Publish Date: Wed, 19 Mar 2008 (12:52 IST)
Updated Date: Wed, 19 Mar 2008 (12:52 IST)
నోబెల్ ప్రైజ్... ఈ పేరు మనందరికీ పరిచితమైనదే. అయితే దీనిని ఎవరు కనిపెట్టారు? ఎందుకు ప్రదానం చేస్తారు? దీని వెనుక గల చరిత్ర గురించి మనకు అంతగా తెలియదు. ఈ ప్రైజ్‌ను రసాయన, భౌతిక, వైద్య శాస్త్రాలు, సాహిత్యము, ప్రపంచ శాంతి వంటి రంగాలలో అవిరళ కృషి చేసిన వారికి, అత్యున్నత సేవలు అందించిన వారికి ఈ ప్రైజ్‌ను ఇవ్వడం రివాజు.
ఈ గౌరవ పురస్కార గ్రహీతలకు జ్ఞాపిక, ప్రశంసా పత్రం, బహుమతి సొమ్మును అందజేస్తారు. ఈ ప్రైజ్ ఆల్‌ఫ్రెడ్ బెర్నాడ్ నోబెల్ పేరుతో ప్రదానం చేయడం జరుగుతోంది. స్వీడెన్‌లో 1833లో జన్మించిన ఆల్‌ఫ్రెడ్ రష్యాలో విద్యాభ్యాసం చేశాడు. సుదీర్ఘ ప్రయోగాల అనంతరం 1866 సంవత్సరంలో ఆయన డైనమైట్‌ను కనుగొన్నాడు. ఇవే కాకుండా డైనమైట్ కంటే మరింత శక్తివంతమైన జెలటిన్‌ను కూడా కనుగొన్నాడు.
1896వ సంవత్సరంలో ఇటలీలోని రోమ్‌లో నోబెల్ మరణించే సమయంలో ఐదు రంగాలలో విశేష కృషి చేసిన వారికి వార్షిక అవార్డులు ఇచ్చేందుకు నిధులు కేటాయించాడు. ఆయన సంస్మరణార్థం దీనికి నోబెల్ ఫౌండేషన్ అని నామకరణం చేశారు. తొలి సారిగా 1901లో రసాయనిక శాస్త్రంలో విభాగంలో విశేష కృషి చేసినందుకు జెకోబస్ హెచ్. వాన్ట్ హాఫ్‌కు నోబెల్ ప్రైజ్ దక్కింది.
అలాగే సాహిత్య రంగానికి సంబంధించి సుల్లీ ప్రుధోమ్ తొలి అవార్డును దక్కించుకున్నారు. 1969లో ఎకనామిక్స్ రంగానికి విశిష్ట సేవలు అందించినందుకు రాగ్నర్ ఫ్రిస్చ్, జాన్ టిన్‌బెర్గన్‌లకు నోబెల్ అవార్డులు దక్కాయి.