Publish Date: Wed, 13 Aug 2008 (13:35 IST)
Updated Date: Wed, 13 Aug 2008 (13:34 IST)
పిల్లలూ...! ఏఫ్రిల్ ఒకటో తేదీ అనగానే మనందరికి గుర్తొచ్చేది ఫూల్స్ డే. ఆరోజు పిల్లలు పెద్దలూ, స్నేహితులు అందరూ ఒకర్నొకరు ఆటపట్టిస్తూ, సరదాగా జోక్స్ వేసుకుంటాం కదా..! అయితే ఈ ఫూల్స్ డేకి కూడా ఒక కథ ఉంది తెలుసా..! అసలు ఈ ఫూల్స్ డే ఎలా ఏర్పడింది. అది ప్రపంచమంతటా ఎలా పాకిపోయింది అన్న విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.!
ఫ్రాన్స్ దేశాన్ని తొమ్మిదవ ఛార్లెస్ రాజు పరిపాలిస్తున్న కాలంలో... ఏఫ్రిల్ ఒకటవ తేదీన కొత్త సంవత్సర వేడుకలను జరుపుకునేవారు. అయితే ఒకరోజున రాజు కేలేండర్‌ను మార్చివేసి, ఇకపైన అందరూ జనవరి ఒకటవ తేదీన మాత్రమే నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవాలంటూ ప్రజలకు ఆదేశించాడు.
అయితే అప్పట్లో ఇప్పుడున్నంతగా సమాచార వ్యవస్థ అభివృద్ధి చెందని కారణంగా... ఆ వార్త చాలామంది ప్రజలకు తెలియలేదు. దీంతో వారు ఎప్పట్లాగే ఏఫ్రిల్ 1న వేడుకలను జరుపుకుంటుండేవాళ్ళు. అయితే రాజధాని దగ్గర ప్రాంతాల వాళ్ళు మాత్రం జనవరి 1న వేడుకలు జరుపుకునేవారు. అంతేగాకుండా వీరు ఏఫ్రిల్ 1న కొత్త సంవత్సర వేడుకలను జరుపుకునే మిగిలిన వాళ్ళను చూసి,తెలివితక్కువ వారికింద జమకట్టి... "ఏఫ్రిల్ ఫూల్స్", "ఏఫ్రిల్ ఫిష్" అంటూ గేలి చేసేవాళ్ళు.
ఇలా ఆటపట్టించే ఈ పద్ధతే "ఏఫ్రిల్ ఫూల్స్ డే"గా పరిణామం చెంది, ఆ తరువాత రెండొందల ఏళ్ళ కాలంలో అమెరికా, బ్రిటన్, స్కాట్లండ్ తదితర దేశాలకు పాకిపోయింది. అలా, అలా మెల్లిగా ప్రపంచ మొత్తం మీదా పాకిపోయింది.
ఈ "ఏఫ్రిల్ ఫూల్స్ డే" రోజున ఒకరిపై మరొకరు ఎన్నో రకాల జోక్స్ వేసుకోవడం ఆనవాయితీ అవడమే గాకుండా, అది రాను రాను ప్రాక్టికల్ జోక్స్ చేసుకునే స్థాయికి చేరుకుంది. ఎంతో సంతోషంగా, సరదాగా సన్నిహితులను ఆటపట్టించే "ఏఫ్రిల్ ఫూల్స్ డే" మన భారతీయ లోగిళ్లలోకి కూడా చేరువైంది.