కరివేపాకు చెట్టులోని ఆకులు, బెరడు, వేరు, గింజలు, పువ్వులు.. అన్నీ కూడా ఔషధ గుణాలు కలిగినట్టివే. వగరుగా ఉన్నప్పటికీ సువాసనాభరితంగా ఉన్న కరివేపాకులో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. ఇది శరీరానికి మంచి బలాన్నిస్తుంది. ముఖ్యంగా రక్తహీనత వ్యాధితో బాధపడేవారు కరివేపాకును ఆహారంలో ఎక్కువగా తీసుకున్నట్లయితే చక్కని ఫలితం పొందవచ్చు.
కరివేపాకు పేగులకు, కడుపుకు బలాన్ని ఇవ్వటమేకాకుండా శరీరానికి మంచి రంగును, కాంతిని ఇస్తుంది. అజీర్ణాన్ని అరికట్టి ఆకలి పుట్టిస్తుంది. అదే విధంగా మలబద్ధకంతో బాధపడేవారికి, మొలల సమస్యతో సతమతం అయ్యేవారికి కూడా కరివేపాకు దివ్యౌషధమనే చెప్పవచ్చు.
జుట్టురాలే సమస్య ఉన్నవారికి కరివేపాకు అద్భుతంగా పనిచేస్తుంది. కొబ్బరినూనెలో కరివేపాకు వేసి మరిగించాలి. మరిగించిన ఈ నూనెను ప్రతిరోజు తలకు పూసుకుంటే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.