Publish Date: Mon, 10 Mar 2008 (17:31 IST)
Updated Date: Mon, 10 Mar 2008 (17:30 IST)
కావలసిన పదార్థాలు :
చేపలు - 300 గ్రాములు (ముళ్లు లేనివి లేదా ముళ్లు తీసేసినవి), బంగాళదుంప - ఒకటి (ఉడికించినది), మైదా పిండి - 300 గ్రాములు, వాము - అర టీస్పూన్, పెద్ద ఉల్లిపాయ - ఒకటి (సన్నగా తరిగినది), అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీస్పూన్, కారం - అర టీస్పూన్, గరం మసాలా పొడి - ఒక టీస్పూన్, మిరియాల పొడి - పావు టీస్పూన్, ఉప్పు - తగినంత, నూనె - వెయించడానికి సరిపడ.
తయారు చేయు విధానం :
ముందుగా మైదాపిండిలో వాము, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలాగా కలిపి పెట్టుకోవాలి. తర్వాత ముళ్లు తీసిన చేపలను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. బాణాలిలో నూనె వేసి కాగాక అందులో సన్నగా తరిగిన ఉల్లిముక్కలను వేసి దోరగా వేయించాలి.
ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించి తరిగిన చేప ముక్కలు ఉప్పు వేసి గరం మసాలా పొడిని కూడా వేసి పది నిముషాల పాటు ఉడికించాలి. ఉడికిన తర్వాత పిసికి పెట్టుకున్న బంగాళదుంపను వేసి కాసేపు వేయించి దించి పక్కన పెట్టుకోవాలి.
ముందుగా పిసికి పెట్టుకున్న పిండిని చిన్న ఉండలుగా చేసి గుండ్రంగా ఒత్తి సగానికి కత్తితో కోయాలి. దీనిలో ఓ భాగాన్ని తీసుకుని అన్ని మూలల్లో నీళ్లతో తడిపి కోన్ ఆకారంలాగా చేయాలి. దీనిలో ఉడికించి పెట్టుకున్న చేపల మిశ్రమాన్ని పెట్టి మూయాలి. అన్నింటినీ ఈ విధంగానే చేసి కాగిన నూనెలో బంగారు రంగులోకి వేయించి దించాలి.