Publish Date: Fri, 19 Oct 2007 (17:04 IST)
Updated Date: Fri, 19 Oct 2007 (17:02 IST)
నవరాత్రులలో ఎనిమిదవ రోజున అమ్మవారు శ్రీ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. `దుఃఖేన గంతుం శక్యతే ఇతిదుర్గా` అని అన్నారు. అంటే, దుర్గతులను దూరం చేసేది దుర్గాదేవి. అటువంటి శక్తి స్వరూపిణి దుర్గాదేవి అష్టమి తిథిరోజున రురుకుమారుడైన దుర్గముడైన రాక్షసుడిని సంహరించింది.
దుర్గాదేవి ఆది ప్రకృతి. పంచమహా స్వరూపాల్లో మొదటిది. ఈ తల్లి శక్తి అనంతం. అందుకే వివిధ రకాల దుర్గాదేవి స్వరూపాలు మనకు గోచరిస్తాయి. ఈ రూపాలలో ఏ రూపాన్ని ధ్యానించినా, ఆ తల్లి మనలను అనుగ్రహిస్తుంది. మనలను సమస్త దుర్గతుల నుండి రక్షించే దుర్గాదేవి మంత్రాన్ని నిత్యం వినయపూర్వకంగా జపిస్తే, సమస్త గ్రహ బాధలు, దుష్టగ్రహ బాధలన్నీ తొలగుతాయి.
ఈ శరన్నవ రాత్రుల్లో చేతిలో త్రిశూలాన్ని ధరించిన శక్తి స్వరూపిణిగా, శ్రీ దుర్గాదేవిని ఈ క్రింది శ్లోకంతో ధ్యానించాలి.
దుర్గేస్మృతాహరసిభీతి మశేషజంతోః
స్వస్థైః స్మృతామతిమతీవ శుభాందదాసి
దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్యా
సర్వోపకార కరణాయ యధార్థ చిత్త
ఓం శ్రీ దుర్గాదేవతాయైనమః