ముస్లీం జనాభా అధికంగా ఉండే టర్కీని ఐరోపా జబ్బు మనిషి (సిక్ మ్యాన్ ఆఫ్ యూరప్)గా పిలుస్తారు. కాని ప్రస్తుతం ఐరోపా దేశాలన్ని క్రమంగా డబ్బు (రుణ సంక్షోభం) జబ్బులోకి జారుకుంటున్నాయి. పురాతన చరిత్ర గల గ్రీస్ దివాళా దశకు చేరడానికి కారణమైన రుణ సంక్షోభం క్రమంగా జీప్సీ (గ్రీస్, ఐర్లాండ్, స్పెయిన్, ఇటలీ, పోర్చుగల్‌లను జీప్సీ దేశాలుగా పిలుస్తారు) దేశాలకు పాకింది.
గ్రీస్‌కు యూరప్ దేశాధినేతలు ఇప్పటికే రెండు బెయిల్ అవుట్ ప్యాకేజీలను ప్రకటించారు. ఈ రుణ భారాన్ని తీర్చడానికి గ్రీస్ విమానాశ్రయాలు, రైల్వేలు, నౌకాశ్రయాలు వంటి జాతీయ సంపదను వేలంలో వుంచింది. 1901లో తొలిసారి జరిగిన ఒలింపిక్స్‌కి ఆతిథ్యం కల్పించిన గ్రీస్ త్వరలో దివాళా తీసిన తొలి ఐరోపా దేశంగా అపఖ్యాతిని మూటగట్టుకోనుంది.
గ్రీస్ తర్వాత రుణ సంక్షోభ ప్రభావం అధికంగా గల దేశం ఇటలీ. రోమ్ (ఇటలీ రాజధాని) తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్నాడని నానుడి. ప్రస్తుత ఇటలీ ప్రధానమంత్రి సిల్వియో బెర్లుస్కోనీ (అభినవ నీరో) పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది. ఇటలీ సంక్షోభంలో కూరుకుపోతుంటే బెర్లుస్కోనీ తన సరస సయ్యాటల్లో మునిగితేలుతున్నాడు. ప్రపంచ స్వర్గధామం, నల్ల కుబేరుల ఇష్ట సఖి స్విట్జర్లాండ్‌కు కూడా ఈ సెగ తాకింది. స్విస్ ప్రధాన బ్యాంకులన్ని ఇప్పుడు నష్టాల్లో కూరుకుపోయాయి.
ప్రపంచ అగ్రదేశం అమెరికాకు ఈ అగ్నికీలలు తాకాయి. దీనికి ప్రధాన కారణం అమెరికా ప్రధాన బ్యాంకులన్ని ఐరోపా దేశాల్లో పెట్టుబడులు పెట్టడమే. ఆఫ్ఘన్ నుంచి అమెరికా తన బలగాలను ఉపసంహరించుకోవడానికి పేరుకు అమెరికా ప్రజల వ్యతిరేకతను సాకుగా చూపుతున్నప్పటికీ యూరప్ రుణ సంక్షోభంతో ఈ అగ్రరాజ్య ఆర్థిక స్థితి దిగజారడమే బయటకి వెల్లడించని రహస్యం. సంస్కరణలే ఆయుధాలుగా ప్రపంచీకరణ పేరుతో ప్రపంచ మార్కెట్‌పై తమ ప్రాభవాన్ని చూపాలనే దురాలోచన వారి మెడలకే చుట్టుకుంది.
ఐరోపా ఈ దుస్థితికి చేరడానికి కారణాలు:
1. ఇంగ్లాండ్ వంటి కొన్ని దేశాలు మినహా ఐరోపా దేశాలన్ని ఉమ్మడి కరెన్సీ అయిన యూరోను అమలు చేస్తున్నాయి. దీంతో ఒక దేశంలో ఏర్పడ్డ సంక్షోభం క్రమంగా మిగతా దేశాలకు పాకింది.
2. పారిశ్రామిక విప్లవం తర్వాత అనేక దేశాలను తమ వలస దేశాలుగా మార్చుకున్న ఐరోపా దేశాలు తమ ఉత్పత్తులను ఆయా దేశాల్లో అమ్ముకొనేవి. కానీ ప్రపంచీకరణ కారణంగా కొత్తగా సాంకేతికత పెంచుకోని ఐరోపా దేశాలు వర్ధమాన దేశాలతో పోటీపడలేక ఆర్థిక పరిస్థితి దిగజారడం.
3. సంస్కరణల పేరుతో సంక్షేమ నిధుల్లో భారీగా కోత పెట్టడం.
మరి మన పరిస్థితి ఏంటీ?
అవతారాల్లోనే కాదు ఆలోచనలు కూడా ఒకేలా వుండే ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియా ద్వయం సంస్కరణల పేరుతో మన దేశంలో కూడా సంక్షేమ నిధులకు భారీగా కోత పెడుతున్నారు.
ఉన్నత విద్య, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో అనేక సేవలను ఇప్పటికే ప్రైవేట్ పరం చేసిన ప్రభుత్వం విద్యుత్ పంపిణీ, ప్రాధమిక విద్యలపై ప్రైవేట్ పరం చేసి పేద ప్రజలను కష్టాల కొలిమిలో పడేసే ప్రణాళికలు రచిస్తున్నారు. తాజాగా గ్యాస్ సిలెండర్లపై ఇస్తున్న రాయితీ ఎత్తివేయడానికి కూడా వ్యూహం పన్నారు.
సంక్షేమానికి అందించే నిధుల్లో కోత విధించిన మూల్యం చెల్లించుకున్న ఐరోపా దేశాల రుణ సంక్షోభం నుంచి మన పాలకులు పాఠం నేరుస్తారో లేదో వేచి చూడాల్సిందే. సింగ్‌జీ జర సోచో జీ.....!!