Publish Date: Sat, 12 Jul 2014 (19:12 IST)
Updated Date: Sat, 12 Jul 2014 (19:14 IST)
సాధారణంగా ఒక సీజన్ నుంచి మరో సీజన్‌లోకి ప్రవేశించే ముందు రకరకాల ఇన్‌ఫెక్షన్లు సులభంగా దాడిచేస్తాయి. చల్లగా ఉన్న వాతావరణం వైరస్‌ల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఈ సీజన్‌లో వైరల్ ఇన్‌ఫెక్షన్లు, జ్వరాల ఉద్ధృతి ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్‌లో ప్రతి పదిమందిలో ఒకరికి జలుబు, జ్వరంతో కూడిన వైరల్ ఇన్‌ఫెక్షన్లు కనిపిస్తుంటాయి. ఎక్కువమందిని బాధించే వైరల్ ఇన్‌ఫెక్షన్లలో ఫ్లూ జ్వరం కూడా ఒకటి.
ఫ్లూ లక్షణాలేంటి
ఫ్లూ వ్యాధి వంటి వైరల్ జ్వరాలకు గురైనవారిలో ఒంటినొప్పులు, జ్వరం, నీరసం, నిస్సత్తువ, ఆహారం తీసుకోలేకపోవడం, గొంతునొప్పి, ముక్కు కారడం, దగ్గు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారిలో వ్యాధినిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటివారిలో జలుబు, జ్వరాలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. చాలావరకు వైరల్ జ్వరాలు వాటికవే 5 నుంచి 7 రోజుల్లో తగ్గిపోతాయి. లక్షణాల తీవ్రత తగ్గడానికి, వ్యాధి నుంచి ఉపశమనం కలగడానికి మాత్రమే మందులు ఉపకరిస్తాయి. ఫ్లూ జ్వరానికి వ్యాక్సిన్ కూడా అందుబాటులో ఉంది. ప్రతి సంవత్సరం ఒక ఇంజెక్షన్ వేయించుకుంటే ఇక ఏ ఇబ్బందీ ఉండదు.
చిన్నారుల్లోనే ఎక్కువ
చల్లని వాతావరణంలో రక్తనాళాలు కుంచించుకుపోతాయి. దీనివల్ల రక్తసరఫరా నెమ్మదిస్తుంది. రక్తంలో తెల్లరక్తకణాల సంఖ్య పడిపోతుంది. శరీర వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. పిల్లలకు స్కూళ్లు కూడా ఈ సీజన్‌లోనే ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ ఇన్‌ఫెక్షన్లు, జ్వరాలు పిల్లల్లో చాలా త్వరగా వ్యాప్తి చెందుతాయి. ఎక్కువమంది గుమిగూడి ఉండే చోట్లలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే చిన్నారుల్లో వైరల్ జ్వరాలు ఎక్కువ. అదేవిధంగా పుణ్యక్షేత్రాల వంటి ఎక్కువ రద్దీ ఉన్న ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వారు కూడా ఫ్లూ జ్వరం బారిన పడే అవకాశం ఉంది.
వైరల్ జ్వరాల అడ్డుకట్టకు మార్గమేంటి?
శరీరాన్ని దృఢతరం చేయడమే గాక వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచే వ్యాయామం వైరల్ జ్వరాల అవకాశాన్ని తగ్గిస్తుంది. పండ్లు, కోడిగుడ్లు తీసుకోవడం వల్ల వైరస్‌లతో పోరాడే ఇమ్యునోగ్లోబ్యులిన్లు (యాంటిబాడీలు) ఎక్కువగా తయారవుతాయి. కాబట్టి వైరస్‌లను ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఉండాల్సి వచ్చినప్పుడు ముక్కుకి మాస్క్ తగిలించుకుంటే కొంతవరకు వైరల్ ఇన్‌ఫెక్షన్‌ను నివారించవచ్చు. వీటివల్ల కాలుష్యంతో వచ్చే సమస్యలను కూడా నివారించవచ్చు. పుష్టికరమైన ఆహారం తీసుకోవాలి. రోజుకి 5 నుంచి 6 లీటర్ల నీరు తాగాలి.