ఈశ్వరుని ప్రార్థనలో ముఖ్యమైన రోజు మహాశివరాత్రని చెప్పొచ్చు. ఈ రోజున పద్నాలుగు బిల్వమూలంలో ఉంటాయి. కాబట్టి శివరాత్రి రోజున ఉపవాసం చేసి ఒక్క బిల్ల పత్రాన్నైనా పరమేశ్వరునికి అర్పించి తరించమని శాస్త్రాలు చెబుతున్నాయి. అలానే శివరాత్రి రోజున శివాలయాల్లో జరిగే పూజలో పాల్గొంటే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని వేద పండింతులు పేర్కొంటున్నారు.
అంతేకాదు, ఈ రోజున ఆలయాల్లో నాలుగు యామాల ప్రత్యేక పూజ జరుగుతుంది. ప్రతి యామం పూజకు నిర్దిష్టమైన అభిషేకం చేస్తారు. అలానే నిర్ణీత నైవేద్యంతో పాటు పారాయణం కూడా చేస్తారు.
మొదటి యామం:
పూజలో అభిషేకం, అలంకరణ ఉంటాయి. గంధం, బిల్వపత్రాలు, తామరపువ్వులతో స్వామివారికి అర్చన చేస్తారు. అలానే నైవేద్యంగా పెసర పొంగలి సమర్పిస్తారు. ఈ పూజలో స్త్రీలు రుగ్వేదాన్ని పారాయణం చేస్తే సౌభాగ్యం కలుగుతుంది. అంటే ఈ యామ పూజలో పాల్గొనే వారికి సకల సౌభాగ్యాలు చేకూరుతాయని విశ్వాసం.
రెండవ యామం:
ఈ పూజలో మధుపర్కం అంటే చక్కెర, పాలు, పెరుగు, నెయ్యితో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఆ తరువాత గులాబీ నీరు, కర్పూరం గంధ లేపనంతో అలంకరించి బిల్పపత్రాలు, తులసితో అర్చన చేస్తారు. నైవేద్యంగా పాయసం సమర్పించి యజర్వేదాన్ని పారాయణం చేస్తారు. ఈ పూజలో ఈ పారాయణం చేయడం వలన సంతానం ప్రాప్తి కలుగుతుంది.
మూడవ యామం:
ఇందులో స్వామివారికి తేనెతో అభిషేకం చేసి, కర్పూరం గంధం లేపనంతో అలంకరణ చేస్తారు. బిల్వపత్రాలు, మల్లె పువ్వులతో అర్చన, అన్నం, నువ్వులు నైవేద్యంగా నివేదించి, సామవేదాన్ని పారాయణం చేస్తే అపార సంపద లభిస్తుందట.
నాలుగవ యామం:
చెరకు రసంతో అభిషేకం చేసి మల్లె, తామర పువ్వులు, కర్పూరం గంధ లేపనంతో అలకరించాలి. తామ, కలువ, మల్లె పువ్వులతో అర్చన చేసి వండిన అన్నం నైవేద్యంగా పెట్టాలి. అథర్వణ వేదాన్ని పారాయణం చేస్తే కుటుంబంలో సఖ్యత కలుగుతుందని వేద పండితులు చెబుతున్నారు.