Publish Date: Thu, 31 Jul 2008 (13:06 IST)
Updated Date: Thu, 31 Jul 2008 (13:06 IST)
పిల్లలూ...! సూర్యకాంతి పువ్వు అంటే ఏంటి అనుకుంటున్నారా...? పసుపుపచ్చని రంగుతో, గుండ్రంగా పెద్ద పెద్ద రేకులతో సూర్యుడు ఎటువైపు తిరిగితే అటువైపు తిరిగే ప్రొద్దుతిరుగుడు పువ్వునే సూర్యకాంతి పువ్వు అంటారు. దీనినే ఇంగ్లీషులో సన్ ఫ్లవర్ అని అంటారు. దీని నూనెను కూడా ఇంట్లో అమ్మావాళ్ళు వంటల్లో వాడుతారు కదా...! దీని గురించి కాస్తంత వివరంగా తెలుసుకుందాం...!
1510లో స్పానిష్ పరిశోధకులు మొట్టమొదట న్యూ మెక్సికోలో ఈ మొక్కను చూచి ఆశ్చర్యపడి కొన్ని విత్తనాలను స్పెయిన్‌కు తీసుకువెళ్లారని చరిత్ర చెబుతుంది. అక్కడినుంచి ఈ విత్తనం మిగిలిన యూరప్, రష్యా, చైనా, ఇండియా, ఆస్ట్రేలియా, దక్షిణ ఆఫ్రికాలకు ప్రాకిపోయింది. ప్రస్తుతం ప్రొద్దుతిరుగుడు పంటను రష్యా దేశం అధికంగా పండిస్తోంది. ఫ్రాన్స్ దేశపు రాజు 14వ లూయీ ఈ పువ్వువు చిహ్నంగా పెట్టుకున్నందుకు అతడిని అందరూ సన్ కింగ్ అనేవారు కూడా.
ఈ సూర్యకాంతి పువ్వు బంతిపూల జాతికి చెందినది. వీటి పువ్వుల నుండి వచ్చే గింజలు సోయాబీన్స్, వేరుశెనగ, ఆముదపు గింజల్లాగా నూనెను ఇచ్చే గింజ. ఈ పువ్వులలో మంచి ప్రోటీన్లతోపాటు, నూనె, కాల్షియం లభిస్తాయి. అలాగే వీటి విత్తనాలను పగలగొట్టి నూనె తీయగా మిగిలిన పిప్పిని కొలిమిలోనూ, బాయిలర్లలోనూ ఇంధనంగా వాడతారు.
ఇక ప్రొద్దుతిరుగుడు పిండిలో ప్రోటీన్లు అధికంగా ఉండడం వలన పశువులకు బలమైన ఆహారంగా వినియోగిస్తారు. ఒలిచిన ప్రొద్దుతిరుగుడు పప్పు పెంపుడు పక్షులకు ఆహారంగా కూడా ఉపయోగిస్తారు. అంతేగాకుండా దీనిని ఔషధాల తయారీకీ, రంగులు వేయడానికీ ఉపయోగిస్తారు.