Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మంత్రిమండలిలో ఉండేదెవరు? ఊడెదెవరు? ఎదురుచూస్తున్న రోజా-చెవిరెడ్డి

మంత్రిమండలిలో ఉండేదెవరు? ఊడెదెవరు? ఎదురుచూస్తున్న రోజా-చెవిరెడ్డి
, శుక్రవారం, 16 జులై 2021 (20:05 IST)
క్యాబినెట్ విస్తరణకు సమయం దగ్గర పడింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మంత్రి మండలి ఏర్పాటు చేసినప్పుడే రెండున్నర ఏళ్లకు అందరినీ మారుస్తానని చెప్పాడు. దాని ప్రకారం పాతవాళ్లు పోయిన కొత్త మంత్రులు రాబోతున్నారు. దీంతో అన్ని జిల్లాల్లో అప్పుడే సమీకరణలు మొదలయ్యాయి. ఆశావహులంతా ఎవరి ధీమాలో వారు ఉండగా తనకు మాత్రం మళ్లీ పదవి వస్తుందన్న ధీమాలో కొంతమంది పాత మంత్రులు ఉన్నారు. 
 
చిత్తూరు జిల్లా రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరంగా ఉంటాయి. నువ్వానేనా అన్నట్లు సీట్లు గెలుచుకుంటాయి రెండు పార్టీలు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా వీచిన వైసీపీ గాలిలో చిత్తూరు జిల్లాలో కూడా ఒక్కటి మినహా అన్ని స్థానాలు వైసీపీనే గెలుచుకుంది. గెలిచినవారిలో కూడా పార్టీలో సీనియర్లు, జగన్‌కు ముఖ్యులు కూడా ఉండడంతో ఏ పదవులు పందేరం జరిగినా చిత్తూరు జిల్లాకు ఆ పదవుల్లో భాగస్వామ్యం ఉంటుందని ఆశ పడుతూ ఉంటారు. ఇప్పుడు మంత్రిమండలి విషయంలో కూడా అలాగే అక్కడి ఎమ్మెల్యేలు ఆశలు పెట్టుకున్నారు. 
 
వీరిలో ముందు వరసలో ఉన్నది చెవిరెడ్డి బాస్కర్ రెడ్డి, రోజా. పైర్ బ్రాండ్‌గా పేరొందిన వీరిద్దరు సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితులు. మొదటి నుంచి సామాజిక సమీకరణాలు వేసుకుని పదవుల పందేరం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఆ లెక్కన గతంలో జిల్లా నుంచి ఒక సీనియర్ రెడ్డి నాయకుడు పెద్దిరెడ్డితో పాటు మరో ఎస్సీకి అవకాశం కల్పించారు. దీంతో జిల్లా కోటా అయిపోయింది. ఇప్పుడు కొత్తవారికి స్థానం కల్పిస్తారని ప్రచారం జరుగుతుండడంతో తమకంటే తమకే మంత్రి పదవి వస్తుందని ఎమ్మెల్యేలు ఆశలు పెట్టుకున్నారు. 
 
మొదటి విడతలోనే మంత్రి పదవి వస్తుందని చెవిరెడ్డి బాస్కర్ రెడ్డితో పాటు రోజా కూడా ఆశించారు. అయితే వారిద్దరికి మొదటి విడతలో అవకాశం రాలేదు. దీంతో వారు అసంతృప్తికి గురయ్యారు. దానిని చల్లార్చడం కోసం రోజాకు ఏపీఐఐసీసీ చైర్మన్ పదవి ఇచ్చారు. చెవిరెడ్డికి తుడా చైర్మన్‌తో పాటు టీటీడీ బోర్డు మెంబర్ పదవి కూడా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం జిల్లా నుంచి మంత్రి పదవుల్లో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీనియర్ నేత. పార్టీలో కీలక వ్యక్తి. ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించే అవకాశాలు ఉండకపోవచ్చు. 
 
అదే జరిగితే జిల్లా నుంచి ఇద్దరు రెడ్లకు అవకాశం రాదు. ఆ లెక్కన చెవిరెడ్డికి గానీ, రోజాకు గానీ మంత్రి పదవి వచ్చే అవకాశాలు లేవు. ఇక జిల్లా నుంచి మంత్రిమండలిలో ఉన్న మరో నేత నారాయణ స్వామి. ఈయన ఎస్సీ కోటాలో మంత్రి అయ్యారు. ఈయనను తొలగిస్తే ఆ స్థానంలో మరో ఎస్సీకే అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ లెక్కన జిల్లాలో ఉన్న మరో ఎస్సీ ఎమ్మెల్యేకు అవకాశం రావచ్చు. లేదంటే మరో జిల్లా నుంచి ఎస్సీలకు ప్రాతినిద్యం లభిస్తే చిత్తూరు జిల్లా నుంచి మరో నేతకు అవకాశం ఉంటుంది. ఆ అవకాశం ఎవరికి వస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సారి పదవి దక్కకపోతే అసంతృప్తికి లోనయ్యే నాయకులను ఏవిధంగా సముదాయిస్తారన్నది చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇక ఆన్‌లైన్‌లో పోస్ట‌ల్ సేవ‌లు