ఇద్దరు వ్యక్తులు ఎదురెదురుగా తారసపడినపుడు నమస్కారం చేసుకోవడం లేదా షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం జరుగుతుంది. అలా ఇచ్చే షేక్ హ్యాండ్ పవర్‌ఫుల్‌గా, చేతి గ్రిప్ బలంగా ఉన్నట్టయితే గుండెపోటురాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చేతులు బలంగా, మంచి పటుత్వంతో ఉన్నాయంటే ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క.
ఇందుకోసం 35 నుంచి 70 యేళ్ళ వయసున్న వారిపై పరిశోధన చేశారు. వీరంతా 17 దేశాలకు చెందిన వాళ్లు. వీరి ఆరోగ్యాన్ని వరుసగా నాలుగేళ్ల పాటు క్రమంతప్పకుండా పరిశీలించారు. వైద్య పరీక్షలకు వచ్చినప్పుడల్లా జమర్ డైనమోమీటర్ అనే పరికరంతో పేషంట్ల కండరాల శక్తిని పరీక్షించేవారు.
చేతి గ్రిప్పులో ఐదు కేజీల తగ్గుదల కనిపిస్తే చనిపోయే రిస్క్ 16 శాతం పెరిగినట్టు తేలింది. నాలుగు సంవత్సరాల్లో చేసిన వైద్య పరీక్షల్లో ఏ అనారోగ్య కారణం వల్లనైనా వ్యక్తులు మృత్యువాత పడొచ్చు. అంతేకాదు చేతిలో పటుత్వం తగ్గితే 7 శాతం గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలిపారు.
అలాగే, స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు 9 శాతం పెరుగుతాయని పరిశోధకులు వెల్లడించారు. రక్తపోటుకన్నా కూడా చేతి గ్రిప్పు బట్టి మృత్యువు ఎంత తొందరగా కబళిస్తుందన్నది చెప్పవచ్చని ఈ అధ్యయనం తెలిపింది.