Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

Varalakshmi Vratham Puja: వరలక్ష్మీ వ్రతం పూజా విధానం

Varalakshmi Vratham Puja: వరలక్ష్మీ వ్రతం పూజా విధానం
, గురువారం, 30 జులై 2020 (22:44 IST)
మహిమాన్వితమైన శ్రీ వరలక్ష్మీ వ్రత పుణ్యదినాన సూర్యోదయానికి ముందే లేచి (ఐదుగంటలకు), అభ్యంగన స్నానమాచరించి, నూతన వస్త్ర ధారణ చేయాలి. తదనంతరం పూజామందిరమును, ఇంటిని శుభ్రం చేసుకుని, గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరాన్ని పద్మం ముగ్గులతో రంగవల్లికలను తీర్చిదిద్దాలి. దానిపై పసుపు రాసి ముగ్గులు బొట్లు పెట్టుకున్న పీటను ఉంచి ఆ పీటపై నూతన వస్త్రము పరచి, బియ్యము పోసి, దానిపై అలంకరించిన కలశచెంబును ఉంచాలి. 
 
ఒక కొబ్బరికాయను తీసుకుని దానికి "శ్రీ వరలక్ష్మీ" రూపు ప్రతిబింబించేటట్లు పసుపు ముద్దతో కనులు, ముక్కు, చెవులు మున్నగునవి తీర్చిదిద్దుకోవాలి. కుంకుమ, కనులకు కాటుకలను అమర్చి ఆ రూపును కలశపై ఉంచుకోవాలి. ఆ తర్వాత ఆకుపచ్చని చీరతో కూర్చున్న లక్ష్మీదేవి ఫోటోను గానీ, ప్రతిమ(వీలైతే వెండి)ను గానీ పసుపు కుంకుమలతో అలంకరించుకుని పూజకు సిద్ధం సుకోవాలి.
 
పూజకు ఎర్రటి అక్షింతలు, పద్మములు, ఎర్రటి కలువ పువ్వులు, గులాబి పువ్వులు, నైవేద్యమునకు బొంబాయి రవ్వతో కేసరి బాత్, రవ్వలడ్డులు, జామకాయలు వంటివి సిద్ధం చేసుకోవాలి. పూజగదిలో రెండు వెండి దీపాలలో ఆరేసి ఆరేసి మొత్తం 12 తామర వత్తులతో నేతితో దీపమెలిగించాలి. 
 
సాయంత్రం ఆరుగంటల నుంచి పూజను ప్రారంభించాలి. నుదుట కుంకుమ బొట్టు పెట్టుకుని, మెడలో తామర మాల ధరించి పూజను ఆరంభించాలి. శ్రీ లక్ష్మి సహస్రనామము, వరలక్ష్మీ వ్రత కథ పారాయణ చేసి, "ఓం మహాలక్ష్మీదేవ్యై నమః" అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. వీలైతే లక్ష్మీ అష్టోత్తరము, మహాలక్ష్మి అష్టకములను పఠించి, తదనంతరం నైవేద్యములను సమర్పించుకుని దేవదేవికి దీపారాధన చేయాలి.
 
పూజ పూర్తయిన తర్వాత ఇరుగు పొరుగు ముత్తైదువులను పిలుచుకుని దక్షిణ తాంబూలాలు ఇచ్చుకోవాలి. స్త్రీలకు తాంబూలముతో పాటు వరలక్ష్మీ వ్రత పుస్తకాలను కూడా అందజేయాలి. వరలక్ష్మీ వ్రత పర్వదినమున అష్టలక్ష్మీ దేవాలయములతో పాటు లక్ష్మీదేవీ ఆలయాలను దర్శించుకుంటే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం. ఇంకా దేవాలయాల్లో శ్రీ లక్ష్మీ కుంకుమ పూజ, శ్రీ లక్ష్మీ అష్టోత్తరనామ పూజలు, పంచామృతములతో అభిషేకం చేయించడం సకల భోగభాగ్యాలను ప్రసాదిస్తుంది. 
 
శ్రీ వరలక్ష్మీ వ్రత దినాన నిష్టతో లక్ష్మిదేవిని పూజించే వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆ రోజున స్త్రీలు వరలక్ష్మి భక్తిశ్రద్ధలతో ప్రార్థిస్తే దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుందని విశ్వాసం. అందుచేత శుక్రవారం వచ్చిన శ్రీ వరలక్ష్మీ వ్రత పుణ్యదినాన
 
"లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం శ్రీ రంగథామేశ్వరీం
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవః  బ్రహ్మేంద్ర గంగాధం 
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందేముకుందప్రియామ్" 
 
అంటూ శ్రీ వరలక్ష్మీ వ్రతం నాడు శ్రీ మహాలక్ష్మిని ధ్యానించిన ఆ దేవి కటాక్షానికి పాత్రులవుదాం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమలలో ఘనంగా పవిత్రతోత్సవాలు ప్రారంభం