ఇటీవలికాలంలో డిజిటల్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇతరుల వివరాలతో కొందరు రుణాలు తీసుకుంటున్న సంఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. అలా మీ పాన్ (PAN card)ను ఎవరైనా దుర్వినియోగం చేసి రుణాలు తీసుకున్నారో లేదో ఓ సారి తనిఖీ చేసుకోండి. ఒకవేళ ఎవరైనా రుణం తీసుకున్నట్లయితే మీ క్రెడిట్ స్కోర్, రుణ సామర్థ్యంపై ప్రభావం పడుతుంది. అందువల్ల మీ పేరుపై అలాంటి రుణాలు ఏవైనా ఉన్నాయా? లేదా? అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇంతకీ దీన్ని చెక్ చేసుకోవడం ఎలాగంటే..?
మీ పాన్ వివరాలతో రుణాలు ఉన్నాయో, లేదో తెలుసుకోవడానికి ముందుగా క్రెడిట్ రిపోర్ట్‌ను పరిశీలించాలి. సిబిల్ (CIBIL), ఈక్విఫాక్స్ (Equifax), ఎక్స్పీరియన్ (Experian) వంటి క్రెడిట్ బ్యూరోలు మీ పాన్ ఆధారంగా క్రెడిట్ రిపోర్టును జారీ చేస్తాయి. ఇందులో మీరు తీసుకున్న లోన్లు, క్రెడిట్ కార్డు లావాదేవీల సమాచారం ఉంటుంది.
మీ పేరు మీద లోన్ లేకపోయినా మీ పాన్ నంబర్ దుర్వినియోగానికి గురై ఉండే అవకాశం ఉంటుంది. క్రెడిట్ రిపోర్టులో 'హార్డ్ ఎంక్వైరీ'లు ఉన్నాయోమో చూడండి. అనుమానాస్పద సంస్థల నుంచి వచ్చిన ఎంక్వైరీలు కనిపిస్తే వెంటనే ఆ బ్యూరోకు ఫిర్యాదు చేయాలి. హార్డ్ ఎంక్వైరీలు కూడా మీ క్రెడిట్ స్కోరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.
అలాగే, మీ పేరు మీద ఏవైనా రుణాలున్నట్లు కనబడితే వెంటనే బ్యాంకును సంప్రదించండి. బ్యాంక్ మేనేజరు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయండి. తీసుకున్న లోన్ మీకు సంబంధించినది కాదని వివరంగా రాసిచ్చి Acknowledgment తీసుకోండి.
అదేవిధంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేయండి. మోసం జరిగిందని అధికారికంగా రికార్డ్ చేయించడానికి, తదుపరి చర్యలకు ఇది ఉపయోగపడుతుంది. రిజర్వ్ బ్యాంక్ అంబుడ్స్‌మెన్‌కు కూడా ఇ-మెయిల్ చేయండి.