బంగారు నగలను ఎలా శుభ్రం చేయాలంటే?
రోజూ వేసుకునే బంగార నగలు కొన్ని కారణాల వలన రంగుమారి ఎబ్బెట్టుగా కనిపిస్తుంటాయి. వీటి మెరుపు తగ్గకుండా ఉండాలంటే శుభ్రం చేయడానికి, భద్రపరచడానికి తగిన జాగ్రత్తలు అవసరం. మరి అవేంటో తెలుసుకుందాం.
రోజూ వేసుకునే బంగార నగలు కొన్ని కారణాల వలన రంగుమారి ఎబ్బెట్టుగా కనిపిస్తుంటాయి. వీటి మెరుపు తగ్గకుండా ఉండాలంటే శుభ్రం చేయడానికి, భద్రపరచడానికి తగిన జాగ్రత్తలు అవసరం. మరి అవేంటో తెలుసుకుందాం.
గిన్నె నిండా వేణ్నీళ్లు నింపి అందులో కొన్ని చుక్కల లిక్విడ్ డిష్‌వాష్ జెల్ వేయాలి. ఈ నీళ్లలో నగలు వేసి 20 నిమిషాల పాటు అలానే ఉంచాలి. ఆ తరువాత బ్రష్‌తో రుద్ది కడిగి మెత్తని వస్త్రంతో తుడిచి టిష్యూ కాగితంలో చుట్టి ఉంచాలి. ఇలా చేయడం వలన తేమ తొలగిపోతుంది. రాళ్ల నగల్ని సాధ్యమైనంత వరకు వేణ్నీళ్లలో ఉంచకపోవడం మంచిది.
విలువైన రాళ్లు రత్నాలు, పొదిగి ఉన్న నగల్ని మామూలు నీళ్లలో అసలు తడపకూడదు. సాధ్యమైనంత వరకు తడి వస్త్రంతో తుడుచుకోవాలి. ఏ నీళ్లు పడితే ఆ నీళ్లతో నగల్ని తడపడం వలన విలువైన రాళ్లు రంగుమారే ప్రమాదం ఉంటుంది. ఈత కొట్టే అలవాటున్న వాళ్లు తప్పనిసరిగా చెవులకున్న పోగులను కూడా తీయాలి. ఈ నీళ్ల వలన రంగు మారుతాయి.
అలా జరిగితే బొగ్గు పొడితో శుభ్రం చేస్తే సరిపోతుంది. కుంకుడు కాయ రసంలో నానబెట్టినా ఫలితం ఉంటుంది. కప్పు నీళ్లలో వంటసోడా కలిపి అందులో నగలు వేసి వేడి చేయాలి. తరువాత పొడి వస్త్రంతో శుభ్రపరచి నీడలో గాలికి ఆరనిస్తే కొత్త వాటిలా మెరిసిపోతాయి. విలువైన రంగు రాళ్లను పిల్లలు ఉపయోగించే మెత్తని బ్రష్‌తో శుభ్రం చేయాలి. గరుకుగా ఉండేవాటిని ఉపయోగిస్తే వాటిమీద గీతలు పడే ప్రమాదం ఉంది.
బంగారు నగలను గాఢత కలిగిన సబ్బుల ద్రావణాల కంటే తడి టిష్యూలతో శుభ్రం చేసినా ఫలితం ఉంటుంది. క్లోరిన్, ఉప్పు నీళ్లతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆభరణాల్ని శుభ్రం చేయకూడదు. సువాసన పరిమళాలు, క్రీములు పెట్టిన చోట వీటిని పెట్టకూడదు. అలానే ధరించిన తరువాత కూడా వీటిని వాడకపోవడం మంచిది. వాటిలోని రసాయనాల ప్రభావం వలన నగలు రంగును కోల్పోయి పాత వాటిలా కనిపించే అవకాశం అధికంగా ఉంది.