''దీప'' అంటే దీపము. ఆవళి అంటే వరుస. దీప + ఆవళి అంటే.. దీపాల వరుస అని అర్థం. దీపం ఐశ్వర్యం అయితే అంధకారం దారిద్ర్యం. దరిద్రాన్ని పారద్రోలి, ఐశ్వర్య మార్గంలోకి ప్రయాణిచడమే దీపావళి పండుగ ముఖ్యోద్దేశ్యం. దీపం అనేది త్రిమూర్తి స్వరూపం. దీపంలో మూడు రంగుల కాంతులు ఉంటాయి. దీపంలోని ఎర్రని కాంతి బ్రహ్మదేవునికి, నీలి కాంతి శ్రీమహావిష్ణువుకి.., తెల్లని కాంతి పరమేశ్వరునికి ప్రతీకలు.
సాజ్యం త్రివర్తి సంయుక్తం - వహ్నినా యోజితం ప్రియం
గృహాణ మంగళం దీపం - త్రైలోక్య తిమిరాపహం
భక్త్యా దీపం ప్రయచ్ఛామి - దేవాయ పరమాత్మనే
త్రాహిమాన్నరకాద్ఘోరాత్ - దివ్య జ్యోతిర్నమోస్తుతే
ఏ దీపమైనా మూడువత్తులు వేసి వెలిగించాలిగానీ.. ఒంటి దీపం, రెండు వత్తుల దీపాలు వెలిగించరాదు. మూడు వత్తుల దీపం.. గృహానికి శుభాలు చేకూరుస్తుంది. ముల్లోకాలలోని అంధకారాన్ని పారద్రోలి లక్ష్మీనిలయంలా చేస్తుంది. నరకం నుంచి రక్షిస్తుంది. దీపం సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపం. అటువంటి దీపాన్ని భక్తిగా వెలిగించాలి. మరెంతో భక్తిగా నమస్కరించాలని పైశ్లోకం అర్థం.
అదేవిధంగా... దీపావళి రోజున ఏ ఇంటి ముందు దీపాలు వెలుగుతూ ఉంటాయో... ఆ ఇంట మహాలక్ష్మి కొలువు తీరుతుందని ప్రజల నమ్మకం.. ఈ కారణంగా... దీపావళి పండుగ సాయంత్రం దీపాలు పెడుతుంటారు. ఇంకా దీపావళి రోజున చనిపోయిన వారికి పెద్దల పండుగకి తర్పణాలు ఇస్తుంటారు. ఆ సమయంలో స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన పితృదేవతలకు... తిరిగి స్వర్గలోకాలకు వెళ్లే సమయంలో వెలుతురు చూపించడం కోసమే దీపాలు వెలిగించే ఆచారం వచ్చిందని ప్రతీతి.