Article Festivals %e0%b0%a6%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b6%e0%b0%a8%e0%b1%80%e0%b0%af %e0%b0%86%e0%b0%b2%e0%b0%af%e0%b0%82 107052400052_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దర్శనీయ ఆలయం

Advertiesment
భద్రాద్రి క్షేత్రంలో ప్రధానమైన శ్రీరామాలయం పశ్చిమాభిముఖంగా శిఖరానికి
భద్రాద్రి క్షేత్రంలో ప్రధానమైన శ్రీరామాలయం పశ్చిమాభిముఖంగా వుంటుంది. శిఖరానికి ఉపయోగించిన సుదర్శన చక్రం భక్త రామదాసుకు గోదావరి నదిలో లభించిందని చెపుతారు. విమానం బయట 48 రూపాలలో విష్ణు, గరుడు, సోమ, స్కంధ దక్షిణామూర్తులు దర్శనం ఇస్తారు. ఆలయంలో చతుర్భుజుడై వెలసిన శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై వుంటాడు. రెండు చేతులలో ధనుర్బాణాలు, మరో రెండు చేతులలో శంఖ చక్రాలు కలిగి వున్న చతుర్భుజరాముడు ఈ ఒక్క క్షేత్రంలోనే వుండటం విశేషం.

ఆలయానికి పశ్చిమాన ధ్వజస్తంభం, ఆంజనేయస్వామి దీపస్తంభం, సుబ్రహ్మణ్యస్వామి ఆలయం, కులశేఖర ఆళ్వారు, లక్ష్మీనరసింహస్వామి ఆలయం వున్నాయి. ఆలయానికి తూర్పు దిక్కున రథశాల, జమ్మ మండపం, సంతాన గోపాలస్వామి మండపం, నారాయణ స్వామి ఆలయం వున్నాయి. అధ్యయన మండపం, అద్దాల మహాలు, ద్వాదశ మండపం, శాసనస్తంభాలు, రంగనాయకస్వామి మండపం వున్నాయి.

భద్రాచలంలో సమీప ప్రాంతాల్లో దర్శనీయమైన ఎన్నో పుణ్యస్థలాలు వున్నాయి. వాటిలో పంచవటి, పర్ణశాల, రథపుగుట్ట, లక్ష్మణ గుట్ట, జటాయు గుట్ట, దుము్మగూడెం, ఉష్ణగుండం, శబరి వాగు, సీతమ్మ వాగు ప్రధానమైనవి. భద్రాచలానికి 35 కిలోమీటర్ల దూరంలోని పర్ణశాల చూసి తీరవలసిన క్షేత్రం. ఈ పర్ణశాలలోనే వనవాస కాలంలో సీతారామలక్ష్మణులు నివసించినట్లు వాల్మీకి రామాయణం ఆధారంగా తెలుస్తున్నది. ఇక్కడ ఆలయంలో సీతారమలక్ష్మణుల విగ్రహాలు నార వసా్తల్రు ధరించి వుండటం విశేషం. సీతమ్మ స్నానమాచరించిన గోదావరి పాయను నేటికీ సీతమ్మ వాగుగా వ్యవహరిస్తున్నారు.

భద్రాచలానికి మూడు మైళ్ళ దూరంలో గోదావరి నదీ గర్భంలో ఉష్ణగుండం ఒకటి వుంది. అన్న ఋతువులలోనూ ఈ ఉష్ణగుండ జలాలు వేడిగా వుండటం విశేషం. నదీ గర్భంలోకి ఉష్ణజలాలు ఎలా వస్తున్నాయో ఎవరూ చెప్పలేకున్నారు. భక్తులు ఈ ఉష్ణగుండ జలాలను చెంబులతో తీసుకుని నదీజలాలలో కలిసి స్నానాలు చేస్తారు. పూర్వం ఆదిశేషుడు ఇక్కడ విష్ణు ప్రీతికోసం దీర్ఘకాలం హోమాలు చేసి గోదావరీ జలాలతో తర్పణాలు ఇచ్చినట్లు బ్రహ్మాండ పురాణం చెపుతున్నది. అందువల్లనే ఉష్ణగుండ జలాలు వేడిగా వుంటాయని, ఈ నీటితో స్నానం పుణ్యప్రదం, ఆరోగ్యకరం అని భక్తులు భావిస్తారు. భద్రాచల ఆలయంలో శ్రీపాంచరత్న ఆగమం ప్రకారం అర్చన విధులు జరుగుతాయి.

ఖమ్మం జిల్లాలో పాపికొండలకు ఆవల గోదావరీ నదీ తీరంలో వున్న భద్రాచల క్షేత్రానికి రాష్ట్రం నలుమూలల నుండి బస్సు సౌకర్యం వుంది. కొత్తగూడెం వరకూ రైలులో వచ్చి, అక్కడి నుండి బస్సులలో భద్రాచలానికి చేరుకోవచ్చు. రాజమండ్రి నుంచి గోదావరి నదిపై లాంచీలలో ప్రయాణించి ఇక్కడికి చేరుకోవచ్చు. విజయవాడ, హైదరాబాద్‌ల నుండి విమాన సౌకర్యం వుంది. బస చేయడానికి మంచి హోటళ్లు, సత్రాలు, కళ్యాణ మంటపాలు వున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu