Publish Date: Fri, 25 Jul 2008 (13:26 IST)
Updated Date: Fri, 25 Jul 2008 (13:26 IST)
"
చిట్టి చిలకమ్మా... అమ్మ కొట్టిందా... తోటకెళ్ళావా... పండు తెచ్చావా..!" పాట చిన్నారులందరికీ తెలిసే ఉంటుంది. మరి ఆ పాటలో చెబుతున్న చిట్టి చిలకమ్మల వయసెంతో, వీటిలో ఎన్ని జాతులున్నాయి లాంటి విషయాలను తెలుసుకుందామా..?! |
| ఇవి మనుషుల్లాగే మాట్లాడగలవు, పాటలు పాడగలవు. అంతే కాదు ఇవి చాలా గడుగ్గాయిలండోయ్...! ఆరు సంవత్సరాల పిల్లలకు ఉండే తెలివితేటలన్నీ వీటికున్నాయని శాస్త్రజ్ఞులు కనిపెట్టారు కూడా...! |
|
|
దాదాపు 5 కోట్ల 40 లక్షల సంవత్సరాల క్రితం నుండే ఈ భూమిమీద చిలుకలు జీవిస్తున్నాయి. దీనికి ఆధారంగా వీటి జాతికే ముత్తాత ముత్తాత అనబడే ఓ చిలుక అస్థిపంజరం ఒక శిలాజం రూపంలో శాస్త్రవేత్తలకు లభించింది. సాధారణంగా చిలుకల ఎముకలు చాలా తేలికగా, సున్నితంగా ఉంటాయి. భూమిలో జరిగే మార్పులకి శిలాజంలాగా మారేలోగానే అవి నశించిపోతాయి.
అయితే.. తాజాగా డెన్మార్క్‌లో లభించిన చిలుక శిలాజాన్ని పరిశీలించిన శాస్త్రజ్ఞులు దాని వయసును కూడా కనిపెట్టారు. అది 54 మిలియన్ సంవత్సరాల క్రితం నాటిదని, ఇంత పురాతనమైన చిలుక శిలాజం దొరకడం ఇదే మొదటిసారని వారు వెల్లడించారు.
ఇకపోతే చిలుక జాతుల విషయానికి వస్తే... వీటిలో 350 రకాల జాతులున్నాయి. వీటి తెలివితేటల గురించి చెప్పనక్కరలేదు. ఎందుకంటే ఇవి మనుషుల్లాగే మాట్లాడగలవు, పాటలు పాడగలవు. వీటిలోని "ఆఫ్రికన్ గ్రే ప్యారట్" జాతికి చెందిన చిలుకలైతే సరేసరి. ఇవి చాలా గడుగ్గాయిలు కాగా... ఆరు సంవత్సరాల పిల్లలకు ఉండే తెలివితేటలన్నీ వీటికున్నాయని శాస్త్రజ్ఞులు కనిపెట్టారు కూడా.