ సిద్ధమైంది. అలా 1999 నుండి, అక్టోబర్‌లో మొదటి శుక్రవారాన్ని ప్రపంచ చిరునవ్వు దినంగా గుర్తించారు. 2001లో అతని మరణం తరువాత, అతని పేరు, జ్ఞాపకాలను గౌరవించటానికి హార్వే బాల్ వరల్డ్ స్మైల్ ఫౌండేషన్ స్థాపించబడింది.
ఈ రోజు అందరి చిరునవ్వులకు అంకితం చేయబడింది. వ్యక్తులు దయతో ప్రవర్తించమని, ఇతరులను నవ్వించమని ప్రోత్సహించడమే ఈ రోజుటి లక్ష్యం. చిరునవ్వు రాజకీయ, భౌగోళిక లేదా సాంస్కృతిక సరిహద్దులను గుర్తించదు.. అనేది ఈ డే థీమ్‌గా పరిగణించబడుతోంది.